ఎన్నికల పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలి. * పోలింగ్ మెటీరియల్ పంపిణీకి ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు పూర్తి చేయాలి. * పోలింగ్ రూట్లను పక్కాగా రూపొందించి, వాహనాల రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలి. * రిసెప్షన్ సెంటర్లు, అటెండెన్స్ కౌంటర్లు, పోలీస్ కౌంటర్లు, పార్కింగ్, స్ట్రాంగ్ రూములు తదితర ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలి. * పోలింగ్ సిబ్బందికి తాగునీరు, ఆహారం, మరుగుదొడ్లు తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలి. – జీవీఎంసీ కమిషనర్, అదనపు ఎన్నికల అథారిటీ కేతన్ గార్గ్

 


విశాఖపట్నం, అక్టోబర్ 5: త్వరలో జరగనున్న జీవీఎంసీ సాధారణ ఎన్నికలు–2026ను సమర్థవంతంగా నిర్వహించేందుకు పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందస్తు ప్రణాళికతో పకడ్బందీగా చేపట్టాలని జీవీఎంసీ కమిషనర్, అదనపు ఎన్నికల అథారిటీ కేతన్ గార్గ్ అధికారులను ఆదేశించారు.

సోమవారం జీవీఎంసీ పరిధిలో ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఏర్పాటు చేయనున్న పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను కమిషనర్ కేతన్ గార్గ్ పరిశీలించారు. నార్త్ జోన్‌కు సంబంధించి విశాఖపట్నం గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలలో, వెస్ట్ జోన్‌కు సంబంధించి గోపాలపట్నంలోని ఎస్‌వీఎల్‌ఎన్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేయనున్న డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల ప్రాంగణాలను అదనపు కమిషనర్లు కె. రమేష్, డి.వి. రమణమూర్తి, ఎస్.ఎస్. వర్మ, పి.ఎం. సత్యవేణి, పి. నల్లనయ్య, నార్త్ జోనల్ కమిషనర్ బి. రాము, వెస్ట్ జోనల్ కమిషనర్ బి. హేమవతి తదితర అధికారులతో కలిసి పరిశీలించారు. ఆయా కేంద్రాల్లో చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఎన్నికల నిర్వహణలో పోలింగ్ మెటీరియల్ పంపిణీ అత్యంత కీలకమైన ప్రక్రియ కావడంతో ఎటువంటి లోటుపాట్లకు తావులేకుండా ముందస్తుగానే సమగ్ర ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి సంబంధిత పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామగ్రిని సకాలంలో చేరవేసే విధంగా పోలింగ్ రూట్లను పక్కాగా నిర్ధారించుకోవాలని, ప్రతి రూట్‌కు అవసరమైన వాహనాలు, సిబ్బంది తదితర అంశాలపై ముందుగానే కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సూచించారు.

డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో అవసరమైన రిసెప్షన్ సెంటర్, పోలింగ్ సిబ్బంది అటెండెన్స్ కౌంటర్లు, పోలీస్ కౌంటర్లు, వాహనాల పార్కింగ్ ప్రాంతాలు తదితర వాటిని సౌకర్యవంతంగా ఏర్పాటు చేయాలని తెలిపారు. అధికారులు, పోలింగ్ సిబ్బంది ఎటువంటి గందరగోళానికి గురికాకుండా అవసరమైన ప్రాంతాల్లో స్పష్టమైన డిస్‌ప్లే బోర్డులు, సూచికలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని, సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియజేసేందుకు తగిన పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

ఎన్నికల సామగ్రి భద్రతకు అవసరమైన స్ట్రాంగ్ రూములను నిబంధనల మేరకు ఏర్పాటు చేయడంతో పాటు, బ్యాలెట్ బాక్సులు తదితర పోలింగ్ సామగ్రి పంపిణీకి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని కమిషనర్ సూచించారు. ఎన్నికల సామగ్రిని ముందుగానే సిద్ధం చేసుకొని, పంపిణీ ప్రక్రియలో జాప్యానికి అవకాశం లేకుండా అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ముఖ్యంగా పోలింగ్‌కు అవసరమైన బ్యాలెట్ బాక్సులు, ఇతర ఎన్నికల సామగ్రిని నిర్దేశించిన ప్రకారం ముందుగానే డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు చేర్చుకోవాలని అధికారులను ఆదేశించారు.

డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు వచ్చే పోలింగ్ సిబ్బందికి అవసరమైన ఫుడ్ ప్యాకెట్లు, సురక్షిత తాగునీరు, మరుగుదొడ్లు తదితర మౌలిక సదుపాయాలను తగిన సంఖ్యలో ఏర్పాటు చేయాలన్నారు. కేంద్రాల వద్ద భద్రత, పర్యవేక్షణకు అవసరమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, పోలీసు శాఖతో సమన్వయం చేసుకొని పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు ఎన్నికల సిబ్బంది, వాహనాలు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను ముందుగానే గుర్తించి, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా వాహనాల పార్కింగ్, రాకపోకలకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోవాలని కమిషనర్ స్పష్టం చేశారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి అవసరమైన సమాచారం సులభంగా అందేలా ప్రతి అంశాన్ని స్పష్టంగా ప్రదర్శించాలని సూచించారు.

ఎన్నికల ప్రక్రియలో ప్రతి దశను రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలని, డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో అవసరమైన ఏర్పాట్లన్నింటినీ ముందుగానే పూర్తి చేసి ఎన్నికల నిర్వహణకు సర్వసన్నద్ధంగా ఉండాలని కమిషనర్ కేతన్ గార్గ్ సంబంధిత అదనపు కమిషనర్లు, జోనల్ కమిషనర్లు, ఎన్నికల అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో పర్యవేక్షక ఇంజనీర్లు సంపత్ కుమార్, ఏ. శ్రీనివాస్ రెడ్డి, అసిస్టెంట్ సిటీ ప్లానర్లు తిరుపతిరావు, రామలింగేశ్వర రెడ్డి, కార్యనిర్వాహక ఇంజనీర్లు సంతోషి, పద్మావతి, మాధవరావు ఏపీడీలు , ఏ ఎం ఓ హెచ్ లు తదితరులు పాల్గొన్నారు 

పౌర సంబంధాల అధికారిజివిఎంసి

Post a Comment

0 Comments