విశ్వ‌విద్యాల‌యం మా ప్ర‌గ‌తికి రాచ‌బాట వేసింది - ఆచార్యుల వాత్స‌ల్యం మ‌రువ‌లేము - జీవ‌న మెళ‌కువ‌ల‌ను అందించారు - హైకోర్టు విశ్రాంత న్యాయ‌మూర్తి జ‌స్టిస్ నూతి రామ్మోహ‌న్‌ రావు


 ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం, సెప్టెంబ‌ర్ 26:చిన్ననాటి సంగతులను నెమరు వేసుకున్నారు. అపురూపమైన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తమ భవిష్యత్తును మలిచిన గురువులను మనస్పూర్తిగా స్మరించుకున్నారు. తమ హోదాలను మరిచి స్నేహితులతో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ రోజంతా గడిపారు.

తాము పాఠాలు నేర్చుకున్న తరగతి గదులలో కూర్చుని ఆనాటి గుర్తులను ,అనుభూతులను, అనుభవాలను నెమరు వేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ఆంధ్ర విశ్వవిద్యాలయం న్యాయ కళాశాల వేదిక అయింది. 1975- 1978 సంవత్సరంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ న్యాయ కళాశాలలో న్యాయవిద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థులంతా ఈ రోజు కళాశాలలో కలుసుకున్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనం 50 సంవత్సరాల క్రితం తాము కళాశాలలో అడుగుపెట్టిన నాటి నుంచి నేటి వరకు జరిగిన అపురూప సంఘటనలను, అనిర్వచనీయమైన అనుభవాలను గుర్తు చేసుకోవడానికి వేదికగా నిలిచింది.

పూర్వ విద్యార్థి, రాష్ట్ర హైకోర్టు పూర్వ న్యాయ‌మూర్తి జ‌స్టిస్ నూతి రామ్మోహ‌న్ రావు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొని, త‌న స్నేహితుల‌తో ఆత్మీయంగా గ‌డిపారు. ఆయ‌న‌తో పాటు విశ్రాంత జిల్లా న్యాయ‌మూర్తులు వి.ఏ ప్ర‌భాక‌ర రావు, కె.సుభ్ర‌హ్మ‌ణ్యేశ్వ‌ర రావు, టి.సింహాచ‌లం, దివీస్ లాబ‌రేట‌రీస్ లిమిటెడ్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ వై.కోటేశ్వ‌ర రావు,  ప్ర‌భుత్వ న్యాయ‌వాదులుగా సేవ‌లందించిన దుర్గా ప్ర‌సాద్‌, అప్ప‌ల స్వామి, ముర‌ళీ మోహ‌న్‌, కార్య‌క్ర‌మానికి స‌మ‌న్వ‌యం చేసిన కె.ఎస్ శంక‌ర్‌, ఎన్‌.దుర్గాప్ర‌సాద్‌, ద‌త్తు స‌మ‌న్వ‌యం చేసారు.

ఈ సంద‌ర్భంగా పూర్వ హైకోర్టు న్యాయ‌మూర్తి నూతి రామ్మోహ‌న్ రావు మాట్లాడుతూ ఐదు ద‌శాబ్ధాల క్రితం ఇక్క‌డ విద్యార్థులుగా అడుగిడిన త‌మ‌ను న్యాయ క‌ళాశాల ఆచార్యులు ఎంతో ప్రేమ‌తో చేర‌దీని న్యాయ‌శాస్త్ర ఓన‌మాలు నేర్పించార‌న్నారు. వారు త‌మ‌పై చూపిన ప్రేమ‌, అభిమానం నేటికీ మ‌రువ‌లేమ‌న్నారు. త‌మ బ్యాచ్‌లో ప్ర‌తీ విద్యార్థి ఎంతో ఉన్న‌తంగా ఎదిగార‌ని, దానికి నాటి ఆచార్యుల కృషి కార‌ణ‌మ‌న్నారు.  అద్భుతంగా ఆలోచించే విధానం మాకు నేర్పించారు. ఆచార్యులు అందించిన వాత్స‌ల్యం మ‌రువ‌లేమ‌న్నారు. విశ్వ‌విద్యాల‌య జీవితం ఎంతో విలువైన‌ద‌ని, ఎన్నో మెళ‌కువ‌ల‌ను నేర్చుకోవాల‌న్నారు.

న్యాయ క‌ళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య కె.సీతామాణిక్యం మాట్లాడుతూ న్యాయ క‌ళాశాల‌లో చ‌దువుకున్న పూర్వ విద్యార్థులు త‌మ అపార‌మైన అనుభ‌వాన్ని, జ్ఞానాన్ని నేటి త‌రం విద్యార్థుల‌కు అందించాల‌ని కోరారు. ప్ర‌స్తుత త‌రం విద్యార్థులు ఉన్న‌తంగా రాణించ‌డానికి మార్గ‌ద‌ర్శ‌కం అందించే బాధ్య‌త‌ను పూర్వ విద్యార్థులు స్వీక‌రించాల‌న్నారు.

దివీస్ లాబ‌రేట‌రీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ వై.కోటేశ్వ‌ర రావు మాట్లాడుతూ మా ఉన్న‌తికి బాట‌వేసిన మాతృసంస్థ ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం డాక్ట‌ర్ బి.ఆర్ అంబేద్క‌ర్ న్యాయ క‌ళాశాల అని అన్నారు. ఐదు ద‌శాబ్ధాల క్రితం చ‌దువుకున్న తామంతా నేడు క‌లుసుకోవ‌డం, కొత్త ఉత్సాహాన్ని, సంతోషాన్ని అందిస్తోంద‌న్నారు. విశ్వ‌విద్యాల‌యానికి ఎల్ల‌ప్పుడూ రుణ‌ప‌డి ఉంటామ‌ని, వ‌ర్సిటీ ప్ర‌గ‌తిలో తాము ఎప్పుడూ భాగ‌మ‌వుతామ‌న్నారు.

కార్య‌క్ర‌మంలో భాగంగా జ‌స్టిస్ నూతి రామ్మోహ‌న రావును న్యాయ క‌ళాశాల ప్రిన్సిపాల్ స‌త్క‌రించి, జ్ఞాపిక బ‌హూక‌రించారు. విశ్వ‌హిందీ ప‌రిష‌త్ అద్య‌క్షులు ఆచార్య యార్ల‌గ‌డ్డ ల‌క్ష్మీ ప్ర‌సాద్ కార్య‌క్ర‌మంలో పాల్గొని జ‌స్టిస్ రామ్మోహ‌న రావును స‌త్కరించి, తాను ర‌చించిన ప‌లు పుస్త‌కాల‌ను బ‌హూక‌రించారు. ఈ బ్యాచ్ విద్యార్థుల‌తో త‌న‌కున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

Post a Comment

0 Comments