ఆంధ్ర విశ్వవిద్యాలయం, ఆగస్టు 24 ఏయూ సైన్స్ కళాశాల బయోటెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో “ఎమర్జింగ్ ఫ్రాంటియర్స్ ఇన్ బయోటెక్నాలజీ: ఏఐ, ఫెర్మెంటేషన్ టెక్నాలజీ అండ్ బయోమ్యాన్యుఫ్యాక్చరింగ్” అంశంపై నిర్వహిస్తున్న ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ నేడు ఏయూ ప్లాటినం జూబ్లీ గెస్ట్‌హౌస్‌లో ప్రారంభమైంది.
కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా ఐఐటీ ఖరగ్‌పూర్ ప్రొఫెసర్ డా. రామకృష్ణ సేన్ పాల్గొన్నారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బయోటెక్నాలజీ పరిణామం బ్రెడ్, ఆల్కహాల్ తయారీ వంటి సంప్రదాయ ఫెర్మెంటేషన్ ప్రక్రియల నుంచి పెనిసిలిన్, ఇన్సులిన్, మోనోక్లోనల్ యాంటీబాడీస్ వంటి అధునాతన జీవ ఉత్పత్తుల తయారీ వరకు విస్తరించిందన్నారు. జన్యు ఇంజినీరింగ్, మెటబాలిక్ ఇంజినీరింగ్, సిస్టమ్స్ బయాలజీ దశలను దాటి ప్రస్తుతం సింథటిక్ బయాలజీ వైపు రంగం వేగంగా పయనిస్తోందని తెలిపారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఫెర్మెంటేషన్ టెక్నాలజీ, సింథటిక్ బయాలజీ, బయోమ్యాన్యుఫ్యాక్చరింగ్ వంటి ఆధునిక సాంకేతికతలు బయోటెక్నాలజీ రంగంలో విప్లవాత్మక మార్పులకు దారితీస్తున్నాయని పేర్కొన్నారు. అయితే సాంకేతిక పురోగతితోపాటు మానవ విలువలు, నైతిక బాధ్యత, సృజనాత్మకత ఆలోచనకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
ఈ పరిణామంలో ఏఐ, భారీ స్థాయి డేటా విశ్లేషణ, ప్రొటీన్ డిజైన్ వంటి సాంకేతికతలు కీలకంగా మారుతున్నాయని చెప్పారు. కొత్త జీవ ఉత్పత్తులను వేగంగా రూపొందించడం, పరిశోధన ప్రక్రియలను మెరుగుపరచడం, ఉత్పత్తి విధానాలను ఆప్టిమైజ్ చేయడంలో ఏఐ అపారమైన అవకాశాలను అందిస్తోందన్నారు. ప్రపంచం బయో ఆధారిత ఆర్థిక వ్యవస్థ వైపు అడుగులు వేస్తున్న నేపథ్యంలో బయోమ్యాన్యుఫ్యాక్చరింగ్ భవిష్యత్తులో కీలక రంగంగా ఎదగనుందని పేర్కొన్నారు. ఏఐను మాత్రం అర్థవంతంగా, బాధ్యతాయుతంగా వినియోగించాల్సిన అవసరం ఉందని సూచించారు.
ఏయూ ఉపకులపతి ఆచార్య జి.పి. రాజశేఖర్ మాట్లాడుతూఅధ్యాపకులు, విద్యార్థులు, పరిశోధకులు నిపుణులతో చర్చలు జరిపి తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలని, కేవలం ఉపన్యాసాలకు పరిమితం కాకుండా పరస్పర చర్చల ద్వారా జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఇలాంటి కార్యక్రమాలు పరిశోధనా దృక్పథాన్ని, సాంకేతిక సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ఉపయోగపడతాయని అన్నారు.
బయోటెక్నాలజీ, బయోమ్యాన్యుఫ్యాక్చరింగ్ రంగాల్లో ఏఐ, ఫెర్మెంటేషన్ టెక్నాలజీ, బయోమెటీరియల్స్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించుకోవాలని అన్నారు. అనేక పారామీటర్లతో కూడిన బయోమ్యాన్యుఫ్యాక్చరింగ్ ప్రక్రియల్లో వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఏఐ ఆధారిత సాధనాలు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. ఉత్పత్తి ప్రక్రియలను వేగంగా, కచ్చితంగా ఆప్టిమైజ్ చేయడంలో ఆధునిక సాంకేతికతలు దోహదపడతాయని తెలిపారు.
సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎం. వి.ఆర్ రాజు మాట్లాడుతూ ఏఐ ఎంత అభివృద్ధి చెందినా మానవ మేధస్సు, విమర్శనాత్మక ఆలోచన, సృజనాత్మకత, భావోద్వేగ మేధస్సు, నైతిక విచక్షణకు ప్రత్యామ్నాయం కాదన్నారు. సాంకేతికతను ఎప్పుడు విశ్వసించాలి, ఎప్పుడు ప్రశ్నించాలి అనే విషయాన్ని గుర్తించడం భవిష్యత్ పరిశోధకులకు అత్యంత ముఖ్యమైన నైపుణ్యమని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు కేవలం సమాచారాన్ని అందించే వారిగా కాకుండా విద్యార్థుల్లో జిజ్ఞాస, సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచనను పెంపొందించే మార్గదర్శకులుగా వ్యవహరించాలని సూచించారు.
సీఎస్‌ఐఆర్–ఐఎంఎంటీ శాస్త్రవేత్త ఎం. కిరణ్ కుమార్ మాట్లాడుతూ, ఫెర్మెంటేషన్ టెక్నాలజీలో ప్రస్తుత పురోగతి, భవిష్యత్ అవకాశాలు, రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై మరింత విస్తృత పరిశోధన అవసరమన్నారు. జన్యు ఇంజినీరింగ్, సంబంధిత సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధితోపాటు ఫెర్మెంటేషన్ ప్రక్రియల్లో ఉన్న పరిమితులను గుర్తించి పరిష్కారాలను అన్వేషించాల్సిన అవసరం ఉందన్నారు. శాస్త్రీయ సమాచారం సేకరణ, డేటా ఆధారిత పరిశోధన ద్వారా ఫెర్మెంటేషన్ టెక్నాలజీని మరింత అభివృద్ధి చేయవచ్చని తెలిపారు.
బయోటెక్నాలజీ విభాగాధిపతి, సదస్సు కన్వీనర్ ఆచార్య పి.రాధిక మాట్లాడుతూ బయో టెక్నాలజీ రంగం వేగంగా రూపాంతరం చెందుతున్న ప్రస్తుత తరుణంలో కృత్రిమ మేధస్సు (AI), ఆధునిక ఫెర్మెంటేషన్ టెక్నాలజీ, ప్రాసెస్ ఇంజినీరింగ్, బయోమాన్యుఫ్యాక్చరింగ్ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.




0 Comments