1 జీవీఎంసీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలి. * 120 వార్డుల్లో పోలింగ్ కేంద్రాల గుర్తింపు, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి. * పోలీస్ స్టేషన్ల వారీగా ఓటర్ల జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. * ఫొటో ఓటర్ల జాబితాల్లో ఎటువంటి తప్పిదాలకు అవకాశం లేకుండా పక్కాగా సిద్ధం చేయాలి. * రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఎన్నికల విధులను సమర్థవంతంగా నిర్వహించాలి. – జీవీఎంసీ కమిషనర్, అదనపు ఎన్నికల అథారిటీ కేతన్ గార్గ్.


 విశాఖపట్నం, సెప్టెంబర్ 26: మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ (జీవీఎంసీ) పరిధిలోని 120 వార్డులకు జరగనున్న స్థానిక సంస్థల సాధారణ ఎన్నికలను పారదర్శకంగా, సజావుగా నిర్వహించేందుకు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ముందస్తు ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని జీవీఎంసీ కమిషనర్, అదనపు ఎన్నికల అథారిటీ కేతన్ గార్గ్ ఆదేశించారు.

శనివారం ఉదయం జీవీఎంసీ అన్ని విభాగాల అధికారులు, సహాయ ఎన్నికల అధికారులుగా వ్యవహరిస్తున్న అన్ని జోన్ల జోనల్ కమిషనర్లు, సంబంధిత ఉద్యోగులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఎన్నికల సన్నద్ధతపై పలు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కళాశాలలో సహాయ ఎన్నికల అధికారులు, ~సంబంధిత~ రిటర్నింగ్ అధికారులు, ఉద్యోగులకు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నికల నిర్వహణపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాస్టర్ ట్రైనర్లు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన వివిధ అంశాలపై అధికారులకు సమగ్ర అవగాహన కల్పించారు. పోలింగ్ కేంద్రాల గుర్తింపు, పోలీస్ స్టేషన్ల వారీగా ఓటర్ల జాబితాల పరిశీలన, ఫొటో ఓటర్ల జాబితాల తయారీ, పోలింగ్ కేంద్రాల్లో కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు, ఎన్నికల విధుల్లో అధికారుల బాధ్యతలు తదితర అంశాలను వివరించారు.

ఈ సందర్భంగా కమిషనర్ కేతన్ గార్గ్ మాట్లాడుతూ, జీవీఎంసీ పరిధిలోని 120 వార్డుల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. ముఖ్యంగా పోలీస్ స్టేషన్ల వారీగా ఓటర్ల జాబితాలను పరిశీలించి, ఓటర్ల వివరాల్లో ఎటువంటి తప్పిదాలకు అవకాశం లేకుండా చూడాలన్నారు. పోలింగ్ కేంద్రాల వారీగా ఫొటో ఓటర్ల జాబితాలను సరిచూసుకోవడంతో పాటు సంబంధిత రికార్డులను పక్కాగా నిర్వహించాలని సూచించారు.

ప్రతి పోలింగ్ కేంద్రంలో తాగునీరు, విద్యుత్, తగినంత వెలుతురు, మరుగుదొడ్లు, దివ్యాంగులకు ర్యాంపులు తదితర మౌలిక సదుపాయాల లభ్యతను పరిశీలించి, అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల స్థితిగతులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఏవైనా లోపాలు గుర్తిస్తే వెంటనే సరిదిద్దాలని సూచించారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అనుసరిస్తూ సహాయ ఎన్నికల అధికారులుగా వ్యవహరిస్తున్న జోనల్ కమిషనర్లు తమ పరిధిలో ఎన్నికల ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రతి అధికారి, ఉద్యోగి తమకు కేటాయించిన బాధ్యతలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. తాను అదనపు ఎన్నికల అథారిటీగా ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షిస్తానని, ఎన్నికల నిర్వహణలో ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కమిషనర్ స్పష్టం చేశారు.

ఈ రోజు సాయంత్రం రాజకీయ పార్టీలతో జోనల్ స్ధాయిలో సమావేశారు నిర్వహించాలనీ, సోమవారం సాయంత్రం 4గంటలకు GVMC స్థాయి లో రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు!

ఈ శిక్షణ కార్యక్రమంలో జీవీఎంసీ అన్ని జోన్ల జోనల్ కమిషనర్లు, వివిధ విభాగాల అధికారులు, మాస్టర్ ట్రైనర్లు, సంబంధిత ఉద్యోగులు పాల్గొన్నారు.

పౌర సంబంధాల అధికారి, జీవీఎంసీ

Post a Comment

0 Comments