ఆధునిక తెలుగు సాహిత్యానికి ఆదిగురువు గురజాడ అక్షరాన్ని ఆయుధంగా మలచిన నవయుగ వైతాళికుడు సమాజ చైతన్యానికి గురజాడ రచనలు చుక్కానిలు


ఆంధ్ర విశ్వవిద్యాలయం సెప్టెంబర్ 21:ఆధునిక తెలుగు సాహిత్యానికి యుగకర్త, నవయుగ వైతాళికుడు మహాకవి గురజాడ అప్పారావు అని ఆంధ్ర విశ్వకళాపరిషత్ తెలుగు శాఖాధిపతి ఆచార్య జర్రా అప్పారావు అన్నారు. గురజాడ అప్పారావు 164వ జయంతిని పురస్కరించుకుని సోమవారం ఏయూ తెలుగు శాఖ సమావేశ మందిరంలో ఆధునిక తెలుగు సాహిత్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గురజాడ చిత్రపటానికి ఆచార్య జర్రా అప్పారావు పూలమాల వేసి నివాళులర్పించారు.

ఆచార్య జర్రా అప్పారావు మాట్లాడుతూ గురజాడ జననం తెలుగు సాహిత్యానికి అరుణోదయమన్నారు. కందుకూరి సాంఘిక విప్లవం, గిడుగు భాషా విప్లవాలను సమన్వయించి సరికొత్త సాహిత్య విప్లవానికి నాంది పలికిన మహనీయుడు గురజాడ అని అన్నారు. గురజాడ జయంతిని ఆధునిక తెలుగు సాహిత్య దినోత్సవంగా నిర్వహించాలని పిలుపునిచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

అరసం విశాఖ జిల్లా అధ్యక్షుడు ఉప్పల అప్పలరాజు మాట్లాడుతూ గురజాడ రచనలు నేటి తరానికి అందుబాటులో ఉండటానికి శెట్టి ఈశ్వరరావు కృషి ఎంతో గొప్పదన్నారు. విశాఖ రజితల సంఘం అధ్యక్షుడు అడపా రామకృష్ణ మాట్లాడుతూ గురజాడ రచనలు సమాజాన్ని చైతన్యపరిచాయని, సాహిత్యం సామాజిక ప్రతిబింబమని తన పాత్రల ద్వారా చాటారని అన్నారు.

ఆచార్య వెలమల సిమ్మన్న మాట్లాడుతూ ఆధునిక తెలుగు సాహిత్యానికి ఆదిగురువు, నిర్మాత గురజాడ అని అన్నారు. నాటకాలు, కథలు, వ్యాసాలు, లేఖల ద్వారా సమాజాన్ని మేల్కొల్పిన అక్షర యోధుడని పేర్కొన్నారు. ‘దిద్దుబాటు’, ‘దేవుళ్లారా మీ పేరేమిటి’, ‘పెద్ద మసీదు’, ‘సంస్కర్త హృదయం’, ‘కన్యాశుల్కం’ వంటి రచనలతో సామాజిక చైతన్యానికి కృషి చేశారని తెలిపారు.


ద్వితీయ సంవత్సరం విద్యార్థిని బి. ఆశ మాట్లాడుతూ గురజాడ రచనల్లోని మధురవాణి, పూర్ణమ్మ, కన్యక, సరళ, నాంచారమ్మ వంటి స్త్రీ పాత్రలు సమాజ చైతన్యానికి ప్రతీకలుగా నిలిచాయని వివరించారు. మారిషస్ విద్యార్థి అప్పడు వివేకరావు మాట్లాడుతూ గురజాడ ‘దేశభక్తి గీతం’ దేశభక్తితో పాటు సంస్కరణ దృక్పథాన్ని ప్రజల్లో పెంపొందించిందన్నారు. పరిశోధక విద్యార్థి పరశురాం గురజాడ సృష్టించిన కన్యక, పూర్ణమ్మ పాత్రల విశిష్టతను వివరించారు. దేవిశ్రీ గురజాడ గేయాలను ఆలపించారు.


ద్వితీయ సంవత్సరం విద్యార్థి పి. ఇస్లాం ఆహ్వానంతో కార్యక్రమం ప్రారంభం కాగా, కే. రత్నం వందన సమర్పణ చేశారు. కార్యక్రమంలో తెలుగు శాఖ అధ్యాపకులు డా. ఎం. కృష్ణవేణి, డా. ఎం. దాసు, డా. బి. సూర్యనారాయణ, డా. ఎం. ప్రతాప్, డా. పి. శ్రీనివాసరావు, డా. ఎల్. గిరీష్ కుమార్, డా. ఆర్. శివయ్య, ఏయూ సైకాలజీ పరిశోధక విద్యార్థి..జాతీయ జర్నలిస్ట్ సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, పితాని ప్రసాద్, అడపా రామకృష్ణ, దేవిశ్రీ, పోతన, సాహితీవేత్తలు, పుర ప్రముఖులు, భాషాభిమానులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments