విశాఖపట్నం, సెప్టెంబర్ 25: పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి వివిధ అనుమతుల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని, ఏ దశలోనూ దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా నిర్ణీత సమయంలో అనుమతులు జారీ చేయాలని జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా పరిశ్రమల ఎగుమతి ప్రోత్సాహక కమిటీ (డీఐఈపీసీ) సమావేశంలో పరిశ్రమల స్థాపన, పెట్టుబడుల ప్రోత్సాహం, పారిశ్రామికవేత్తల సమస్యలు, పెండింగ్ అనుమతులపై కలెక్టర్ సమీక్షించారు.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తో పాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలకు అనుగుణంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా వచ్చే దరఖాస్తులకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని, ప్రభుత్వ ప్రాధాన్యత కలిగిన కంపెనీలు, ప్రాజెక్టుల అనుమతుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. ఏపీఐఐసీ ద్వారా ఏర్పాటు చేయనున్న కంపెనీలకు సంబంధించిన రిజిస్ట్రేషన్, సేల్ డీడ్ ప్రక్రియలను కూడా వేగవంతం చేయాలన్నారు. తుంగ్లాం వద్ద రైల్వే లైన్ల మధ్య ఉన్న సుమారు 12 ఎకరాల ఏపీఐఐసీ భూమిని వీలైనంత త్వరగా పారిశ్రామిక అవసరాలకు వినియోగంలోకి తీసుకురావాలని చెప్పారు. ఇందుకు రైల్వే అధికారులు కూడా త్వరితగతిన స్పందించి జిల్లా యంత్రాంగానికి సహకరించాలన్నారు. నానో పార్కులు, ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటును మరింత వేగవంతం చేయాలని, ఉత్తర, దక్షిణ నియోజకవర్గాల పరిధిలో ఏర్పాటు చేయనున్న ఎంఎస్ఎంఈ పార్కుల విషయంలో స్పష్టమైన పురోగతి సాధించాలని అధికారులను ఆదేశించారు. పరిశ్రమలకు అందాల్సిన ఇన్సెంటివ్స్ను త్వరితగతిన శాంక్షన్ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. పీఎంఈజీపీ ద్వారా వీలైనంత ఎక్కువ మందికి ఉపాధి లభించేలా చర్యలు చేపట్టాలని, ఎస్ఐపీబీలో ఆమోదం పొందిన, ఎంవోయూలు కుదుర్చుకున్న కంపెనీల ఏర్పాటు పురోగతిని సమీక్షించి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
సమావేశానికి ముందు పలువురు కంపెనీల ప్రతినిధులు తమ పరిశ్రమలకు సంబంధించిన వివిధ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. వారి సమస్యలను సావధానంగా విన్న కలెక్టర్, సంబంధిత అంశాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా పరిశ్రమల కేంద్రం (డీఐసీ), ఏపీఐఐసీ అధికారులను ఆదేశించారు. పీజీఆర్ఎస్ ద్వారా అందిన పారిశ్రామికవేత్తల వినతులను కూడా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ వి. ఆదిశేషు, ఏపీఐఐసీ జోనల్ కమిషనర్ సింహాచలం, జీవీఎంసీ, వీఎంఆర్డీఏ, రైల్వే తదితర శాఖల అధికారులు, వివిధ పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు.



0 Comments