ఆంధ్ర విశ్వవిద్యాలయం సంఘ సంక్షేమ కృషి విభాగంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

 


ఆంధ్ర విశ్వవిద్యాలయం సంఘ సంక్షేమ కృషి విభాగం (Department of Social Work) విద్యార్థులు, ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా విభాగాధిపతి ప్రొఫెసర్ ఎస్. హరనాథ్ మాట్లాడుతూ, భారతదేశ మాజీ రాష్ట్రపతి, ప్రముఖ తత్వవేత్త మరియు విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా రంగానికి, ఉపాధ్యాయ వృత్తికి అందించిన విశేష సేవలను వివరించారు. విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమైనదని ఆయన పేర్కొన్నారు. సంఘ సంక్షేమ కృషి రంగంలో విద్యార్థులకు అనేక ఉపాధి మరియు సేవా అవకాశాలు ఉన్నాయని ప్రొఫెసర్ హరనాథ్ తెలిపారు. ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, ఆరోగ్యం, విద్య, మహిళా మరియు శిశు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, మానసిక ఆరోగ్యం, కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) తదితర అనేక రంగాల్లో సంఘ సంక్షేమ కృషి నిపుణులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని వివరించారు. విద్యార్థులు తమ నైపుణ్యాలను పెంపొందించుకుని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తూ, వారందరికీ విజయాలు చేకూరాలని శుభాకాంక్షలు తెలిపారు.

కార్యక్రమంలో సంఘ సంక్షేమ కృషి విభాగం అతిథి అధ్యాపకులు డాక్టర్ ఎం. అబ్రహాం, డాక్టర్ జి. పుష్పలత, డాక్టర్ ఎస్. శామ్ కుమార్, డాక్టర్ చదువుల ఆశా కిరణ్ రాజు పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థులు విద్యతో పాటు మానవీయ విలువలు, సామాజిక బాధ్యత, నాయకత్వ లక్షణాలు మరియు సేవాభావాన్ని పెంపొందించుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో విభాగానికి చెందిన విద్యార్థులందరూ ఉత్సాహంగా పాల్గొని, పరస్పరం సహకరించుకుంటూ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను విజయవంతంగా నిర్వహించారు.

Post a Comment

0 Comments