ఆడపిల్లకు రక్షణ – యువతకు దిశా నిర్దేశం ఈగిల్ క్లబ్ పిలుపు

 


విశాఖపట్నం: ఆడపిల్లల రక్షణ, సాధికారతతో పాటు యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడే లక్ష్యంతో  ఈగిల్ క్లబ్ సెయింట్ జోసెఫ్‌స్ కాలేజ్ ఆధ్వర్యంలో సంతకాల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. “ఆడపిల్లను రక్షిద్దాం – మాదకద్రవ్య రహిత దేశాన్ని నిర్మిద్దాం” అనే సందేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు, తల్లిదండ్రులు, యువతతో పాటు పురుషులు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆడపిల్లల రక్షణ, విద్య, సాధికారత, సమాన హక్కుల ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. ప్రతి ఆడపిల్లకు సురక్షితమైన, గౌరవప్రదమైన వాతావరణాన్ని కల్పించడం కుటుంబం, విద్యాసంస్థలు, సమాజం మొత్తానికి బాధ్యత అని నిర్వాహకులు పేర్కొన్నారు.

అదేవిధంగా, మాదకద్రవ్యాల దుర్వినియోగం వల్ల యువత భవిష్యత్తుపై పడే ప్రతికూల ప్రభావాలను వివరించారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించాలని విద్యార్థులకు సూచించారు.


“ఆడపిల్లను రక్షించుకుందాం – యువతను మాదకద్రవ్యాల నుంచి కాపాడుదాం – బలమైన సమాజాన్ని, బలమైన దేశాన్ని నిర్మిద్దాం” అనే నినాదంతో నిర్వహించిన ఈ సంతకాల ప్రచారం సామాజిక బాధ్యత పట్ల విద్యార్థుల్లో చైతన్యాన్ని పెంపొందించింది. ఈ సందర్భంగా పాల్గొన్నవారు తమ సంతకాల ద్వారా ఆడపిల్లల రక్షణకు, మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి తమ మద్దతును, నిబద్ధతను వ్యక్తం చేశారు.

కళాశాల వైస్ ప్రిన్సిపల్ డా. సిస్టర్ హేమ కార్యక్రమాన్ని అభినందించారు. జంతుశాస్త్ర విభాగాధిపతి, ఈగిల్ క్లబ్ ఫ్యాకల్టీ ఇన్‌చార్జ్ డా. ఈ. హరిణి సమన్వయంతో కార్యక్రమం నిర్వహించగా, ఈగిల్ క్లబ్ ఫ్యాకల్టీ సభ్యులు డా. ప్రవీణ్ కుమార్, డా. సుధా ప్రియ, మేరీ విజయరత్న, డా. గౌరి శంకర్, అనిత రాణి, లక్ష్మి తదితరులు సహకరించారు.

Post a Comment

0 Comments