జిల్లాస్థాయి స్వచ్ఛ ఆంధ్ర అవార్డుల్లో జీవీఎంసీకి విశిష్ట గుర్తింపు • “స్వచ్ఛ మున్సిపాలిటీస్” కేటగిరీలో జీవీఎంసీకి జిల్లాస్థాయి అవార్డు. • స్వచ్ఛత వారియర్స్, ఎన్జీవోలు, ఎస్‌ఎల్‌ఎఫ్, కాలనీ సంక్షేమ సంఘాలకు వివిధ కేటగిరీల్లో పురస్కారాలు. • విశాఖ జిల్లా వ్యాప్తంగా వివిధ కేటగిరీల్లో 68 మంది వ్యక్తులు, సంస్థలకు అవార్డులు.

 


విశాఖపట్నం, అక్టోబర్ 2: మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం వీఎంఆర్‌డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో నిర్వహించిన జిల్లాస్థాయి స్వచ్ఛ ఆంధ్ర అవార్డుల ప్రదానోత్సవంలో జీవీఎంసీతో పాటు జీవీఎంసీ పరిధిలో స్వచ్ఛత, పారిశుధ్యం, పర్యావరణ పరిరక్షణకు విశేషంగా కృషి చేస్తున్న పలువురు వ్యక్తులు, సంస్థలు వివిధ కేటగిరీల్లో పురస్కారాలు అందుకున్నారు. జిల్లా కలెక్టర్, జీవీఎంసీ ప్రత్యేక అధికారి ఎం. అభిషిక్త్ కిశోర్, ఎంపీ ఎం. శ్రీభరత్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు తదితర ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా అవార్డులను ప్రదానం చేశారు.


జిల్లాస్థాయిలో “స్వచ్ఛ మున్సిపాలిటీస్” కేటగిరీలో జీవీఎంసీకి లభించిన అవార్డును జీవీఎంసీ అదనపు కమిషనర్ డి.వి. రమణమూర్తి స్వీకరించారు. నగర పరిశుభ్రత, పారిశుధ్య నిర్వహణ, స్వచ్ఛత కార్యక్రమాల అమలులో జీవీఎంసీ చేస్తున్న కృషికి ఈ పురస్కారం గుర్తింపుగా నిలిచింది.


జిల్లా కలెక్టర్, జీవీఎంసీ ప్రత్యేక అధికారి ఎం. అభిషిక్త్ కిశోర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి విశాఖపట్నం ఎంపీ ఎం. శ్రీభరత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు తదితరులు పాల్గొన్నారు.

జీవీఎంసీ పరిధిలో “స్వచ్ఛ SLFs” కేటగిరీలో కె.ఆర్.ఎం. కాలనీ SLF, “బెస్ట్ స్వచ్ఛత ఎన్జీవోస్” కేటగిరీలో గ్రీన్ క్లైమేట్ టీమ్, స్వంతన సేవా సమితి, పెందుర్తి టెర్రస్ గార్డెన్ సొసైటీ, “స్వచ్ఛ కాలనీస్” కేటగిరీలో శ్రీ తిరుమల నగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లాస్థాయి పురస్కారాలు అందుకున్నాయి.

అలాగే “బెస్ట్ స్వచ్ఛత వారియర్స్ (Sanitation Workers)” కేటగిరీలో జీవీఎంసీ నార్త్ జోన్‌కు చెందిన బంగారి ప్రసాద్, సౌత్ జోన్‌కు చెందిన బి. సాయి శంకర్రావు, గాజువాక జోన్‌కు చెందిన పి. సత్యవతి, ఈస్ట్ జోన్‌కు చెందిన జి. కోటేశ్వరి జిల్లా కలెక్టర్, ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా పురస్కారాలు 
అందుకున్నారు.

ఈ సందర్భంగా విశాఖపట్నం ఎంపీ ఎం. శ్రీభరత్ మాట్లాడుతూ, స్వచ్ఛతను ప్రతి పౌరుడు సామాజిక బాధ్యతగా స్వీకరించి ఇంటి నుంచే పరిశుభ్రతకు శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. నగర పరిశుభ్రత బాధ్యత కేవలం పారిశుధ్య కార్మికులపైనే కాకుండా ప్రతి పౌరుడిపైనా ఉందని ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ మాట్లాడుతూ, విశాఖను ప్రపంచస్థాయి పరిశుభ్రత ప్రమాణాలతో కూడిన నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. జపాన్ తరహా పరిశుభ్రత ప్రమాణాలను సాధించే దిశగా ప్రజల భాగస్వామ్యం, ప్రవర్తనలో మార్పు అత్యంత కీలకమని పేర్కొన్నారు.


జిల్లాస్థాయి స్వచ్ఛ ఆంధ్ర అవార్డుల కార్యక్రమంలో వివిధ విభాగాల్లో మొత్తం 68 మంది వ్యక్తులు, సంస్థలకు పురస్కారాలు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఏపీ ఆయిల్ అండ్ సీడ్స్ గ్రోవర్స్ కార్పొరేషన్ చైర్మన్ గండి బాబ్జీ, డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్లు బి. రామిరెడ్డి, జె. నాగలక్ష్మి, జీవీఎంసీ అదనపు కమిషనర్లు డి.వి. రమణమూర్తి, పి.ఎం. సత్యవేణి, వివిధ శాఖల అధికారులు, అవార్డు గ్రహీతలు పాల్గొన్నారు.

పౌర సంబంధాల అధికారి  
జీవీఎంసీ

Post a Comment

0 Comments