విశాఖపట్నం, ఆగస్టు 27: నగరంలో పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి లోపాలు కనిపించకూడదని, విధుల నిర్వహణలో అలసత్వం ప్రదర్శించే అధికారులను సహించేది లేదని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ స్పష్టం చేశారు. గురువారం జీవీఎంసీ సౌత్ జోన్ పరిధిలోని 29, 32, 33వ వార్డుల్లో సౌత్ జోనల్ కమిషనర్ ఎం. మల్లయ్య నాయుడుతో కలిసి ఆయన ఆకస్మికంగా పర్యటించారు.
అల్లిపురం, కెప్టెన్ రామారావు జంక్షన్, సరస్వతి పార్కు, జిల్లా జడ్జి కోర్టు పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు, ప్రధాన రహదారుల స్వీపింగ్, తాగునీటి సరఫరా, ఇంటింటి చెత్త విభజన, జీవీఎంసీ వాహనాలకు వ్యర్థాలను అందజేస్తున్న విధానాలను కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ముందుగా 33వ వార్డు అల్లిపురం ప్రధాన రహదారిలో స్వీపింగ్, పారిశుద్ధ్య పనులను పరిశీలించిన కమిషనర్, నిర్వహణలో లోపాలను గుర్తించి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సంబంధిత శానిటరీ ఇన్‌స్పెక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, విధుల నిర్వహణలో నిర్లక్ష్యం, అలసత్వం కనబరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పారిశుద్ధ్య లోపాలు పునరావృతం కాకుండా ప్రత్యేక కార్యాచరణ రూపొందించి, చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం 32వ వార్డు అల్లిపురం పరిసర ప్రాంతాల్లో పర్యటించి స్థానిక నివాసితులతో కమిషనర్ మాట్లాడారు. ప్రతిరోజూ తాగునీరు నిర్ణీత సమయానికి సరఫరా అవుతున్నదా, నీటి ఒత్తిడి, నాణ్యత ఎలా ఉన్నాయనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ప్రతిరోజూ నిర్ణీత సమయానికి తాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని, సరఫరా చేస్తున్న నీటికి నిరంతరం నాణ్యత పరీక్షలు నిర్వహించి పర్యవేక్షించాలని కార్యనిర్వాహక ఇంజనీర్ మురళీకృష్ణను ఆదేశించారు.
తదుపరి 29వ వార్డు సరస్వతి పార్కు నుంచి జిల్లా జడ్జి కోర్టు పరిసర ప్రాంతం వరకు పర్యటించి ఇంటింటి చెత్త విభజన, సేకరణ విధానాన్ని పరిశీలించారు. పలు ప్రాంతాల్లో వ్యర్థాలను బహిరంగంగా పడవేయడాన్ని గుర్తించిన కమిషనర్, చెత్త పేరుకుపోవడానికి కారణాలపై అధికారులను ప్రశ్నించారు. జడ్జి కోర్టు సమీపంలోని ఒక అపార్ట్‌మెంట్ నిర్వాహకులు తడి, పొడి చెత్తను వేరు చేసేందుకు అవసరమైన డస్ట్‌బిన్లు ఏర్పాటు చేసుకోకుండా, జీవీఎంసీ చెత్త సేకరణ వాహనాలకు వ్యర్థాలను అందజేయకుండా రోడ్డుపై బహిరంగంగా పడవేస్తున్నట్లు గుర్తించారు. దీనిపై కమిషనర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
జీవీఎంసీ ప్రతిరోజూ ఇంటింటి నుంచి వ్యర్థాలను సేకరించేందుకు వాహనాలను అందుబాటులో ఉంచుతున్నప్పటికీ, రోడ్లపై చెత్తను వేయడం ద్వారా పరిసరాలను అపరిశుభ్రం చేయడంతో పాటు దోమలు, ఈగల వ్యాప్తికి కారణమై ప్రజారోగ్యానికి భంగం కలిగిస్తున్నారని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన సదరు సాగర్ స్క్వేర్ అపార్ట్‌మెంట్‌ను వెంటనే సీజ్ చేయాలని జోనల్ కమిషనర్ ఎం. మల్లయ్య నాయుడును ఆదేశించారు. కమిషనర్ ఆదేశాల మేరకు జోనల్ కమిషనర్ వెంటనే అపార్ట్‌మెంట్‌ను సీజ్ చేయించారు.
అపార్ట్‌మెంట్ పరిసరాల్లో బహిరంగంగా పేరుకుపోయిన వ్యర్థాలను పారిశుద్ధ్య కార్మికులతో తొలగించి, ప్రాంతాన్ని పూర్తిగా శుభ్రపరిచారు. అనంతరం ఆ ప్రదేశాన్ని రంగవల్లులతో అలంకరించి పరిశుభ్రంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.
ప్రతి గృహం, అపార్ట్‌మెంట్‌లో తడి, పొడి, హానికర వ్యర్థాలను తప్పనిసరిగా వేరు చేసి, జీవీఎంసీ వ్యర్ధాలు సేకరణ వాహనాలకు మాత్రమే అందజేయాలని కమిషనర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రోడ్లు, కాలువలు, ఖాళీ ప్రదేశాల్లో చెత్తను పడవేసేవారిపై జరిమానాలతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ పర్యటనలో అసిస్టెంట్ ఇంజనీర్ విల్సన్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ చిన్నాజీ, వార్డు అమినిటీస్ కార్యదర్శులు, శానిటేషన్ కార్యదర్శులు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
పౌర సంబంధాల అధికారి,జీవీఎంసీ.
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
0 Comments