విశాఖపట్నం, అక్టోబర్ 2 : స్వచ్ఛత, ప్రజారోగ్య సేవల్లో విశేష ప్రతిభ కనబరిచిన విశాఖపట్నం చినముషివాడ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (యూపీహెచ్సీ)కు రాష్ట్రస్థాయి ‘స్వచ్ఛాంధ్ర అవార్డ్స్–2026’ పురస్కారం లభించింది. విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని విశాఖ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పి. జగదీశ్వరరావు, డాక్టర్ కార్తీక్ అందుకున్నారు.
చినముషివాడ యూపీహెచ్సీలో పరిశుభ్రత నిర్వహణ, ఆరోగ్యకరమైన పరిసరాల కల్పన, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో చేపట్టిన చర్యలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్రస్థాయి పురస్కారానికి ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు. ఆరోగ్య కేంద్రంలో పారిశుద్ధ్య నిర్వహణ, పరిసరాల పరిశుభ్రత, ప్రజల్లో స్వచ్ఛతపై అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇచ్చారు.
రాష్ట్రస్థాయి అవార్డు రావడం పట్ల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. ప్రజారోగ్య కేంద్రాల్లో పరిశుభ్రతకు మరింత ప్రాధాన్యం ఇస్తూ, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నారని డీఎంహెచ్వో డాక్టర్ పి. జగదీశ్వరరావు తెలిపారు.

0 Comments