జీవీఎంసీ ప్రత్యేక టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరంకు విశేష స్పందన – 267 వినతులుతొలిరోజే 83 దరఖాస్తుల పరిష్కారం – APDPMSలో 40, LRSలో 35, TDRలో 8 దరఖాస్తుల పరిష్కారం. * APDPMSపై 63, LRSపై 191, TDRపై 13 వినతుల స్వీకరణ. * 107 మంది అధికారులు, సిబ్బంది – 61 మంది LTPల భాగస్వామ్యంశుక్రవారం (11-9-2026) కూడా ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రత్యేక ఓపెన్ ఫోరం కొనసాగింపు. – ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్...

.విశాఖపట్నం, సెప్టెంబర్ 10: జీవీఎంసీ పరిధిలో APDPMS పెండింగ్ అనుమతులు/సమస్యలు, TDR ఆన్‌లైన్ పెండింగ్ సమస్యలు, LRS పెండింగ్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యాచరణగా చేపట్టిన రెండు రోజుల టౌన్ ప్లానింగ్ ప్రత్యేక ఓపెన్ ఫోరం కార్యక్రమానికి తొలిరోజు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశాల మేరకు గురువారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో అదనపు కమిషనర్ ఎస్.ఎస్. వర్మ, ముఖ్య పట్టణ ప్రణాళిక అధికారి ఎ. ప్రభాకర్ రావు కలిసి ఈ ప్రత్యేక ఓపెన్ ఫోరం కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ ప్రత్యేక ఓపెన్ ఫోరానికి నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి 267 మంది అర్జీదారులు హాజరుకాగా, మొత్తం 267 వినతులు అందాయి. వాటిలో APDPMSకు సంబంధించి 63, LRSకు సంబంధించి 191, TDRకు సంబంధించి 13 వినతులు ఉన్నాయి. ప్రజలు తమ పెండింగ్ దరఖాస్తులు, సమస్యలకు సంబంధించిన పత్రాలతో హాజరై సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.

"తొలిరోజే 83 దరఖాస్తుల పరిష్కారం" 

ప్రజల నుంచి అందిన వినతులను సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, APDPMSకు సంబంధించి 40, LRSకు సంబంధించి 35, TDRకు సంబంధించి 8 దరఖాస్తులు కలిపి మొత్తం 83 దరఖాస్తులను తొలిరోజే పరిష్కరించారు. మిగిలిన దరఖాస్తులను కూడా పరిశీలించి, నిబంధనలకు అనుగుణంగా పరిష్కారానికి అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను కమిషనర్ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో 107 మంది అధికారులు, సిబ్బందితో పాటు 61 మంది లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్స్ (LTPs) పాల్గొన్నారు. అదేవిధంగా LTPల ద్వారా 83 LRS దరఖాస్తులు సమర్పించబడ్డాయి. ప్రజలు, LTPలు, సంబంధిత అధికారులు ఒకేచోట అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేయడంతో పెండింగ్ దరఖాస్తులను నేరుగా పరిశీలించి, సమస్యలను గుర్తించి పరిష్కార ప్రక్రియను వేగవంతం చేసేందుకు అవకాశం ఏర్పడింది.

ఈ ప్రత్యేక ఓపెన్ ఫోరం సాధారణ టౌన్ ప్లానింగ్ సమస్యలన్నింటికీ కాకుండా, ప్రత్యేకంగా APDPMS ద్వారా పెండింగ్‌లో ఉన్న భవన నిర్మాణ అనుమతులు/సమస్యలు, TDR ఆన్‌లైన్ పెండింగ్ సమస్యలు, LRS పెండింగ్ సమస్యలు అనే మూడు అంశాల పరిష్కారానికే నిర్వహిస్తున్నట్లు కమిషనర్ స్పష్టం చేశారు. ఈ మూడు విభాగాల్లో పెండింగ్ సమస్యలను ప్రత్యేకంగా పరిశీలించి వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు రెండు రోజుల ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు తెలిపారు. ప్రజల నుంచి అందిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, నిబంధనల మేరకు పరిష్కరించగలిగిన వాటిపై తక్షణ చర్యలు చేపట్టాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. తదుపరి పరిశీలన అవసరమైన దరఖాస్తుల విషయంలోనూ అనవసర జాప్యానికి తావులేకుండా సంబంధిత అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టి పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.

"శుక్రవారం (11-9-2026)కూడా ప్రత్యేక ఓపెన్ ఫోరం" 

తొలిరోజు ప్రత్యేక ఓపెన్ ఫోరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించిన నేపథ్యంలో, ముందుగా నిర్ణయించిన మేరకు శుక్రవారం (సెప్టెంబర్ 11) కూడా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జీవీఎంసీ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో ప్రత్యేక టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరం కొనసాగుతుందని కమిషనర్ తెలిపారు.

కావున APDPMS పెండింగ్ అనుమతులు/సమస్యలు, TDR ఆన్‌లైన్ పెండింగ్ సమస్యలు, LRS పెండింగ్ సమస్యలు ఉన్న నగర ప్రజలు సంబంధిత దస్తావేజులు, అవసరమైన పత్రాలతో హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో సిటీ ప్లానర్ ధనుంజయ రెడ్డి, డిప్యూటీ సిటీ ప్లానర్లు, అసిస్టెంట్ సిటీ ప్లానర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులు, టీపీపీవోలు, వార్డు ప్లానింగ్ కార్యదర్శులు (WPRS), లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్స్ (LTPs), ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

పౌర సంబంధాల అధికారి,జీవీఎంసీ.

Post a Comment

0 Comments