ఉరవకొండ: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి జన్మ శతజయంతి వేడుకల ఘన ముగింపు కార్యక్రమాల్లో భాగంగా శ్రీ సత్యసాయి ప్రేమ ప్రవాహిణి రథయాత్ర తుది విడతను ఉరవకొండ నుంచి ప్రశాంతి నిలయానికి నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
భగవాన్ వారి దివ్య ఆశీస్సులతో, జన్మ శతజయంతి వేడుకల ముగింపు సందర్భంగా నిర్వహించనున్న ఈ పవిత్ర రథయాత్రను భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన ఏర్పాట్లను సమీక్షించేందుకు శ్రీ సత్యసాయి సేవా సంస్థల జాతీయ, రాష్ట్ర స్థాయి సేవా బృందం ఉరవకొండలో పర్యటించింది.
ఈ బృందంలో జాతీయ సేవా సమన్వయకర్త శ్రీ ఎస్. కోటేశ్వరరావు గారు, ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఆర్. లక్ష్మణరావు గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ .సి. హెచ్. సురేంద్ర గారు, రాష్ట్ర యువజన సమన్వయకర్త శ్రీ సి. గౌతమ్ గారు, అనంతపురం జిల్లా అధ్యక్షులు శ్రీ రామచంద్ర మూర్తి గారు, మాజీ జిల్లా అధ్యక్షులు శ్రీ రామాంజప్పగారు తదితర సేవా ప్రముఖులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా స్థానిక సేవా కార్యకర్తలతో సమావేశమై, ఉరవకొండ నుంచి ప్రశాంతి నిలయానికి సాగనున్న శ్రీ సత్యసాయి ప్రేమ ప్రవాహిణి రథయాత్ర తుది విడతను జన్మ శతజయంతి వేడుకలకు తగిన ఆధ్యాత్మిక వైభవంతో నిర్వహించేందుకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై సమగ్రంగా చర్చించారు.
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ప్రేమ, సేవ, ఐక్యత మరియు మానవతా సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన శ్రీ సత్యసాయి ప్రేమ ప్రవాహిణి రథయాత్ర, ఇప్పుడు తన తుది దశకు చేరుకుంటోంది. జన్మ శతజయంతి వేడుకల ఘన ముగింపు సందర్భంగా ఉరవకొండ నుంచి ప్రశాంతి నిలయం వరకు జరిగే ఈ తుది రథయాత్ర, భగవాన్ వారి పవిత్ర పాదపద్మాలకు భక్తుల తరఫున సమర్పించే ప్రేమ, భక్తి, సేవల ఆధ్యాత్మిక కానుకగా నిలవనుంది.
భగవాన్ వారి శాశ్వత సందేశమైన “అందరినీ ప్రేమించు – అందరికీ సేవ చేయు” స్ఫూర్తితో సాగుతున్న ఈ మహత్తర కార్యక్రమం, జన్మ శతజయంతి వేడుకల ముగింపును మరింత భక్తిమయంగా, స్ఫూర్తిదాయకంగా మరియు చిరస్మరణీయంగా నిలపనుంది.శతజయంతి వేడుకల ఈ పవిత్ర ముగింపు ఘట్టంలో ప్రేమ ప్రవాహం ప్రశాంతి నిలయం వైపు పయనించనుంది.



0 Comments