విశాఖపట్నం: గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ వార్డుల డీలిమిటేషన్‌కు సంబంధించి అధికారులు విడుదల చేసిన నోటిఫికేషన్‌పై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు కెకె రాజు స్పందించారు. కొంతకాలంగా కార్పొరేషన్ వార్డుల సంఖ్యపై ప్రభుత్వం, అధికారులు స్పష్టత లేకుండా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. తొలుత 98 నుంచి 120 వార్డులకు పెంచుతామని, మరోవైపు భీమిలి, ఆనందపురం, పద్మనాభం, పెందుర్తి తదితర గ్రామాలు, మండలాలను నగర పరిధిలో కలుపుతామని ప్రకటిస్తూ నగర ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని అన్నారు.
ఎన్నో దశాబ్దాలుగా కలిసి మెలిసి జీవిస్తున్న గ్రామాలను డీలిమిటేషన్ పేరుతో అడ్డదిడ్డంగా విభజించడం వల్ల ఆయా ప్రాంతాల సామాజిక, సాంస్కృతిక స్వరూపం దెబ్బతింటోంది. ఒక గ్రామంతో మరో గ్రామానికి ఉన్న అనుబంధాలను తెంచుతూ, తరతరాలుగా కొనసాగుతున్న సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రజల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోకుండా కేవలం సరిహద్దులు మార్చడం సరైన విధానం కాదు. ఈ తరహా అడ్డగోలు డీలిమిటేషన్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గ్రామాల ఉనికిని, ప్రజల ఐక్యతను, తరతరాలుగా కొనసాగుతున్న సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
120 వార్డులు చేసినా, 150 వార్డులు చేసినా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కి ఎలాంటి అభ్యంతరం లేదని కెకె రాజు స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలకు వెళ్లేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. అయితే ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, ప్రజలకు పరిపాలనా సౌలభ్యం ఉండటం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. ఇటీవల విడుదల చేసిన వార్డుల డీలిమిటేషన్ నోటిఫికేషన్‌లో మార్పులు చేయడంపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు.
గతంలో 2026 మే నెలలో విడుదల చేసిన నోటిఫికేషన్‌కు, ప్రస్తుతం సెప్టెంబర్‌లో విడుదల చేసిన నోటిఫికేషన్‌కు మధ్య నాలుగు నెలలు కూడా పూర్తికాకముందే మార్పులు చేయడం ఎందుకు జరిగిందో అధికారులు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలు, వినతుల ఆధారంగానే మార్పులు చేసినట్లయితే, ఎవరి అభ్యంతరాల మేరకు ఏయే మార్పులు చేశారో అధికారులు బహిరంగంగా వెల్లడించాల్సిన అవసరం ఉందని కెకె రాజు అన్నారు. నోటిఫికేషన్‌లో కానీ, పత్రికా ప్రకటనలో కానీ ఈ వివరాలను స్పష్టంగా తెలియజేయకుండా మార్పులు చేయడం సరైన విధానం కాదని పేర్కొన్నారు.
ఈ అంశంపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో సమాలోచనలు జరిపామని ఆయన తెలిపారు. పార్టీ సమన్వయకర్తలు, పరిశీలకులు, మాజీ వార్డు కార్పొరేటర్లు, వార్డు పార్టీ అధ్యక్షులతో చర్చించిన అనంతరం 120 వార్డులు చేసినా, 150 వార్డులు చేసినా ఎన్నికలకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
అయితే పరిపాలనా సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన సచివాలయాల మ్యాపింగ్ విషయంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కొన్ని ప్రాంతాల్లో ఒక వార్డుకు సంబంధించిన సచివాలయాన్ని మరో వార్డుతో మ్యాపింగ్ చేయడం వల్ల ప్రజలకు పరిపాలనా పరమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. ఒక వార్డులో ఉన్న సచివాలయం అదే వార్డుకు అనుసంధానమై ఉండేలా మ్యాపింగ్ చేయాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటోందని కెకె రాజు తెలిపారు.
ప్రజల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ మార్పులు చేపట్టాలని కోరారు. ఈ అంశంపై పార్టీ నాయకులతో కలిసి మంగళ వారం జిల్లా కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్‌ను కలిసి వినతిపత్రం అందజేయనున్నట్లు ఆయన వెల్లడించారు. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా ప్రజలకు పరిపాలనా సౌలభ్యం కల్పించాలనే ఉద్దేశంతోనే తమ పార్టీ ఈ విజ్ఞప్తి చేస్తోందని కెకె రాజు స్పష్టం చేశారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా చేపట్టిన మార్పులను అధికారులు పునఃపరిశీలించాలని, ప్రజల సౌకర్యానికి అనుగుణంగా తుది నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు.

0 Comments