విశాఖపట్నం, సెప్టెంబర్ 17: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 19న విశాఖ నగరంలోని ఆర్కే బీచ్‌లో నిర్వహించనున్న ‘స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర’ (SASA) కార్యక్రమంలో పాల్గొననున్న నేపథ్యంలో, కార్యక్రమ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు, పారిశుద్ధ్యం, సుందరీకరణ పనులను జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జీవీఎంసీ అదనపు కమిషనర్లు కె. రమేష్, పల్లి నల్లనయ్య, ప్రధాన ఇంజనీరు పి.వి.వి. సత్యనారాయణ రాజు, ఇంజనీరింగ్ తదితర విభాగాల అధికారులతో కలిసి ఆర్కే బీచ్, బీచ్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో చేపడుతున్న ఏర్పాట్లను కమిషనర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి పర్యటనతో పాటు ‘సాసా’ కార్యక్రమ నిర్వహణలో ఎటువంటి లోపాలకు తావులేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. VIP రూట్ అంతటా నిరంతర పారిశుద్ధ్య పనులు చేపట్టి, రహదారులు, ఫుట్‌పాత్‌లను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. రహదారులపై గుంతలను యుద్ధప్రాతిపదికన మరమ్మతు చేయడంతో పాటు కర్బ్ వాల్స్‌కు పెయింటింగ్, అవసరమైన ప్రాంతాల్లో జీబ్రా క్రాసింగ్ మార్కింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
ఆర్కే బీచ్‌తో పాటు బీచ్ రోడ్డును మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని, అవసరమైన ప్రాంతాల్లో అందమైన పెయింటింగులు, పచ్చని మొక్కలు, జంక్షన్ల సుందరీకరణ చేపట్టాలని కమిషనర్ సూచించారు. ఫౌంటెన్లు సక్రమంగా పనిచేసేలా నిర్వహణ చేపట్టాలని, బీచ్ రోడ్డు పరిసరాలు రాత్రి వేళల్లో కాంతివంతంగా కనిపించేలా వీధి దీపాలు, అవసరమైన అదనపు లైటింగ్ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. VIP రూట్‌తో పాటు కార్యక్రమ పరిసర ప్రాంతాల్లో ఆక్రమణలను తొలగించాలని, రోడ్లు, ఫుట్‌పాత్‌లపై అనధికార బడ్డీలు, వ్యాపార బళ్లు లేకుండా చర్యలు చేపట్టాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు.
అనుమతి లేని బ్యానర్లు, ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని స్పష్టం చేశారు. అదేవిధంగా రోడ్లు, ఫుట్‌పాత్‌లపై పశువులు, వీధి కుక్కల సంచారాన్ని నియంత్రించేందుకు తగిన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులు, సిటీ వెటర్నరీ అధికారిని ఆదేశించారు.
అలాగే ముఖ్యమంత్రి పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్న ఇంజనీరింగ్ కాలేజ్ ప్రాంతంలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని కమిషనర్ ఆదేశించారు. కార్యక్రమ ప్రాంగణంతో పాటు పరిసర ప్రాంతాలు నిరంతరం పరిశుభ్రంగా ఉండేలా ప్రత్యేక పారిశుద్ధ్య బృందాలను ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని సూచించారు.
ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను సంబంధిత శాఖల హెచ్‌ఓడీలు, జోనల్ హెచ్‌ఓడీలు స్వయంగా పర్యవేక్షించాలని, శాఖల మధ్య సమన్వయంతో పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేసి నగరాన్ని పరిశుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దాలని కమిషనర్ కేతన్ గార్గ్ అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఈస్ట్ జోనల్ కమిషనర్ కే.శివప్రసాద్, ఇన్చార్జి ప్రధాన వైద్యాధికారి డాక్టర్ కృష్ణంరాజు, పర్యవేక్షక ఇంజనీర్లు ఏ.శ్రీనివాసరెడ్డి, అసిస్టెంట్ సిటీ ప్లానర్ రామలింగేశ్వర రెడ్డి, సహాయక వైద్యాధికారి బి. ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.
పౌర సంబంధాల అధికారి,జీవీఎంసీ.
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
0 Comments