యువ‌త‌రం ఆరోగ్యంపై శ్ర‌ద్ద వ‌హించాలి - టి.బి ర‌హిత‌ స‌మాజం సాకారం కావాలి

ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం,అక్టోబ‌ర్7:ఆరోగ్య‌వంత‌మైన యువ‌త‌తో దేశ ప్ర‌గ‌తి సాధ్య‌ప‌డుతుంద‌ని ఏయూ రెక్టార్ ఆచార్య పులిపాటి కింగ్ అన్నారు. టి.బి ఫ్రీ ఇండియా వంద రోజుల క్యాంపెయిన్‌లో భాగంగా  ప్ర‌భుత్వ ఛాతీ ఆసుప‌త్రితో సంయుక్తంగా ఏయూ శ్రీరామినేని కోదండ‌రామ‌య్య ఆడిటోరియంలో నిర్వ‌హించిన అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాన్ని ఆయ‌న ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా రెక్టార్ ఆచార్య కింగ్ మాట్లాడుతూ ఆరోగ్య అవ‌గాహ‌న క‌లిగి ఉండ‌టం, మంచి జీవ‌న అల‌వాట్లు పెంపొందించుకోవ‌డం ఎంతో అవ‌స‌ర‌మ‌న్నారు.  టి.బి ర‌హిత స‌మాజం సాకారం కావాల‌ని, ఈ దిశ‌గా యువత  ప‌నిచేయాల‌న్నారు.   

కార్య‌క్ర‌మ క‌న్వీన‌ర్, ఏయూ వైద్యాధికారి డాక్ట‌ర్ జి.ఏ.వి రామేశ్వ‌ర్ మాట్లాడుతూ టి.బి వ్యాధిపై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న పెంచే విధంగా కేంద్ర ప్ర‌భుత్వం విస్తృత స్థాయిలో కార్య‌క్ర‌మాల‌ను చేప‌డుతోంద‌న్నారు. ప్ర‌భుత్వ ఛాతీ-అంటువ్యాధుల ఆసుప‌త్రి స‌హ‌కారంతో ఏయూ విద్యార్థుల‌కు ఇటువంటి అవ‌గాహ‌న స‌ద‌స్సుల‌ను నిర్వ‌హిస్తున్నామ‌న్నారు. విద్యార్థులు టి.బి వ్యాధిపై ప్ర‌చారం చేస్తూ, అవ‌గాహ‌న పెంచాల‌న్నారు. 

కార్య‌క్ర‌మంలో ఫార్మ‌శీ క‌ళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య జి.గిరిజా శంక‌ర్‌, విద్యార్థి సంక్షేమ విభాగం డీన్ ఆచార్య ఎస్‌.హ‌ర‌నాథ్‌, ఎన్.ఎస్‌.ఎస్ స‌మ‌న్వ‌య‌క‌ర్త డి.సింహాచ‌లం త‌దిత‌రులు ప్ర‌సంగించారు. అనంత‌రం ప్ర‌భుత్వ ఛాతీ ఆసుప‌త్రి వైద్యులు డాక్ట‌ర్ సూర్య కుమారి టి.బి వ్యాధి వ్యాపించే విధానం, నియంత్ర‌ణ‌, నివార‌ణ చ‌ర్య‌లు త‌దిత‌ర అంశాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించారు. అనంత‌రం విద్యార్థుతో టి.బి ని పార‌ద్రోలుతామ‌ని ప్ర‌తిజ్ఞ చేయించారు. కార్య‌క్ర‌మంలో ప్ర‌భుత్వ ఛెస్ట్ ఆసుప‌త్రి వైద్యులు డాక్ట‌ర్ సుధాక‌ర్‌, డాక్ట‌ర్ ప్ర‌దీపిక‌, డాక్ట‌ర్ ప్ర‌వీన్‌, డాక్ట‌ర్ హ‌రిత టిబి ల‌క్ష‌ణాలు, వ్యాప్తి, వైద్య చికిత్స‌పై స‌మ‌గ్ర వివ‌ర‌ణ అందించారు. కార్య‌క్ర‌మంలో డాక్ట‌ర్ ప‌ల్ల‌వి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments