ఆంధ్రవిశ్వవిద్యాలయం, సెప్టెంబర్ 5:విద్య అనేది జీవితాంతం తోడుండే జీవన విలువలను కలిగి ఉండాలని, జాతీయ విద్యా విధానం 2020 (NEP 2020) లో ఇవే సూత్రాలు చేర్చబడ్డాయని ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజశేఖర్ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏయూ పూర్వ ఉపకులపతి డాక్టర్ సర్వేపల్లి జయంతిని పురస్కరించుకుని ఏయూ ఆర్ట్స్ కళాశాల వద్దనున్న సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి శనివారం ఆయన పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఏయూ ఫ్యాకల్టీ క్లబ్‌లో సర్వేపల్లి చిత్రపటానికి ఆచార్యులతో కలిసి పూలమాల వేసారు. అనంతరం శ్రీరామినేని కోదండరామయ్య భవనంలో ఏర్పాటు చేసిన ఉపాధ్యాయ దినోత్సవ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఉపాధ్యాయుడు విద్యార్థులందరినీ సమ భవానతో చూడాలన్నారు. వారిలో శక్తిని గుర్తించి ప్రోత్సహించాలని సూచించారు. ఉపాధ్యాయుడు నైతిక విలువలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను స్వీకరిస్తున్న ఐదుగురు ఏయూ ఆచార్యులను అభినందించారు.
సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎం.వి.ఆర్ రాజు మాట్లాడుతూ జ్ఞానము ప్రధానమని, అదే సమయంలో విలువలు, నడవడిక ఎంతో అవసరమన్నారు. విద్యార్థులలో ప్రేరణ తీసుకువస్తూ, వారి జీవితాలను మలిచే విధంగా ఉపాధ్యాయులు పనిచేయాలన్నారు. విద్యార్థులకు మార్గదర్శిగా ఉపాధ్యాయులు నిలవాలని, విద్యార్థుల సామర్ధ్యాలను గుర్తించి ప్రోత్సహించడం, మానసిక స్థైర్యం అందించడం ఎంతో ప్రధానమన్నారు.
ఆంధ్రవిశ్వవిద్యాలయం ఉపకులపతిగా సర్వేపల్లి పనిచేసిన విధానం, ఏయూ ప్రగతిలో ఆయన కృషిని అధికారులు, ఆచార్యులు గుర్తుచేసుకున్నారు. అనంతరం విశ్వవిద్యాలయం తరపున సర్వేపల్లి రాధాకృష్ణన్ బెస్ట్ అకడమీషియన్ అవార్డులను ఆచార్య సి.వి నాయుడు, ఆచార్య పేటేటి ప్రేమానందం, ఆచార్య కె.ఈశ్వర్ కుమార్, ఆచార్య పి.విజయ లక్ష్మి, ఆచార్య జర్ర అప్పారావు, ఆచార్య సి.హెచ్ శ్రీనివాస రావు, ఆచార్య ఎస్.పాల్ డగ్లస్‌లకు ప్రధానం చేసి అభినందించారు.
కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య పులిపాటి కింగ్, రిజిస్ట్రార్ ఆచార్య జి.రాంబాబు, ప్రిన్సిపాల్స్ ఆచార్య జాలాది రవి, ఆచార్య ఆర్.పద్మశ్రీ, ఆచార్య కె.సీతామాణిక్యం, ఆచార్య జి.గిరిజా శంకర్, ఆచార్య కె.వెంకట సుబ్బయ్య, డి.నగరాజ కుమారి, డీన్‌లు, ఆచార్యులు తదితరులు పాల్గొన్నారు.



0 Comments