విశాఖపట్నం : తన విశాఖపట్నం 3 రోజుల పర్యటన ముగించుకుని పూర్వ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు నేడు ఉదయం 7 గంటలకు రైలులో నెల్లూరు ప్రయాణమయ్యారు. ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా 6 గంటలకు విశాఖపట్నం రైల్వేస్టేషన్ లో సర్వేపల్లి రాధాకృష్ణన్ కు ఘన నివాళులు అర్పించారు.
“భారతరత్న, దేశ తొలి ఉపరాష్ట్రపతి, రెండవ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా వారి స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను. జ్ఞానం, సంస్కృతి, తత్వశాస్త్ర రంగాల్లో భారతదేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడు డాక్టర్ సర్వేపల్లి. ఉన్నత పదవులు అధిరోహించినా, జీవితాంతం తనను తాను ఒక ఉపాధ్యాయుడిగానే భావించిన నిరాడంబరుడు ఆయన. వారి జయంతి సందర్భంలో వికసిత భారత నిర్మాణం కోసం భవిష్యత్ తరాలను తీర్చిదిద్దుతున్న గురువర్యులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
ఉపాధ్యాయులు అక్షరాలు నేర్పే వారు మాత్రమే కాదు. రేపటి పౌరులను తీర్చిదిద్దే శిల్పులు, దేశ భవిష్యత్తుకు బలమైన పునాదులు అందించే శక్తులు. విద్యార్థుల్లోని ప్రతిభను వెలికి తీసి, వారిని సన్మార్గంలో నడిపించే గురువుల త్యాగం, కృషి వెలకట్టలేనివి. సమాజ ప్రగతికి ఉపాధ్యాయులే మూలస్తంభాలు. భావి తరాలకు జ్ఞానజ్యోతిని అందిస్తూ, దేశ నిర్మాణంలో నిస్వార్థంగా భాగస్వాములవుతున్న ప్రతి ఉపాధ్యాయుడికి శిరస్సు వంచి ప్రణామాలు అర్పిస్తున్నాను. డాక్టర్ రాధాకృష్ణన్ గారి ఆదర్శాలను స్మరిస్తూ, విద్యా రంగ పరిపుష్టికి సమాజం పునరంకితం కావాలని ఆకాంక్షిస్తున్నాను.”
ఆయనతోపాటు విశ్వ హిందీ పరిషత్ జాతీయ అధ్యక్షుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, ఆచార్య వెలమల సిమ్మన్న, హిందీ విభాగం అధ్యక్షుడు ఆచార్య నల్లా సూర్యనారాయణ కూడా ఉన్నారు.
- ------------------------

0 Comments