ప్రతి వార్డులో పార్టీని బలోపేతం చేసి 100 శాతం విజయమే లక్ష్యం: జనసేన నగర అధ్యక్షులు, దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు*
రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసి, ప్రతి వార్డులో విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని జనసేన పార్టీ విశాఖ నగర అధ్యక్షులు, దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
సీతంపేటలోని జనసేన పార్టీ నగర కార్యాలయంలో ఆయన ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల నిర్వహణతో పాటు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని నియోజకవర్గ ఇన్‌చార్జిలు, వార్డు అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, ముఖ్య నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ, సెప్టెంబర్ 2న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలను ప్రతి వార్డులో ఘనంగా నిర్వహించాలని సూచించారు. రక్తదాన శిబిరాలు, సేవా కార్యక్రమాలు, ప్రజలకు ప్రత్యక్షంగా ఉపయోగపడే కార్యక్రమాలను చేపట్టి జనసేన పార్టీ ప్రజా సేవా కార్యక్రమాలకు మరింత బలం చేకూర్చాలని కోరారు.
సెప్టెంబర్ 2న జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ విశాఖపట్నం రానున్నారని, సెప్టెంబర్ 3న ఆయన అధ్యక్షతన కార్పొరేషన్ ఎన్నికలపై ఉత్తర నియోజకవర్గంలో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.
*ప్రతి వార్డులో పార్టీకి బలమైన వ్యవస్థ*
జీవీఎంసీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎన్నికల సన్నద్ధతలో నిమగ్నం కావాలని వంశీకృష్ణ శ్రీనివాస్ సూచించారు. నియోజకవర్గ ఇన్‌చార్జిలు మరింత బాధ్యతతో వ్యవహరించి, ప్రతి వార్డులో పార్టీ బలాలు, బలహీనతలను గుర్తించి సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలన్నారు.
జీవీఎంసీ ఎన్నికల్లో 120 వార్డులకు తుది రూపు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కొత్త వార్డుల పరిధులు, స్థానిక పరిస్థితులు, ప్రజల అభిప్రాయాలు, పార్టీకి ఉన్న బలాబలాలను సమగ్రంగా అంచనా వేసి ఎన్నికల వ్యూహాన్ని రూపొందిస్తామని తెలిపారు.
“గెలిచే అవకాశం ఉన్న ఏ ఒక్క సీటును కూడా వదులుకోం. పవన్ కళ్యాణ్ గారు సూచించిన విధంగా 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించడమే మా లక్ష్యం” అని వంశీకృష్ణ శ్రీనివాస్ స్పష్టం చేశారు.
*సర్వే ఆధారంగా అభ్యర్థుల ఎంపిక*
ప్రతి వార్డులో పార్టీ పరిస్థితిపై సమగ్ర సర్వేలు నిర్వహించి నివేదికలు సేకరిస్తామని, అభ్యర్థుల ఎంపికలో వాటిని కీలకంగా పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. గత ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతాన్ని మాత్రమే అభ్యర్థుల ఎంపికకు కొలమానంగా తీసుకోబోమని, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రజాదరణ, క్షేత్రస్థాయి బలం, పార్టీ కోసం చేసిన కృషి వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు.
మహిళలు, బీసీలకు లభించే రిజర్వేషన్లను దృష్టిలో ఉంచుకుని సామాజిక సమతుల్యతతో అభ్యర్థుల ఎంపిక చేపడతామని తెలిపారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి నాయకుడు, కార్యకర్తకు తగిన గుర్తింపు, గౌరవం ఉంటుందని స్పష్టం చేశారు.
*మేయర్ ఎన్నికపై ప్రత్యేక వ్యూహం*
ఈసారి మేయర్ ఎన్నిక ప్రత్యక్ష పద్ధతిలో జరగనున్న నేపథ్యంలో ఎన్నికల వ్యూహం మరింత కీలకమైందని వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. కొత్త వార్డుల పరిధులు, స్థానిక రాజకీయ సమీకరణాలు, పార్టీ బలాలను సమగ్రంగా అధ్యయనం చేసి పటిష్టమైన వ్యూహంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు.
రానున్న రోజుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితో మరోసారి సమావేశమై ఎన్నికల వ్యూహంపై చర్చిస్తామని తెలిపారు. పవన్ కళ్యాణ్ గారు స్వయంగా అభ్యర్థుల కేటాయింపు ప్రక్రియను పర్యవేక్షిస్తారని చెప్పారు.
*నవంబర్‌లోపు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి*
నవంబర్ 20వ తేదీలోపు మున్సిపల్, గ్రామ పంచాయతీ, జిల్లా పరిషత్ ఎన్నికలు పూర్తయ్యే అవకాశం ఉన్నందున పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరంతరం ప్రజల్లో ఉండాలని పిలుపునిచ్చారు.
“అసెంబ్లీ ఎన్నికలకు, స్థానిక సంస్థల ఎన్నికలకు చాలా తేడా ఉంటుంది. స్థానిక ఎన్నికల్లో ప్రతి వార్డు, ప్రతి గ్రామం, ప్రతి ప్రాంతంలో బలమైన పార్టీ వ్యవస్థ ఉండాలి. అందుకే ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టాలి” అని అన్నారు.
ఎన్నికల నిర్వహణ, అభ్యర్థుల ఎంపిక, వార్డుల వారీగా పార్టీ బలాబలాలపై సమన్వయంతో పనిచేసేందుకు పార్టీ సీనియర్లతో టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. జనసేన పార్టీ పోటీ చేసే అన్ని స్థానాల్లో గెలుపే లక్ష్యంగా నియోజకవర్గాల వారీగా ప్రత్యేక సమావేశాలు నిర్వహించి నాయకులు, కార్యకర్తల సలహాలు, సూచనలు తీసుకుంటామని తెలిపారు.
*
విశాఖలో జనసేన నంబర్-1 పార్టీ కావాలి*రానున్న రోజుల్లో జనసేన పార్టీ విశాఖపట్నంలో నంబర్-1 పార్టీగా నిలవడమే లక్ష్యం అని వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంపై విశ్వాసంతో ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు జనసేనలోకి వచ్చేలా క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
“13 సంవత్సరాలు జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవంతో పార్టీ సంస్థాగత నిర్మాణం, ఎన్నికల నిర్వహణపై పూర్తి అవగాహన ఉంది. ఆ అనుభవాన్ని ఉపయోగించి విశాఖలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేసి, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయాన్ని సాధించేందుకు కృషి చేస్తాను” అని వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు.
నాయకులు, కార్యకర్తలు వ్యక్తిగత భేదాలను పక్కనపెట్టి ఐక్యంగా పనిచేసి, ప్రతి వార్డులో జనసేన జెండా ఎగురవేయాలని, జనసేన పార్టీ విజయమే ఏకైక లక్ష్యంగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.
పెందుర్తి ఎమ్మెల్యే గౌరవ పెద్దలు శ్రీ పంచకర్ల రమేష్ బాబు, MSME చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్, మాజీ ఎమ్మెల్యే ఎస్.కె. రెహమాన్, నియోజకవర్గ ఇన్‌చార్జ్ పసుపులేటి ఉషాకిరణ్, పంచకర్ల సందీప్, అంగ దుర్గా ప్రశాంతి, మాజీ కార్పొరేటర్లు, రాష్ట్ర , జిల్లా, వార్డు లో వివిధ హోదాల్లో ఉన్న పార్టీ తదితరులు, వార్డు అధ్యక్షులు, పార్టీ నాయకులు, జనసైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




0 Comments