సింహాచలం:4 అక్టోబర్ 2026ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా, అనావృష్టి నివారణార్థం మరియు లోక కల్యాణార్థం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థాన ఉపాలయమైన శ్రీ త్రిపురాంతక స్వామి వారి ఆలయం (శివాలయం) నందు మూడు రోజుల పాటు నిర్వహించే ప్రత్యేక వరుణ జపం, సహస్రఘటాభిషేక మహోత్సవాలు నేడు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి.
ఈ పూజా కార్యక్రమాలలో ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ జల్లేపల్లి వెంకటరావు దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మొదటి రోజు (ఆదివారం) ఉదయం విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, పంచగవ్య త్రిశూరార్చన, ఋష్యశృంగ ఆవాహన, దీక్షాధారణలు, వేద పారాయణములు, ఋత్విగ్వరణలు, వరుణ జపాలు, నీరాజన మంత్రపుష్పములు శాస్త్రోక్తంగా జరిగాయి. సాయంత్రం మృత్సం గ్రహణ, వేద పారాయణములు, అంకురార్పణ, అగ్ని ప్రతిష్ఠాపన, ధ్వజారోహణ, మృత్తికా పఠనం, ఆలయ బలిహరణలు నిర్వహించి తీర్థ ప్రసాద వితరణ చేయనున్నారు.ఈ పూజా క్రతువు అక్టోబర్ 6వ తేదీ మంగళవారం వరకు మూడు రోజుల పాటు కొనసాగనుంది:
రెండవ రోజు (సోమవారం): ఉదయం గణపతి పూజ, గవ్యాన్త పూజలు, మార్జనలు, పునః పూజలు, వాస్తు పూజ, వాస్తు హోమం, వరుణ జపములు, బింబ శుద్ధి (ఉదక శాంతి). సాయంత్రం నిత్య హోమములు, వరుణ జపములు, వేదపారాయణాలు జరుగుతాయి.
మూడవ రోజు (మంగళవారం): ఉదయం గణపతి పూజ, గవ్యాన్త పూజలు, మార్జనలు అనంతరం శివాలయంలో సహస్రఘటాభిషేకము, నిత్యహోమములు, పూర్ణాహుతి నివేదనలు, ప్రసాద వితరణ మరియు అన్న సమారాధన కార్యక్రమము జరుగుతుంది.
భక్తులకు దర్శన వివరాలు:
ఈ విశేష హోమాలు, పూజా కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ, శ్రీ త్రిపురాంతక స్వామి వారి ఆలయ దర్శనాలు ప్రతిరోజూ యథావిధిగా ఉదయం గం. 05:30 ల నుండి మధ్యాహ్నం గం. 12:30 ల వరకు, మరియు సాయంత్రం గం. 04:00 ల నుండి రాత్రి గం. 07:00 ల వరకు భక్తులకు లభిస్తాయని, దర్శన సమయాలలో ఎటువంటి మార్పులు లేవని అధికారులు తెలియజేశారు.


0 Comments