పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కూటమి ప్రభుత్వం* *విశాఖ అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నాం *రాష్ట్ర పౌర స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్


విశాఖపట్నం, సెప్టెంబర్ 19: పేదల సొంతింటి కలను సాకారం చేయడంతో పాటు సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యతనిస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. శనివారం విశాఖపట్నంలో నిర్వహించిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 28,445 మంది లబ్ధిదారులకు పట్టాలు అందించడం సాధారణ విషయం కాదని, దీని వెనుక అనేక సమస్యలను పరిష్కరించి, క్రమబద్ధీకరణ ప్రక్రియను పూర్తి చేయాల్సి వచ్చిందని తెలిపారు. సుమారు 400 ఎకరాల భూమికి సంబంధించి రూ.8,874 కోట్ల విలువైన పట్టాలు, కన్వేయన్స్ డీడులు అందించడం గర్వించదగిన విషయమన్నారు. పేదలు ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్న ఇళ్లకు చట్టబద్ధమైన భద్రత కల్పించడం ద్వారా వారి కుటుంబాలు, వారసులకు భరోసా కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. సంక్షేమ పథకాలతో పాటు విశాఖపట్నం అభివృద్ధికి కూడా కూటమి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటోందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా గృహ నిర్మాణానికి సంబంధించిన కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గతంలో పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో జరిగిన అవకతవకలను సరిదిద్దుతూ, అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని గుర్తు చేశారు.


ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నారని మంత్రి అన్నారు. విశాఖపట్నానికి పెట్టుబడులను ఆకర్షించి, యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ఉత్తరాంధ్ర అభివృద్ధికి విశాఖను కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు. ఉత్తరాంధ్ర నుంచి వలసలు తగ్గేలా, స్థానిక యువతకు విద్య, ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వచ్చేలా అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని చెప్పారు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో, రాష్ట్రంలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి సమన్వయంతో విశాఖ, ఉత్తరాంధ్ర అభివృద్ధికి కృషి చేస్తోందని ఉద్ఘాటించారు. ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తామని మంత్రి మ‌నోహ‌ర్ పేర్కాన్నారు.


Post a Comment

0 Comments