విశాఖపట్నం, సెప్టెంబర్ 8: వినాయక చవితి సందర్భంగా జీవీఎంసీ అన్ని జోన్ల పరిధిలో నిర్వహించే ఉత్సవాలు, ఏర్పాటు చేసే వినాయక మండపాలను సంబంధిత శాఖల నుంచి అవసరమైన అనుమతులు పొందిన తరువాతనే నిర్వహించాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ నిర్వాహకులకు సూచించారు. వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవడంతో పాటు ప్రజల భద్రత, నగర పారిశుధ్యం, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలని మంగళవారం ఒక ప్రకటనలో కోరారు.
వినాయక మండపాలు, స్టేజీలు, బ్యానర్లు, స్వాగత ద్వారాలు, ఇతర తాత్కాలిక నిర్మాణాల ఏర్పాటుకు సంబంధిత శాఖల నుంచి అవసరమైన ముందస్తు అనుమతులు తీసుకోవాలని కమిషనర్ స్పష్టం చేశారు. అనుమతించిన ప్రదేశాల్లో, నిర్దేశించిన భద్రతా ప్రమాణాలకు అనుగుణంగానే వాటిని ఏర్పాటు చేయాలని సూచించారు. రోడ్లు, ఫుట్‌పాత్‌లు, డ్రైనేజీలు, ప్రజా రాకపోకలకు ఆటంకం కలిగించే ప్రాంతాల్లో మండపాలు, ఇతర నిర్మాణాలు ఏర్పాటు చేయరాదన్నారు. అత్యవసర సమయాల్లో అంబులెన్స్, అగ్నిమాపక వాహనాలు తదితర అత్యవసర సేవల వాహనాలు సులభంగా వెళ్లేందుకు అవసరమైన మార్గాన్ని తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని నిర్వాహకులను ఆదేశించారు.
మండపాల నిర్మాణం పటిష్టంగా ఉండేలా చూసుకోవడంతో పాటు విద్యుత్ కనెక్షన్లు, వైరింగ్, లైటింగ్, జనరేటర్లు తదితర ఏర్పాట్లలో ప్రమాదాలకు తావులేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, హైటెన్షన్ విద్యుత్ లైన్లు, ఇతర ప్రమాదకర ప్రాంతాలకు సమీపంలో మండపాలు ఏర్పాటు చేయరాదని సూచించారు. ఉత్సవాలు, ఊరేగింపుల సమయంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా సంబంధిత అధికారుల సూచనలను పాటిస్తూ పోలీస్, జీవీఎంసీ తదితర శాఖలతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు.
"పర్యావరణహిత ఉత్సవాలకు ప్రాధాన్యత"
వినాయక చవితిని పర్యావరణహితంగా నిర్వహించడంలో నిర్వాహకులతో పాటు ప్రజలు కూడా భాగస్వాములు కావాలని కమిషనర్ పిలుపునిచ్చారు. సాధ్యమైనంత వరకు సహజ మట్టితో తయారుచేసిన వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించాలని, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (PoP), రసాయన రంగులు, పర్యావరణానికి హాని కలిగించే పదార్థాలతో తయారైన విగ్రహాల వినియోగాన్ని నివారించాలని కోరారు. మండపాల అలంకరణలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్, నిషేధిత ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని నివారించి, పర్యావరణహిత ప్రత్యామ్నాయాలను ఉపయోగించాలని సూచించారు.
మండపాలు, పరిసర ప్రాంతాల్లో ప్రతిరోజూ పారిశుధ్యాన్ని కచ్చితంగా నిర్వహించాలని, తడి–పొడి వ్యర్థాలను వేర్వేరుగా సేకరించి జీవీఎంసీ పారిశుధ్య సిబ్బందికి అందించాలని తెలిపారు. పూలు, పూజా సామగ్రి, ఆహార పదార్థాలు, ఇతర వ్యర్థాలను రోడ్లు, కాలువలు, బహిరంగ ప్రదేశాల్లో వేయరాదన్నారు. ఉత్సవాలు ముగిసిన వెంటనే మండపాలు, అలంకరణ సామగ్రిని తొలగించి ఆయా ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచే బాధ్యత నిర్వాహకులు తీసుకోవాలని సూచించారు.
వినాయక నిమజ్జన కార్యక్రమాల్లో కూడా ప్రజల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని కమిషనర్ పేర్కొన్నారు. సంబంధిత శాఖలు నిర్దేశించిన నిమజ్జన ప్రాంతాలు, మార్గాలు, సమయాలు, ఇతర సూచనలను నిర్వాహకులు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. నిమజ్జనం అనంతరం పూజా సామగ్రి, ప్లాస్టిక్, అలంకరణ వస్తువులు తదితర వ్యర్థాలను జలవనరులు, బీచ్‌లు, రహదారులు లేదా బహిరంగ ప్రదేశాల్లో విడిచిపెట్టకుండా బాధ్యతాయుతంగా తొలగించాలని కోరారు.
“వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో జరుపుకోవడంతో పాటు ప్రజల భద్రత, నగర పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణను మన సమష్టి బాధ్యతగా భావించాలి. సంబంధిత శాఖల అనుమతులు, నిబంధనలను పాటిస్తూ జీవీఎంసీకి సహకరించి విశాఖ నగరంలో వినాయక చవితి ఉత్సవాలను సురక్షితంగా, స్వచ్ఛంగా, పర్యావరణహితంగా నిర్వహించాలి” అని కమిషనర్ కేతన్ గార్గ్ నగర ప్రజలు, ఉత్సవ కమిటీలు, మండపాల నిర్వాహకులకు విజ్ఞప్తి చేశారు.
పౌర సంబంధాల అధికారి జీవీఎంసీ.

0 Comments