ఏసీబీ వలలో తితిదే డిప్యూటీ ఈవో* * కల్తీ నెయ్యి కేసులో ఉద్యోగుల అక్రమాస్తులపై సీబీఐ సమాచారం మేరకు సోదాలు * లోకనాథం ఇంట్లో 2 కిలోల బంగారం, 6.50 కిలోల వెండి, రూ. 5 కోట్ల ఆస్తుల గుర్తింపు


తిరుమల: కల్తీ నెయ్యి కేసులో సిట్ అనుమానితుల జాబితాలో ఉన్న శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో మొండు లోకనాథం ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ గుర్తించింది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి వినియోగించిన వ్యవహారంలో ఇప్పటికే తితిదే ఉద్యోగులు, డెయిరీ నిపుణులపై సీబీఐ నేతృత్వంలోని సిట్ కేసు నమోదు చేయగా.. మరికొందరి పాత్రపైనా అనుమానాలు వ్యక్తం చేస్తూ వారిపై విచారణ జరిపించాలని ప్రభుత్వానికి సూచించింది. ఈ నేపథ్యంలో బుధవారం తిరుపతి పెద్దకాపు లేఅవుట్‌లోని లోకనాథం నివాసంతోపాటు స్థానికంగా ఉన్న అతని భార్య సోదరులు మునికృష్ణ, రమేష్ ఇళ్లు, ఏర్పేడు మండలంలోని లోకనాథం తమ్ముడి నివాసాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. తొలి రోజు సోదాల్లో ప్రభుత్వ ధర ప్రకారం రూ. 5 కోట్ల ఆస్తులను గుర్తించారు. మార్కెట్ ధర ప్రకారం ఇది ఇంకా చాలా ఎక్కువే ఉండొచ్చు. గురువారం కూడా తనిఖీలు కొనసాగుతాయని అధికారులు ప్రకటించారు.

బుధవారం ఉదయం 6 గంటలకు లోకనాథం ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు మొదలు పెట్టారు. లోకనాథంతోపాటు కుటుంబసభ్యులను బయటకు వెళ్లనీయకుండా, వారి సమక్షంలో సోదాలు చేశారు. భార్య మంజుల పేరుతో పెద్దకాపు లేఅవుట్‌లో నివాసం కొనుగోలు చేశారని, ఆమె పేరుతోనే గొల్లవానిగుంటలో రెండు ఇంటి స్థలాలు, వడమాలపేట మండలం పాదిరేడు అరణ్యంలో ఓ ఫ్లాట్, తిరుపతి నగరంలోని శ్రీనివాసనగర్‌లో కుమారుడి పేరుతో ఓ ఇంటి స్థలం, లోకనాథం, ఆయన కుమారుడి పేరుతో బ్యాంకుల్లో నాలుగు ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నట్లు గుర్తించామని ఏసీబీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. దాదాపు దశాబ్దం తర్వాత తితిదే ఉద్యోగి ఇంట్లో ఏసీబీ తనిఖీలు జరగడం గమనార్హం. 2016లోనూ డిప్యూటీ ఈవోగా ఉన్న భూపతిరెడ్డి, ఆయన సోదరులు, బంధువుల ఇళ్లలో తనిఖీలు చేశారు.

వెల్లడైన ఆస్తుల వివరాలు ఇలా..

 * లోకనాథం భార్య, మరొకరి పేరుతో సంయుక్తంగా రూ. 31.98 లక్షల విలువైన మరో ఆస్తి ఉన్నట్టు సోదాల్లో వెల్లడైంది.

 * బీరువాలో రెండు కిలోల బంగారు ఆభరణాలు, 6.50 కిలోల వెండి వస్తువులు, రూ. 12.50 లక్షల నగదును గుర్తించారు.

 * లోకనాథం ప్రస్తుతం ఉన్న జీ ప్లస్ త్రీ భవనంతోపాటు పక్కవీధిలోని జీ ప్లస్ వన్ భవనానికి సంబంధించిన పత్రాలను గుర్తించారు.

 * ఎస్వీబీనగర్‌లోని ఎస్‌బీఐ లాకర్‌ను పరిశీలించినా దానిలో ఏమీ లభ్యం కాలేదు.

 * పెద్దకాపు లేఅవుట్‌లో నివాసం ఉంటున్న లోకనాథం బావలు మునికృష్ణ, రమేష్ ఇళ్లలోనూ మరో రెండు బృందాలు సోదాలు జరిపాయి. వీరి ఇళ్లలో తనిఖీలు కొనసాగుతున్నాయని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. వారిద్దరి నివాసాల్లో కలిపి రూ. 28 లక్షల నగదు, రెండు కిలోల బంగారం ఉన్నట్టు సమాచారం. ఏసీబీ అధికారులు ఈ వివరాలను నిర్ధారించాల్సి ఉంది.

 * నాలుగో బృందం ఏర్పేడు మండలం గుండ్ల కండ్రిగ గ్రామంలోని లోకనాథం తమ్ముడు వేణు ఇంట్లో సోదాలు జరిపింది. అక్కడ కుటుంబసభ్యుల పేరిట పది ఎకరాల వ్యవసాయ భూమి, ఇళ్లకు సంబంధించిన పత్రాలను గుర్తించినట్లు తెలుస్తోంది.

కారుణ్య నియామకంతో ఉద్యోగం

1989 ఫిబ్రవరి 1న కారుణ్య నియామకం కింద లోకనాథం తితిదేలో జూనియర్ అసిస్టెంట్‌గా చేరారు. అనంతరం సీనియర్ అసిస్టెంట్, అసిస్టెంట్ ఈవో, డిప్యూటీ ఈవోగా ఉద్యోగోన్నతి పొందారు. 2023 ఏప్రిల్ నుంచి శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవోగా తిరుమలలో పనిచేస్తున్నారు. అంతకుముందు తిరుచానూరులో విధులు నిర్వహించారు. గతేడాది తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి ఆలయానికి బదిలీ వచ్చినా.. శ్రీవారి ఆలయానికి నియమితులైన తితిదే అధికారి వైకాపాకు అనుకూలరని ఆరోపణలు రావడంతో బదిలీలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఈ క్రమంలో లోకనాథం డిప్యూటీ ఈవోగా కొనసాగుతున్నారు. ఏసీబీ అధికారులు బుధవారం తిరుమలలోని బీటైప్ క్వార్టర్స్‌లో ఉన్న ఆయన గదిని ఆధీనంలోకి తీసుకున్నప్పటికీ సోదాలు చేయలేదు.

ఆదాయానికి మించి ఆస్తులు గుర్తించాం

- మద్ది శ్రీనివాసరావు, ఏసీబీ డీఎస్పీ

Q> "తితిదే డిప్యూటీ ఈవో లోకనాథం ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించినట్లు గుర్తించాం. గురువారం పూర్తి వివరాలు వెల్లడిస్తాం. ప్రభుత్వ ఉద్యోగులు చేయాల్సిన పనికి డబ్బులు డిమాండ్ చేస్తే సమాచారం ఇవ్వాలి."

Post a Comment

0 Comments