జారీచేసినవారు: డా.పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి, విశాఖపట్నం,


విశాఖపట్నం -ఈరోజు అనగా తేదీ 26.09.2026 న డా.పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, విశాఖపట్నం వారు పత్రికాముఖంగా మాట్లాడుతూ విశాఖపట్నం జిల్లాలో 18 వ జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని2026 సెప్టెంబర్ 28వ తేదీన నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 1 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలు, కిశోరులు మరియు విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను అందించి నులిపురుగుల నిర్మూలనకు చర్యలు చేపట్టనున్నారు. 

జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, ఇతర విద్యా సంస్థల్లో చదువుతున్న పిల్లలు మరియు కిశోరులకు ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా అమలు చేయనున్నారు. జిల్లాలో 1–19 సంవత్సరాల వయస్సు గల సుమారు 5,74,496 మంది పిల్లలను లక్ష్యంగా చేసుకుని నులిపురుగుల నిర్మూలన మాత్రలను పంపిణీ చేయనున్నారు. 

జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా 1 నుంచి 2 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ఆల్బెండజోల్ 400 మి.గ్రా మాత్రలో సగం మాత్రను నీటిలో కలిపి ఇవ్వాలి. 2 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలు మరియు కిశోరులకు 400 మి.గ్రా ఆల్బెండజోల్ పూర్తి మాత్రను నీటితో నమిలి మింగేలా ఇవ్వాలి. పిల్లలకు మాత్రలను ఖాళీ కడుపుతో కాకుండా భోజనం చేసిన అనంతరం ఆరోగ్య సిబ్బంది లేదా ఉపాధ్యాయుల పర్యవేక్షణలో ఇవ్వాలి. 

సెప్టెంబర్ 28వ తేదీన మాత్రలు తీసుకోలేకపోయిన లేదా ఆ రోజు కార్యక్రమానికి హాజరుకాని పిల్లలకు మాప్-అప్ డే 2026 అక్టోబర్ 5వ తేదీన మాత్రలు అందేలా నిర్వహించనున్నారు. 

నులిపురుగుల సంక్రమణ వల్ల పిల్లల్లో రక్తహీనత, పోషకాహార లోపం, ఆకలి తగ్గడం, కడుపునొప్పి, బలహీనత వంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. పిల్లల ఆరోగ్యం, పోషకాహారం మరియు పాఠశాల హాజరు మెరుగుపడేందుకు నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం ప్రతి అర్హులైనా " "పిల్లలందరికీ చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. 

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో విద్య, మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమం, మున్సిపల్ శాఖలు మరియు ఇతర సంబంధిత శాఖల సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించనున్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, ఉపాధ్యాయులు, ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు మరియు ఇతర ఆరోగ్య సిబ్బంది తమ పరిధిలోని అర్హులైన పిల్లలందరికీ మాత్రలు అందేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులు సూచించారు. 

తల్లిదండ్రులు తమ పిల్లలకు నులిపురుగుల నిర్మూలన మాత్రలు తప్పనిసరిగా ఇప్పించి, కార్యక్రమాన్నివిజయవంతం చేయడంలో ఆరోగ్య సిబ్బందికి మరియు విద్యాసంస్థలకు సహకరించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు. 

           జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి

                    విశాఖపట్నం

Post a Comment

0 Comments