విశాఖపట్నం, అక్టోబర్ 17: మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ రెండవ సాధారణ ఎన్నికల నిర్వహణకు సంబంధించి పెందుర్తి జోన్ పరిధిలోని నాయుడుతోట, రవినగర్‌లో ఉన్న భాష్యం స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రం, స్ట్రాంగ్ రూమ్‌లను జీవీఎంసీ కమిషనర్, అదనపు ఎన్నికల అధికారి కేతన్ గార్గ్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల సిబ్బందికి పంపిణీ చేయనున్న ఎన్నికల సామగ్రిని, డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లో ఉన్న మ్యాప్‌ను పరిశీలించి, ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రక్రియ సజావుగా జరిగేలా అవసరమైన పలు సూచనలు చేశారు.అనంతరం పెందుర్తి జోనల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రిటర్నింగ్ అధికారుల రూములను, ఎన్నికల విధుల నిర్వహణకు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. రిటర్నింగ్ అధికారులతో మాట్లాడి ఎన్నికల విధివిధానాలు, బాధ్యతలపై వివరాలు తెలుసుకున్నారు. అలాగే కంప్లైంట్ సెక్షన్, హెల్ప్‌డెస్క్, సింగిల్ విండో వ్యవస్థలను పరిశీలించి, ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారంలో సిబ్బంది సమర్థవంతంగా వ్యవహరించాలని సూచించారు. జోన్ పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాలను ఇంజినీరింగ్ అధికారులు సందర్శించి, అవసరమైన మరమ్మతులను తక్షణమే చేపట్టి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. శానిటరీ కార్యదర్శులు, ఇంజినీరింగ్ సిబ్బంది పోలింగ్ కేంద్రాలను సందర్శించి పారిశుధ్య పనులు, ఇతర ఏర్పాట్లను పర్యవేక్షించాలని సూచించారు. స్ట్రక్చర్ అధికారులు, రూట్ అధికారులు తమ పరిధిలోని ప్రతి పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి, అక్కడి ఏర్పాట్లను పరిశీలన చేయాలని ఆదేశించారు.
ఎన్నికల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లన్నీ ముందుగానే పూర్తి చేసి ఎన్నికల విధులకు సిద్ధంగా ఉండాలని కమిషనర్ సూచించారు.
ఈ పరిశీలనలో జీవీఎంసీ అదనపు కమిషనర్ రమేష్ , జోనల్ కమిషనర్ హెచ్ శంకర్రావు, నోడల్ ఆఫీసర్ శేషు శైలజ, ఏసీపీ రామలింగేశ్వరరెడ్డి, పర్యవేక్షణ ఇంజినీర్ దిలీప్, ఏ ఎం ఓ హెచ్ తదితరులు పాల్గొన్నారు.
మీడియా సెంటర్,జీవీఎంసీ ఎలక్షన్స్-2026


0 Comments