విశాఖపట్నం-విశాఖ సందేశం వర్తవాహని- ఆగస్టు 24: సెయింట్ జోసెఫ్ మహిళా కళాశాల (అటానమస్), విశాఖపట్నంలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ సెకండ్ లాంగ్వేజెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్ కాలేజియేట్ అకడమిక్ ఫెస్ట్ – “ప్రతిభ 2K26”లో భాగంగా అంతర్ కళాశాల ప్రతిభా పోటీలు ఆగస్టు 24న ఘనంగా నిర్వహించారు.
ఈ ప్రతిభా పోటీలలో విశాఖపట్నంలోని వివిధ కళాశాలలకు చెందిన 170 మందికి పైగా విద్యార్థినీ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ సృజనాత్మకతను, ప్రతిభా పాటవాలను ప్రదర్శించారు. భాష, సాహిత్యం, సంస్కృతి మరియు సృజనాత్మకతకు సంబంధించిన వివిధ పోటీలలో విద్యార్థులు చురుకుగా పాల్గొని తమ నైపుణ్యాలను చాటుకున్నారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ షైజీ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, వారికి తమ నైపుణ్యాలను ప్రదర్శించేందుకు ఇటువంటి వేదికలు ఎంతో అవసరమని అన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అవకాశం కల్పించిన కళాశాల యాజమాన్యానికి, కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన అధ్యాపకులు, సిబ్బంది మరియు విద్యార్థులకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఒమ్మి రామారావు పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఇటువంటి అంతర్ కళాశాల కార్యక్రమాలు విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడంతో పాటు, వారిలో ఆత్మవిశ్వాసం, సృజనాత్మక ఆలోచన, నాయకత్వ లక్షణాలు మరియు పోటీతత్వ స్ఫూర్తిని పెంపొందించేందుకు ఎంతో దోహదపడతాయని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ సెకండ్ లాంగ్వేజెస్ విభాగాధిపతి డాక్టర్ జె. నిర్మల మాట్లాడుతూ, విద్యార్థుల ప్రతిభకు విస్తృతమైన వేదిక కల్పించాలనే ఉద్దేశంతో ఈ అకడమిక్ ఫెస్ట్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భాషలు కేవలం కమ్యూనికేషన్ సాధనాలు మాత్రమే కాకుండా, విద్యార్థుల సృజనాత్మకత, ఆలోచనా శక్తి మరియు వ్యక్తిత్వ వికాసానికి కూడా దోహదపడతాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ద్వితీయ భాషల విభాగానికి చెందిన శ్రీ పి. వెంకటరత్నం, డాక్టర్ ఎస్. దీప్తి, డాక్టర్ డి. కోటేశ్వరరావు, సిస్టర్ జైన్ థామస్ తదితర అధ్యాపకులు పాల్గొని కార్యక్రమం విజయవంతం కావడానికి తమ సహకారాన్ని అందించారు.
ఈ అంతర్ కళాశాల ప్రతిభా పోటీలు విద్యార్థుల ప్రతిభ, సృజనాత్మకత మరియు నైపుణ్యాలను వెలికితీసే చక్కని వేదికగా నిలిచాయి



0 Comments