ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా పాటించాలి. – జీవీఎంసీ కమిషనర్, అదనపు ఎన్నికల అధికారి కేతన్ గార్గ్.


విశాఖపట్నం, అక్టోబర్ 15: మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ (జీవీఎంసీ) ఎన్నికలు–2026 నేపథ్యంలో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, సంబంధిత రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచార సమయంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా పాటించాలని జీవీఎంసీ కమిషనర్, అదనపు ఎన్నికల ప్రాధికార సంస్థ కేతన్ గార్గ్ గురువారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.

ఎన్నికల ప్రచారానికి సంబంధించి కరపత్రాలు, పోస్టర్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు ముద్రించేటప్పుడు వాటిపై ముద్రించిన ప్రింటింగ్ ప్రెస్ పేరు, చిరునామా, ముద్రణ చేయించిన వ్యక్తి పేరు, చిరునామా తప్పనిసరిగా ముద్రించాలి. ముద్రించిన ప్రచార సామగ్రి సంఖ్య, సంబంధిత వివరాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించడంతోపాటు అదనపు ఎలక్షన్ అథారిటీకి సమర్పించేలా జీవీఎంసీ ప్రధాన కార్యాలయానికి అందజేయాలి.

ఎన్నికలలో పోటీ చేయు అభ్యర్థులు ప్రచారం నిర్వహించుటకు వాడు వాహనములకు కమిషనర్ మరియు అడిషనల్ ఎలక్షన్ అథారిటీ వారి అధికారములను సంబంధిత రిటర్నింగ్ ఆఫీసర్లకు బదలాయించుట జరిగినది. కావున పోటీ చేయు అభ్యర్థులు ప్రచారము చేయుటకు వాడు వాహనముల పర్మిషన్ సంబంధిత రిటర్నింగ్ ఆఫీసర్స్ ద్వారా పొందగలరు.

పోటీ చేయు అభ్యర్థులు ఏదేని ఫ్లెక్సీ, పోస్టర్, బ్యానర్ ముద్రించి ప్రదర్శించు కొనదలచిన ఎడల సదరు ఫ్లెక్సీ, బ్యానర్, హోర్డింగ్ మీద తప్పనిసరిగా ముద్రించిన వారి వివరములు, ప్రింటింగ్ ప్రెస్ వివరములు ముద్రించవలెను. సదరు బ్యానర్స్ మరియు ఫ్లెక్సీ ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ / మున్సిపల్ ఖాళీ స్థలములు మరియు ఏ విధమైన ప్రభుత్వ ఆస్తుల మీద ప్రదర్శించరాదు.

బ్యానర్లు మరియు ఫ్లెక్సీలు ప్రైవేటు బిల్డింగులు మరియు ఖాళీ స్థలములనందు సదరు యజమాని అనుమతితో ప్రదర్శించుకోవచ్చును. అట్టి అనుమతి పత్రము జీ.వీ.ఎం.సీ ప్రధాన కార్యాలయం / జోనల్ కార్యాలయములయందు సమర్పించి తగు అనుమతి పొందవలెను.

అట్టి అనుమతి లేని ఫ్లెక్సీలు / బ్యానర్లు ప్రదర్శించు అభ్యర్థులపై ఎన్నికల నిబంధనావళి ననుసరించి చర్యలు తీసుకొనబడును.

సభలు, పెద్ద శబ్దములతో కూడిన మైకులు ఉపయోగించుట మరియు ఊరేగింపులకు సంబంధించి పోలీసు వారి అనుమతి పొందవలెను.

పైన తెలిపిన ఎన్నికల ప్రవర్తనా నియమావళిని గమనించుటకు పోలీసు అధికారులు మరియు ఇతర జి.వి.యం.సి అధికారులతో కూడిన 10 తనిఖీ బృందములు నియమించుట జరిగినది. పై బృందములు నగరమంతా సంచరించుచూ, ఏదేని నియమ ఉల్లంఘన గమనించిన ఎడల ఎన్నికల నియమావళి అనుసరించి చర్యలకు ప్రతిపాదించుదరు.

పైన తెలిపిన బృందములు కాకుండా 20 చెక్ పోస్టులు పోలీసు వారు మరియు జీ.వీ.ఎం.సీ సిబ్బందితో, జి.వీ.ఎం.సీ పరిధి నందు ఏర్పాటు చేయడం జరిగినది. సదరు చెక్ పోస్టులయందు వాహనములను, వ్యక్తులను తనిఖీ చేయుదురు. ఎవరైనా నిమిత్తము లేని ధనము మరియు మద్యంతో పట్టుబడిన ఎడల ఎలక్షన్ నియమావళిని అనుసరించి చర్యలు తీసుకొనబడును.

పోటీ చేయు అభ్యర్థులు, అభ్యర్థుల తరపున ఎవరేని మద్యం, డబ్బు, ఏదైనా ఇతర వస్తువులతో ఓటర్లను ప్రలోభ పెట్టుట చేసినయెడల చర్యలు తీసుకొనబడును.

పైన తెలిపిన ఎన్నికల ప్రవర్తనా నియమావళికి వ్యతిరేకంగా ఏదైనా చర్య జరిగిన ఎడల ఎవరైనా వ్యక్తులు సమాచారం తెలుపుటకు జివిఎంసి కంట్రోల్ రూమ్ నెం. 1800 4250 0009 / అలాగే సంబంధిత రిటర్నింగ్ అధికారులు, ఎలక్షన్ పరిశీలకులను సంప్రదించవచ్చునని కమిషనరు తెలిపారు.

పౌర సంబంధాల అధికారి జివిఎంసి

Post a Comment

0 Comments