నక్కపల్లి, సెప్టెంబర్ 25:స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయానికి మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలోని తన నివాసం వద్ద శుక్రవారం టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో ఆమె సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కూటమి శ్రేణులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ.. ఎన్డీఏ కూటమిలోని మూడు పార్టీల నాయకులతో సమావేశం ఏర్పాటు చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఎన్డీఏ కూటమి ఒక ఉమ్మడి కుటుంబమని, మూడు పార్టీల నాయకులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలని సూచించారు. గత పాలనను సాగనంపి సుపరిపాలనను తీసుకువచ్చామని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు వందకు వంద శాతం విజయం సాధించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. మూడు పార్టీల నుంచి ఎవరికి అవకాశం లభించినా వారి విజయానికి మిగిలిన కూటమి శ్రేణులంతా సమిష్టిగా పనిచేయాలని సూచించారు. యువత, మహిళలకు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో అనేక రకాల అక్రమ కేసులు పెట్టి కూటమి నాయకులు, కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేశారని గుర్తు చేసారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఇంతటి అభివృద్ధి ఎప్పుడూ జరగలేదని ఆమె పేర్కొన్నారు. గోదావరి జలాలు అనకాపల్లి జిల్లాకు రావడం ఎంతో సంతోషకరమైన విషయమన్నారు.నియోజకవర్గ స్థాయిలో ఎన్డీఏ కోఆర్డినేషన్ కమిటీని, గ్రామస్థాయిలో త్రీమెన్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కూటమి నాయకులు అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. పాయకరావుపేట నియోజకవర్గంలో ఎక్కడా అవకతవకలకు, అక్రమాలకు తావులేకుండా నిజాయితీగా పనిచేయాలని స్పష్టం చేశారు.శాప్ కార్యాలయంపై వైసీపీ దాడి చేయడం దుర్మార్గమని అనిత వ్యాఖ్యానించారు. అనంతరం ఈ అంశంపై జగన్రెడ్డి గవర్నర్కు ఫిర్యాదు చేయడం విడ్డూరంగా ఉందన్నారు





0 Comments