ఆంధ్రవిశ్వవిద్యాలయం,అక్టోబర్7:ఆంధ్రవిశ్వవిద్యాలయంలో సెంటినరీ ప్రాజెక్టుల నిర్మాణ వ్యయాలు బాగా పెరిగాయని వస్తున్న వార్త కధనాలపై వీసీ ఆచార్య జి.పి రాజశేఖర్ వివరణ ఇచ్చారు. సెంటినరీ ప్రాజెక్టులలో భాగంగా గతంలో పాలక మండలి నూతన బాలికల, బాలుర హాస్టల్స్ నిర్మాణం, మెగామెస్ తో పాటు ఇతర ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్టర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపిఇడబల్యూఐడిసి) తో ఎంఓయూ చేసుకుని ఇ.సి అనుమతితో ఈ ప్రాజెక్టులను వారికి అప్పగించడం జరిగిందన్నారు. ప్రాధమిక అంచనాకు, తాజాగా మారిన అంచనాలకు మధ్య వ్యత్యాసం ఉన్నమాట వాస్తవేమని, దీనికి గల కారణాలను గణాంకాలతో సహా ఆయన వివరించారు.
బాయ్స్ హాస్టల్ జిప్లస్4 విధానంలో 1,46,170 ఎస్.ఎఫ్.టి విస్తీర్ణంతో నిర్మించాలని తొలుత భావించామని, తరువాత దీనిని జిప్లస్ 5గా మార్పు చేసి 2,29,577 ఎస్.ఎఫ్.టి నిర్మించాలని నిర్ణయించామన్నారు. తొలుత కేవలం 568 మంది విద్యార్థులకు ఉపయుక్తంగా దీనిని ప్రతిపాదన చేయగా ప్రస్తుతం దీనిని 1026 మందికి ఉపయుక్తంగా నిర్మించనున్నామన్నారు. ఎస్.ఎస్.ఆర్ రేట్లు తాజాగా 2026-27 కు అనుగుణంగా మార్పు చేయడం జరిగిందన్నారు. ఫర్నేచర్ రూ4.5 కోట్లు, కాంపౌండ్ వాల్, బోర్‌వెల్, ఆర్.ఓ వాటర్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, అంతర్గత రహదారులు, పాత్ వే లు, లాండ్ స్కేపింగ్, ట్రాన్స్‌ఫార్మర్, డీజిల్ జనరేటర్ వంటివి మరొక రూ 3 కోట్లతో ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు.
గర్ల్స్ హాస్టల్‌ను తొలుత జిప్లస్ 4 గాప్రతిపాదించి, జిప్లస్ 5గా మార్పు చేసామని, మెదటి 1,05,500 ఎస్.ఎఫ్.టి నిర్మించాలని భావించినా తరువాత 1,75,825 ఎస్.ఎఫ్.టి ప్రతిపాదన చేసామన్నారు. మెదట ప్రతిపాదించిన దానిలో కేవలం 376మందికి వసతి కల్పన జరిగేదని, తాజా ప్రతిపాదనలతో 732 మందికి వసతి కల్పన సాధ్యపడుతుందన్నారు.
మెగా సెంట్రల్ మెస్, కిచెన్ పరిశీలిస్తే గతంలో ఏయూ 34,110 ఎస్.ఎఫ్.టితో ఒకే ఫ్లోర్లో నిర్మించే విధంగా ప్రతిపాదన చేసిందని, ఇది కేవలం 870 మందికి ఉపయుక్తంగా ప్రతిపాదన జరపగా, తాజాగా దీనిని జిప్లస్ 1గా మార్పు చేయడం, 94,245 ఎస్.ఎఫ్.టికి పెంపుదల చేయడంతో పాటు 2288 మందికి ఉపయుక్తంగా నిర్మించాలని నిర్ణయించామన్నారు.
గతంలో నిర్మించతలపెట్టిన ప్రాజెక్టులకు దాదాపు రెట్టింపు విస్తీర్ణంతో తాజాగా నిర్మాణాలు జరపాలని నిర్ణయించడం, ఎక్కువ మంది విద్యార్థులకు ఉపయుక్తంగా ఇవి నిర్మించడం జరుగుతోందన్నారు. దీని కారణంగా ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం పెరిగిందన్నారు. శతాబ్ధి ప్రాజెక్టుల నిర్మాణం ఎంతో పారదర్శకంగా, ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నామన్నారు. నిర్మాణం చేసే పరిధి పెరగడం, ఎస్.ఎస్.ఆర్ ధరలు మార్పు చేయడం వలన నిర్మాణ వ్యయంలో మార్పు జరిగిందనే విషయం గమనించాలన్నారు. వాస్తవాలు తెలుసుకుని వార్త కధనాలు ప్రచురించాలని సూచించారు.

0 Comments