విశాఖ నగరంలో తొలిసారిగా విస్తృత స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌ సోలార్‌ ఎక్స్‌పో, ఆంధ్రప్రదేశ్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ ఎక్స్‌పో–2026ను ఈ నెల 25, 26 తేదీల్లో నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ సోలార్‌ ఇంటిగ్రేటర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ (ఏపీ శివ) అధ్యక్షుడు బి విశ్వ ప్రసాద్‌ తెలిపారు.



విశాఖపట్నం-విశాఖ సందేశం వార్తా వాహిని -సోమవారం సీతంపేటలోని ఏపీ శివ అసోసియేషన్‌ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘ఫస్ట్‌ వ్యూ’, ‘సోలార్‌ క్వార్టర్‌’ సంస్థలు సంయుక్తంగా గాదిరాజు ప్యాలెస్‌లో ఈ ఎక్స్‌పోను నిర్వహిస్తున్నాయని, ఏపీ శివ ను అసోసియేషన్‌ పార్టనర్‌గా ఎంపిక చేశారని తెలిపారు. ఈ ఎక్స్‌పోను ప్రజలకు, సోలార్‌ రంగంలో పనిచేస్తున్న సంస్థలకు, విద్యార్థులకు చేరువ చేయాలనే ఉద్దేశంతో మీడియా సమావేశం నిర్వహించినట్లు చెప్పారు. ఈ నెల 25న ఉదయం 11 గంటలకు ఎక్స్‌పో ప్రారంభమవుతుందని, 26వ తేదీ వరకు రెండు రోజులపాటు కొనసాగుతుందని తెలిపారు. విశాఖ ఎంపీ ఎం. శ్రీభరత్‌ ముఖ్య అతిథిగా, ఏపీఈపీడీసీఎల్‌ సీఎండీ ఇమ్మడి పృథ్వీతేజ్‌ గౌరవ అతిథిగా హాజరవుతారని వెల్లడించారు.ఎక్స్‌పోలో సుమారు 100 మంది ఎగ్జిబిటర్లు పాల్గొని దాదాపు 100 స్టాల్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు విష్ణు ప్రసాద్‌ తెలిపారు. 5 వేల నుంచి 10 వేల మంది వరకు సందర్శకులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఇది కేవలం ప్రదర్శన మాత్రమేనని, వివిధ ఉత్పత్తులు, సాంకేతిక పరిజ్ఞానం, సేవలను ప్రజలకు పరిచయం చేయడమే ప్రధాన ఉద్దేశమని చెప్పారు. సోలార్‌ ఎనర్జీతో పాటు రెన్యూవబుల్‌ ఎనర్జీ రంగానికి చెందిన బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్‌ సిస్టమ్స్‌ (బీఈఎస్ఎస్‌), ఇన్వర్టర్లు, సోలార్‌ మాడ్యూల్స్‌, కేబుల్స్‌, ఇతర ఆధునిక పరికరాలను ఎక్స్‌పోలో ప్రదర్శించనున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సోలార్‌ ఎక్స్‌పోలను నిర్వహించిన అనుభవం ‘సోలార్‌ క్వార్టర్‌’ సంస్థకు ఉందని, విశాఖలో గతంలోనూ ఎక్స్‌పో నిర్వహించిందని, ప్రస్తుతం రెండో ఎడిషన్‌గా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రధానంగా పీఎం సూర్య ఘర్‌ పథకం ద్వారా సోలార్‌ విద్యుత్‌ వినియోగంపై ప్రజల్లో అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో, సౌర విద్యుత్‌ ఉత్పత్తి, వినియోగం, నిల్వ, కొత్త సాంకేతికతలపై మరింత సమాచారాన్ని అందించేందుకు ఎక్స్‌పో ఉపయోగపడుతుందని వివరించారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం రెన్యూవబుల్‌ ఎనర్జీ రంగంలో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్‌ సిస్టమ్స్‌కు ప్రాధాన్యత ఇస్తోందని విష్ణు ప్రసాద్‌ తెలిపారు. భవిష్యత్తులో పీఎం సూర్య ఘర్‌ వంటి కార్యక్రమాల్లో బీఈఎస్ఎస్‌ సాంకేతికతకు మరింత ప్రాధాన్యత లభించే అవకాశం ఉన్నందున, దీనిపై ముందుగానే అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. సోలార్‌ రంగంలో పనిచేస్తున్న వెండర్లు, ఇంటిగ్రేటర్లు, తయారీదారులతో పాటు ఇంజినీరింగ్‌ విద్యార్థులు, సాంకేతిక విద్యార్థులకు ఈ ఎక్స్‌పో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. కొత్త సాంకేతికతలు, పరికరాల సామర్థ్యాలు, వాటి వినియోగ విధానాలపై నిపుణుల నుంచి సమాచారం తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు.

