వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణకు పటిష్ట చర్యలు చేపట్టాలి. *బయోగ్యాస్, సీ అండ్ డీ ప్లాంట్లను సమర్థవంతంగా వినియోగించాలి. *సీ అండ్ డీ వ్యర్థాలతో తయారైన ఉత్పత్తులను జీవీఎంసీ పనుల్లో ఉపయోగించాలి. – రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పి. నారాయణ


  విశాఖపట్నం -సెప్టెంబర్ 19: నగరంలో ఉత్పత్తయ్యే వ్యర్థాలను శాస్త్రీయంగా నిర్వహిస్తూ, వాటిని ఉపయోగకరమైన వనరులుగా మార్చేందుకు కాపులుప్పాడలో ఏర్పాటు చేసిన ప్లాంట్లను సమర్థవంతంగా వినియోగించాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పి. నారాయణ జీవీఎంసీ అధికారులను ఆదేశించారు.

శనివారం కాపులుప్పాడ డంపింగ్ యార్డులోని బయోగ్యాస్ ప్లాంట్, నిర్మాణ–కూల్చివేత (సీ అండ్ డీ) వ్యర్థాల శుద్ధి ప్లాంట్‌ను స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్‌తో కలిసి మంత్రి పరిశీలించారు. ప్లాంట్ల సామర్థ్యం, వ్యర్థాల సేకరణ, శుద్ధి ప్రక్రియ, ఉత్పత్తి తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నగరంలో ఉత్పత్తయ్యే తడి వ్యర్థాలను మూలస్థాయిలోనే వేరు చేసి బయోగ్యాస్ ప్లాంట్‌కు తరలించే వ్యవస్థను మరింత పటిష్టం చేయాలన్నారు. హోటళ్లు, మార్కెట్లు, ఫంక్షన్ హాళ్లు, వాణిజ్య సంస్థలు తదితర ప్రాంతాల నుంచి తడి వ్యర్థాలు నిరంతరాయంగా ప్లాంట్‌కు చేరేలా చర్యలు చేపట్టాలని సూచించారు. వ్యర్థాల నుంచి బయోగ్యాస్, విద్యుత్, సేంద్రియ ఎరువుల ఉత్పత్తిని సమర్థవంతంగా చేపట్టడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు వ్యర్థాల నిర్వహణలో మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్నారు.

అదేవిధంగా నగరంలో ఉత్పత్తయ్యే నిర్మాణ, కూల్చివేత వ్యర్థాలను రోడ్ల పక్కన, కాలువలు, ఖాళీ ప్రదేశాల్లో పారవేయకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. వాటిని సీ అండ్ డీ ప్లాంట్‌కు తరలించి శాస్త్రీయంగా శుద్ధి చేసే విధంగా సమగ్ర వ్యవస్థను అమలు చేయాలన్నారు. ప్లాంట్ల నిర్వహణలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించి, నిర్దేశిత సామర్థ్యంతో పనిచేసేలా సంబంధిత విభాగాలు సమన్వయంతో వ్యవహరించాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్‌కు సూచించారు.

అనంతరం రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్. సురేష్ కుమార్, కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ పి. సంపత్ కుమార్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి కలసి  సీ అండ్ డీ వ్యర్థాల శుద్ధి ప్లాంట్‌ను పరిశీలించారు. ప్లాంట్ ప్రస్తుతం వినియోగంలో లేకపోవడానికి గల కారణాలను ప్రిన్సిపల్ సెక్రటరీ చీఫ్ సిటీ ప్లానర్ ఎ. ప్రభాకర్ రావును అడిగి తెలుసుకున్నారు. సంబంధిత కాంట్రాక్టర్ ప్లాంట్‌ను నిర్వహించలేని పక్షంలో నిబంధనల మేరకు చర్యలు చేపట్టి, జీవీఎంసీ ఆధీనంలోకి తీసుకొని వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. ఇందుకు అవసరమైన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్‌ఓపీ) రూపొందించి ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సూచించారు.

సీ అండ్ డీ వ్యర్థాల ద్వారా తయారైన పేవర్ బ్లాకులు, బిల్డింగ్ బ్లాకులు, ఇటుకలు తదితర ఉత్పత్తులను జీవీఎంసీ చేపట్టే ఇంజనీరింగ్, అభివృద్ధి పనుల్లో వినియోగించాలని ప్రిన్సిపల్ సెక్రటరీ చీఫ్ ఇంజనీర్ పి.వి.వి. సత్యనారాయణ రాజును ఆదేశించారు. తద్వారా నిర్మాణ వ్యర్థాల పునర్వినియోగంతో పాటు సహజ వనరుల వినియోగాన్ని తగ్గించవచ్చని పేర్కొన్నారు.

ఈ పరిశీలనలో జీవీఎంసీ అదనపు కమిషనర్ పల్లి నల్లనయ్య, మధురవాడ జోనల్ కమిషనర్ అయ్యప్ప నాయుడు, చీఫ్ సిటీ ప్లానర్ ఎ. ప్రభాకర్ రావు, చీఫ్ ఇంజనీర్ పి.వి.వి. సత్యనారాయణ రాజు, డీసీపీ రామ్మోహన్, ప్రధాన వైద్యాధికారి డాక్టర్ కృష్ణంరాజు ,అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ ఎల్. రాజా రవికుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు.

పౌర సంబంధాల అధికారి.జీవీఎంసీ


 


Post a Comment

0 Comments