విశాఖపట్నం:సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్న బ్రాహ్మణులను రాజకీయ పార్టీలు చులకన చేయడం దారుణమని విశాఖ బ్రాహ్మణ ఐక్య వేదిక సభ్యులు ఘాటుగా స్పందించారు. జీవీఎంసీ ఎన్నికల్లో బ్రాహ్మణులను అన్ని పార్టీలూ విస్మరించడం సమాజిక వర్గాన్ని అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను విస్మరిస్తే తమ సత్తా ఏంటో చూపిస్తామని స్పష్టం చేశారు. విశాఖ పౌరగ్రంధాలయంలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో వివిధ బ్రాహ్మణ సంఘాల తరపున బ్రాహ్మణ పెద్దలు కేసాప్రగడ నరసింహమూర్తి,ముళ్ళపూడి కోటేశ్వర రావు,గాడేపల్లి ప్రభాకర శాస్త్రి,నూకల సూర్య ప్రకాష్, రాచకొండ దశరథ రామయ్య, వివి వామన రావు తదితరులు మాట్లాడుతూ,

జీవీఎంసీ 120 వార్డులలో మేయర్ స్థానానికి పోటీ చేసేందుకు ప్రధాన పార్టీలకు సమర్థురాలైన ఒక్క ఓసి మహిళా దొరకలేదా అని ప్రశ్నించారు . ఓటు బ్యాంకు రాజకీయాలు, మారుతున్న సామాజిక సమీకరణాల వల్ల తాము రాజకీయంగా వెనుకబడిపోతున్నామన్నారు. ముఖ్యంగా విశాఖలో దాదాపు మూడులక్షలకు పైగా ఓట్లు కలిగిన బ్రాహ్మణ సామజిక వర్గానికి తగిన ప్రాధాన్యం కల్పించకపోవడం శోచనీయమన్నారు.జీవీఎంసీ మేయర్ పదవిని ఓసి మహిళకు కేటాయిస్తూ ప్రకటన వెలువడిన వెంటనే తాము ఎంతో సంతోషించామని,కానీ ప్రధాన రాజకీయ పార్టీలు బీసీ మహిళలను మేయర్ పదవికి ఎంపిక చెయ్యడానికి ప్రయత్నించడం ఎంతవరకు సబబో ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు ఆలోచించుకోవాలన్నారు.ఓసి లలో క్షత్రియ,కాపు,వైశ్య,కమ్మ తదితర సామజిక వర్గాలలో మేయర్ పదవికి సమర్థురాలైన మహిళా అభ్యర్థిని ఎంపిక చెయ్యకపోవడం తమను బాధిస్తోందన్నారు. జనరల్ మహిళా స్థానంలో ఓసీ మహిళలే కాకుండా ఓపెన్ కాంపిటీషన్లో ఏ సామాజిక వర్గానికి (బీసీ, ఎస్సీ, ఎస్టీ) చెందిన మహిళలైనా పోటీ చేయడానికి చట్టబద్ధంగా అర్హులేనని,వారికి తాము వ్యతిరేకం కాదన్నారు. ఇప్పటికైనా ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్ధనను పరిగణలోకి తీసుకుని బ్రాహ్మణ సామజిక వర్గానికి తగిన ప్రాధాన్యం కల్పించాలని,అదే సమయంలో మేయర్ పదవికి ఓసి మహిళలను ఎంపిక చెయ్యాలని కోరారు.జీవీఎంసీ పరిధిలో బ్రాహ్మణ సామాజిక వర్గం సుమారు మూడులక్షల పైగా ఓటర్లు ఉన్న కారణంగా 120 వార్డులలో జనాభా ప్రాతిపదికన బ్రాహ్మణ సామాజిక వర్గానికి కనీసం 10 వార్డులను జనరల్ సీట్లలో అన్ని రాజకీయ పార్టీలు కేటాయించాలని ,లేనిపక్షంలో మా నిరసనను వినూత్న పద్ధతిలో తెలియజేసి అన్ని రాజకీయ పక్షాలకు కనువిప్పు కలిగిస్తామని, అవకాశమున్న ప్రతీచోటా తమ అభ్యర్థిని పోటీలో నిలబెడతామని సున్నితంగా హెచ్చరించారు.మీడియా సమావేశంలో చెరువు రామకోటయ్య, గంటి రవి కుమార్, అయ్యగారి కామేష్, వివి గిరి, వేదుల హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.
0 Comments