విద్యుత్ శాఖ ఉద్యోగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది 👉మంత్రి గొట్టిపాటి రవికుమార్ 👉​కారుణ్య నియామకాల కింద మరో 43 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేత 👉 ప్రజా సానుకూలత పెరిగేలా విధులు నిర్వర్తించాలి

విశాఖపట్నం, అక్టోబర్ 05:రాష్ట్రంలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన విద్యుత్ ఉద్యోగుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. స్థానిక ఎంపీ భరత్, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాస్, రామకృష్ణ, విద్యుత్ సంస్థల సీఎండీ లతో కలిసి కారుణ్య నియామకాల కింద ఎంపికైన 43 మంది బాధితుల కుటుంబ సభ్యులకు సోమవారం నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా  మంత్రి మాట్లాడుతూ ఇప్పటివరకు ఈ విధంగా 450 మందికి పైగా ఉద్యోగాలు కల్పించినట్లు ఆయన తెలిపారు.  విద్యుత్ ఉద్యోగులు ప్రజా సానుకూలత పెరిగేలా, ప్రజలు  సంతృప్తి చెందేలా విధులు నిర్వర్తించాలని మంత్రి కోరారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యంత ప్రాధాన్యతనిచ్చే విద్యుత్ శాఖ ద్వారా ప్రజలపై నయాపైసా భారం మోపకుండా వ్యవస్థను గాడిలో పెడుతున్నామని మంత్రి తెలిపారు. గత వైకాపా ప్రభుత్వ హయాంలో ప్రతి ఆరు నెలలకోసారి విద్యుత్ చార్జీలు పెంచి విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేశారని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం ఎల్ నినో వంటి తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ, డిపార్ట్‌మెంట్ సిబ్బంది అహర్నిశలు శ్రమించి ఎక్కడా విద్యుత్ కోతలు  లేకుండా రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారని కొనియాడారు.

శాఖ అవసరాలను గుర్తించి, త్వరలోనే 629 అసిస్టెంట్ ఇంజనీర్  పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు తెలిపారు. గతంలో గ్రామ/వార్డు సచివాలయాల్లో ఎనర్జీ  అసిస్టెంట్లు గా పనిచేస్తున్న 7,000 మందికి పైగా డిస్కంలలోకి అధికారికంగా తీసుకున్నామని అన్నారు. 

మౌలిక సదుపాయాల అభివృద్ధిరాష్ట్రవ్యాప్తంగా ప్రతి వినియోగదారునికి నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా కోట్లాది రూపాయలతో ఆధునికీకరణ పనులు వేగవంతం చేస్తున్నామని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ​కేంద్ర ప్రభుత్వ ఆర్‌డీఎస్‌ఎస్  పథకం అమలు ​పీఎం సూర్య ఘర్  సోలార్ పథకం విస్తరణ

భూగర్భ కేబులింగ్ పనులు, నూతన సబ్‌స్టేషన్ల నిర్మాణం, విద్యుత్ లైన్ల అనుసంధానం తదితర పనులు చేపట్టడం జరుగుతోందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్‌ను విద్యుత్ రంగంలో దేశంలోనే ఆదర్శంగా నిలబెట్టేందుకు పటిష్ట చర్యలు కొనసాగుతాయని మంత్రి తెలిపారు.

ఎం.పి. భరత్ మాట్లాడుతూ కారుణ్య నియామకాలు పొందిన ఉద్యోగులు తమ వృత్తికి, కుటుంబానికి న్యాయం చేయాలని హితవు పలికారు. ప్రస్తుతం పార్లమెంట్ ఎనర్జీ కమిటీ సభ్యునిగా ఉన్నానని, రానున్న రెండేళ్లు విద్యుత్ నిర్వహణ మీదే దృష్టి పెడతానని అన్నారు.

ఈ పి డి సి ఎల్ సి. ఎం .డి ఐ.పృథ్వీ తేజ్ మాట్లాడుతూ ఈ పి డి సి ఎల్ పరిధి 12జిల్లాల్లో విస్తరించి ఉందని, సుమారు 30 వేల మంది  ఉద్యోగులు పని చేస్తున్నారని తెలిపారు. విధి నిర్వహణ లో మరణించిన, అనారోగ్యం  బారిన పడిన వారి కుటుంబాలకు 2024లో 37 మందికి, 2025 లో 77 మందికి, ఈ ఏడాది 43 మందికి కారుణ్య నియామకాలు చేపట్టడం జరిగిందన్నారు. శాఖలో అత్యంత రిస్క్ గల ఉద్యోగాలు ఉన్నందున మరణాలు ఎక్కువగానే సంభవిస్తుంటాయని, బాధిత కుటుంబాలను ఆదుకోవడం జరుగుతోందని తెలిపారు. 

గాజువాక శాసన సభ్యులు పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ బాధిత కుటుంబాలను ఆదుకోవడం లో ఈ ప్రభుత్వం ముందుంటుందని పేర్కొన్నారు. హుద్ హుద్ సమయంలో విద్యుత్ శాఖ ఉద్యోగుల పని తీరు ప్రశంసనీయమని కొనియాడుతూ,  ప్రస్తుతం అండర్ గ్రౌండ్ కేబ్లింగ్ జరుగుతోందని, దానిని వేగంగా పూర్తించేయాలని సూచించారు.

కమాండ్ కంట్రోల్ రూమ్ ను తనిఖీ చేసిన మంత్రి:సమావేశం అనంతరం మంత్రి కమాండ్ కంట్రోల్ రూమ్ ను తనిఖీ చేశారు. రోజుకు ఎన్ని కాల్స్ వస్తున్నాయి, వాటికి ఏ విధమైన సమాధానాలు ఇస్తున్నారు అని ఆరా తీశారు.  సంబంధిత రిజిస్టర్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఒక వినియోగదారునితో ఫోన్ ద్వారా మాట్లాడి విద్యుత్ సేవల పై తన అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. విద్యుత్ వినియోగదారులతో మాట్లాడాలని, వారి ఫిర్యాదుల పట్ల  వెంట వెంటనే స్పందించాలని సూచించారు.  అప్పుడు మాత్రమే ప్రజా సానుకూల దృక్పథం పెరుగుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో శాసన సభ్యులు రామకృష్ణ బాబు, విద్యుత్ శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు.



Post a Comment

0 Comments