ప‌ట్టాల పంపిణీతో పేదల ఆస్తికి భరోసా* *భాజ‌పా రాష్ట్ర అధ్య‌క్షుడు పీవీఎన్ మాధవ్


విశాఖపట్నం, సెప్టెంబర్ 19: పేదల భూమి, ఇంటికీ భరోసా కల్పించడమే ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. శ‌నివారం ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో నిర్వహించిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రజల జీవితాల్లో ఇవాళ ఒక గొప్ప పండుగ రోజని పేర్కొన్నారు. తాము నివసిస్తున్న భూమిపై హక్కు కల్పిస్తూ పట్టాలు, కన్వేయన్స్ డీడ్లు అందించడం ద్వారా వారి భవిష్యత్తుకు భరోసా ఏర్పడుతుందన్నారు.

విశాఖపట్నం ఒక చిన్న మత్స్యకార గ్రామం నుంచి నేడు విశ్వనగరంగా అభివృద్ధి చెందిందని, గతంలో హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి నగరంగా అభివృద్ధి చేయడంలో చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించారన్నారు. అదే తరహాలో విశాఖపట్నాన్ని కూడా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. 2014-19 మధ్య విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్న సమయంలో విశాఖపట్నం ప్రజలకు సుమారు 63 వేల ఇళ్ల పట్టాలు అందించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం అభివృద్ధి, పారిశ్రామిక పెట్టుబడులతో పాటు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తోందన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో విశాఖపట్నం, ఉత్తరాంధ్ర ప్రాంతాల అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందన్నారు. ‘డబుల్ ఇంజిన్ సర్కార్ - ట్రిపుల్ ఇంజిన్ గ్రోత్’ లక్ష్యంతో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడంతో పాటు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేలా ప్రభుత్వం పనిచేస్తోందని గుర్తు చేశారు. కూటమి ఐక్యతను కాపాడుకుంటూ రాష్ట్ర, ప్రాంత అభివృద్ధి కోసం మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పీవీఎన్ మాధవ్ పిలుపునిచ్చారు

Post a Comment

0 Comments