ఏపీ శివ  అడ్వైజర్‌ కమ్‌ కోర్‌ కమిటీ సభ్యుడు ఎస్‌ వీ రావు మాట్లాడుతూ సోలార్‌ ఎనర్జీపై ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు విద్యార్థులకు ఉపాధి అవకాశాలకు సంబంధించిన సమాచారాన్ని అందించేందుకు ఎక్స్‌పోలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఐటీఐ, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు సాంకేతిక శిక్షణ, ఉపాధి అవకాశాలకు సంబంధించిన అంశాలను వివరించే కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. విశాఖ నగర పరిధిలోని ఇంజినీరింగ్‌ కళాశాలల నుంచి ఈఈఈ  (ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌), ఈసిఈ (ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌) విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఎక్స్‌పోను సందర్శించేలా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఎక్స్‌పోకు హాజరయ్యే విద్యార్థులకు ఏపీ శివ తరఫున సర్టిఫికెట్లు అందజేస్తామని చెప్పారు.సోలార్‌ రంగంలో తయారీదారులు, డీలర్లు, వెండర్లు, ఇన్‌స్టాలర్లు, సాంకేతిక నిపుణులకు కూడా ఎక్స్‌పో ద్వారా ప్రయోజనం కలుగుతుందని ఎస్‌ వి రావు తెలిపారు. ప్రస్తుతం మార్కెట్‌లోకి వస్తున్న కొత్త రకం సోలార్‌ మాడ్యూల్స్‌, వివిధ సామర్థ్యాల ఇన్వర్టర్లు, కేబుల్స్‌, బ్యాటరీలు, ఎనర్జీ స్టోరేజ్‌ పరికరాలను ఒకే వేదికపై పరిశీలించే అవకాశం ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రెన్యూవబుల్‌ ఎనర్జీ పథకాలు, సబ్సిడీలు, సాంకేతిక ప్రమాణాలు, సోలార్‌ ప్లాంట్ల ఏర్పాటుకు సంబంధించిన అంశాలపై కూడా అవగాహన పొందవచ్చన్నారు. కొత్తగా డీలర్‌షిప్‌ లేదా వ్యాపార అవకాశాలను అన్వేషించే వారికి తయారీ సంస్థల ప్రతినిధులతో నేరుగా మాట్లాడే అవకాశం లభిస్తుందని తెలిపారు. సోలార్‌ వ్యవస్థల ఇన్‌స్టాలేషన్‌లో పాటించాల్సిన సాంకేతిక ప్రమాణాలు, ఆధునిక విధానాలపై కూడా నిపుణులు అవగాహన కల్పిస్తారని ఎస్‌ వి రావు చెప్పారు. సోలార్‌ రంగంలో వేగంగా మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా యువత నైపుణ్యాలను పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విశాఖను రెన్యూవబుల్‌ ఎనర్జీ రంగానికి సంబంధించిన కార్యక్రమాలకు ఒక వేదికగా అభివృద్ధి చేయడానికి ఇలాంటి ఎక్స్‌పోలు దోహదపడతాయని పేర్కొన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సోలార్‌ రంగానికి చెందిన వెండర్లు, వ్యాపార సంస్థలు ఇప్పటికే ఎక్స్‌పోలో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్‌ చేసుకుంటున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజలు, విద్యార్థులు, సోలార్‌ రంగానికి చెందిన వ్యాపారులు, తయారీదారులు, సాంకేతిక నిపుణులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. సోలార్‌ ఎనర్జీపై సాధారణ ప్రజలకు అవగాహన పెంచడం, పరిశ్రమకు సంబంధించిన తాజా సాంకేతికతను పరిచయం చేయడం, విద్యార్థులకు భవిష్యత్తు ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించడం, రెన్యూవబుల్‌ ఎనర్జీ రంగంలో కొత్త వ్యాపార అవకాశాలకు వేదిక కల్పించడం ఎక్స్‌పో ప్రధాన లక్ష్యాలని వివరించారు.మీడియా సమావేశంలో ఏపీ శివ అడ్వైజర్‌ కమ్‌ కోర్‌ కమిటీ సభ్యుడు కే గోపాల్ రెడ్డి,ఏపీ శివ కోశాధికారి పీటీవీఆర్ కృష్ణా రావు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments