తెలుగుకి వెలుగు గిడుగు - ఏయూలో గిడుగు వేంకట రామమూర్తి జ‌యంతి నిర్వ‌హ‌ణ‌


 ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం, ఆగ‌స్టు 27:వ్యవహారిక భాషోద్యమ పితామహాలు, భాషాతపస్వి  "కళాప్రపూర్ణ" శ్రీ గిడుగు వేంకట రామమూర్తి 163వ జయంతిని పుర‌స్క‌రించుకుని గురువారం ఆంధ్ర విశ్వకళా పరిషత్ తెలుగు శాఖ సమావేశ మందిరంలో తెలుగు భాషాదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పద్మ భూషణ్ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, తెలుగు శాఖాధిపతి ఆచార్య జర్రా అప్పారావు గిడుగు వేంకట రామమూర్తి గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ముఖ్య అతిథి ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్  మాట్లాడుతూ గిడుగు రామమూర్తి పంతులు వ్యవహారిక భాష పైన, సవర భాష పైన ఎంతో కృషి చేశారు . మహనీయులు ఈ లోకములో గొప్ప కార్యాలను సాధించడం కోసం మాత్రమే పుడతారని, జీవితాన్ని భాషోద్యమాల కోసమే వెచ్చించిన కారణజన్ములు  గిడుగు రామమూర్తి అని అన్నారు. ఆయన జీవితాన్ని వ్యవహారిక భాష కోసం అంకితం చేసిన మహానుభావుడు ఈ సందర్భంగా నేను లోకనాయక్ ఫౌండేషన్ తరపున తెలుగు శాఖకు లక్ష రూపాయలను అందించారు. ప్రతి సంవత్సరము ఆ లక్ష రూపాయలతో వచ్చినటువంటి వడ్డీతో తెలుగు శాఖలో ఉన్నటువంటి పరిశోధకులు ఆచార్యులు విద్యార్థులలో భాషా  ప్రావీణ్యులు ఎవరైతే వారికి గిడుగు రామమూర్తి పుట్టిన రోజున అవార్డును ఇవ్వాల‌ని ఆచార్య ల‌క్ష్మీ ప్ర‌సాద్ సూచించారు.

విభాగాధిప‌తి ఆచార్య జర్రా అప్పారావు మాట్లాడుతూ వ్యవహారిక భాషోద్యమ పితామహుడు, మాహా మహోపాధ్యాయ, రావ్ సాహెబ్ గిడుగు రామ్మూర్తి గారు వ్యవహారిక భాషను తల్లితో,గ్రాంథిక భాషను మూలపుటమ్మతో పోల్చారని ఆయన గ్రాంథిక భాష వ్యతిరేకి కాదని చెప్పారు. ఈనాడు మనం అనుభవిస్తున్న ఈ వ్యవహారిక భాషా సాహిత్యానికి ఆయనే పూర్వరంగం అని కొనియాడారు. గిడుగు సేవలను గుర్తించే 1938 లో ఆంధ్ర విశ్వకళాపరిషత్ "కళాప్రపూర్ణ"తో సత్కరించిందని గుర్తుచేశారు.

తెలుగు శాఖ  బోర్డు ఆఫ్ స్టడీస్ ఛైర్మన్ ఆచార్య నల్లా సత్యనారాయణ  మాట్లాడుతూ తెలుగు శాఖలో గిడుగు రామమూర్తి  వంటి మహానుభావులు జయంతి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉన్నదన్నారు.  ఇటువంటి సమావేశాలు జరగడం వలన విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. 

ఆచార్య గజ్జ యోహాన్ బాబు  మాట్లాడుతూ గిడుగు రామమూర్తి పంతులు వలన ఈ సమాజం చైతన్యవంతం అయినది అని చెప్పారు అంతేకాకుండా సవర భాష మీద వ్యవహారిక భాష మీద తాను కృషి చేయడమే కాకుండా గ్రాంథిక భాషా వాదుల లోపాలను  కూడా చెప్పారు .

డా॥ మరడాన సుబ్బారావు  మాట్లాడుతూ  వ్యవహారిక భాష గురించి, సవర భాష గురించి ,ఆయన చేసినటువంటి సేవ జీవితంలో మరిచిపోలేనిది .అంతేకాకుండా గ్రాంథిక వాదులతో పోరాడి వ్యవహారిక భాషను ప్రజల దగ్గరికి చేర్చినటువంటి మహానుభావుడు గిడుగు రామమూర్తి పంతులు అని  అన్నారు  సవర భాష కోసం ఎనలేని సేవ చేశారని అంతేకాకుండా సవర భాషలో వాచకాలు, పాటలు, నిఘంటువులు కూడా చేశారని సుబ్బారావు గారు అన్నారు. సవర భాష మీద అంతర్జాతీయమైనటువంటి పరిశోధన చేసినటువంటి వారు గిడుగు రామమూర్తి పంతులు గారిని  ప్రశంసించారు. 

ఆచార్య వెలమల సిమ్మన్న మాట్లాడుతూ తెలుగుకు వెలుగు గిడుగు అని అన్నారు. గ్రాంథికవాదుల అజ్ఞానం గిడుగుకి మహా ఆయుధం అయింది. భారత యుద్ధం లాంటి భాషా యుద్ధం చేశారు గిడుగు అని అన్నారు. గిడుగు రెండు పెద్ద ఉద్యమాలు చేశారు. ఒకటి గ్రాంథికవాదుల అజ్ఞానాన్ని బయటపెట్టడం కోసం గ్రాంథిక భాషోద్యమం చేశారు. రెండు జ్ఞానం లేని సవరలకు జ్ఞానాన్ని కలిగించడానికి సవర భాషోద్యమం చేపట్టారు. ఈ రెండు ఉద్యమాలు గిడుగు ప్రజల కోసమే చేశారు. ప్రజల భాషలో రాశారు. ప్రజల మనిషి అయ్యరు. ప్రజలకుదగ్గర అయ్యారని సిమ్మన్న గారు  అన్నారు. గిడుగు "బాలకవి శరణ్యం" , "ఆంధ్ర పండిత భిషక్కుల భాషాభేషజం",  "గద్యచింతామణి"," వ్యాసావళి"," సూర్యరాయాంధ్ర నిఘంటువు విమర్శనం" మొదలైన గ్రంథాలు రాశారని  ఆచార్య సిమ్మన్న తెలియజేశారు.

ఆర్ట్స్ కళాశాల పూర్వ  ప్రిన్సిపాల్ ఆచార్య అడ్డాడ నరసింహారావు గారు, డా. చంద్రశేఖర రావు గారు మాట్లాడారు. 

అంతర్జాతీయ  విద్యార్థి వివేక్ కవిత చదివారు. ఈ కార్యక్రమంలో తెలుగు శాఖ అధ్యాపకులు డా. ఎం. కృష్ణవేణి, డా. ఎం.దాసు, డా.బి.సూర్యనారాయణ, డా. ఎం.ప్రతాప్, డా.పి.శ్రీనివాసరావు, డా. ఎల్.గిరీష్ కుమార్, డా.ఆర్.శివయ్య, ఎం. ఏ. తెలుగు పూర్వవిద్యార్థి, ప్రముఖ జర్నలిస్ట్  గంట్ల శ్రీ‌నుబాబు,పితాని ప్రసాద్ మరియు సాహితీవేత్తలు, పుర ప్రముఖులు, భాషాభిమానులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments