విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లో ఘనంగా ప్రపంచ ట్రామా దినోత్సవం*


విశాఖపట్నం:*ప్రపంచ ట్రామా దినోత్సవాన్ని శనివారం విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లో విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వి. మన్మధరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా "ఒక్క ఫోన్ కాల్... ఒక అమూల్యమైన ప్రాణానికి రక్షణ...! ప్రమాద బాధితులకు అండగా నిలుద్దాం... ప్రాణాలను కాపాడుదాం...!" అనే నినాదంతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ప్రతి సంవత్సరం అక్టోబర్ 17న నిర్వహించే ప్రపంచ ట్రామా దినోత్సవం రోడ్డు ప్రమాదాలు, ఎత్తు నుంచి పడిపోవడం, పని ప్రదేశాల్లో ప్రమాదాల వల్ల కలిగే తీవ్రమైన గాయాలపై అవగాహన కల్పించడం, ప్రమాదాలను నివారించడం, క్షతగాత్రులకు సకాలంలో అత్యవసర వైద్యం అందించడం ప్రధాన లక్ష్యమని డాక్టర్ వి. మన్మధరావు తెలిపారు.

ప్రమాదం జరిగిన తర్వాత తొలి గంటను గోల్డెన్ అవర్ అంటారని, ఈ సమయంలో అత్యవసర వైద్యం అందించడం ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు.

ప్రమాదం జరిగినప్పుడు వెంటనే 108కు కాల్ చేయాలి, ప్రమాద స్థలాన్ని సురక్షితంగా ఉంచాలి, బాధితుడిని అనవసరంగా కదిలించకూడదు, రక్తస్రావం ఉంటే శుభ్రమైన గుడ్డతో ఒత్తిడి పెట్టాలి, బాధితుడి శ్వాసను గమనించాలి, సహాయం వచ్చే వరకు ధైర్యం చెప్పాలని సూచించారు. ప్రమాద బాధితులకు సహాయం చేయడానికి భయపడవద్దని, భారతదేశంలో సద్భావంతో సహాయం చేసే వ్యక్తులకు చట్టపరమైన రక్షణలు ఉన్నాయని తెలిపారు. "నేను రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తాను, ప్రమాద బాధితులను నిర్లక్ష్యం చేయను, అత్యవసర పరిస్థితుల్లో 108కు కాల్ చేస్తాను" అని ఈ సందర్భంగా అందరూ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ అడ్మిన్స్ట్రేటర్ డాక్టర్ మనోజ్ కుమార్, 108 సిబ్బంది, నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు

Post a Comment

0 Comments