శస్త్రచికిత్సలో ప్రాణరక్షణ కవచం.. అనస్థీషియా!.......ప్రపంచ అనస్థీషియా దినోత్సవం.....*


విశాఖపట్నం , అక్టోబర్ 16:* శస్త్రచికిత్స విజయవంతం కావడంలో సర్జన్ నైపుణ్యంతో పాటు అనస్థీషియాలజిస్ట్ పాత్ర కూడా అత్యంత కీలకం అని *మెడికవర్ హాస్పిటల్స్  డైరెక్టర్  అఫ్  అనస్తీషియాలజీ   Dr డొంకాడ రాజశేఖర్* గారు తెలియజేసారు. నొప్పిని నియంత్రించడం నుంచి శస్త్రచికిత్స సమయంలో రోగి ప్రాణాధార వ్యవస్థలను నిరంతరం పర్యవేక్షించడం వరకు అనస్థీషియా వైద్యులు కీలక బాధ్యతలు నిర్వహిస్తారు. ఆధునిక వైద్యరంగంలో సురక్షితమైన శస్త్రచికిత్సలకు అనస్థీషియా ఒక ముఖ్యమైన ఆధారం.

ప్రతి సంవత్సరం అక్టోబర్ 16న ప్రపంచ అనస్థీషియా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. 1846లో తొలిసారిగా బహిరంగంగా ఈథర్ అనస్థీషియాను ఉపయోగించి శస్త్రచికిత్స నిర్వహించిన చారిత్రక సంఘటనకు గుర్తుగా ఈ రోజును జరుపుకుంటారు. అప్పటి నుంచి అనస్థీషియా వైద్యరంగంలో గణనీయమైన పురోగతి సాధించి, క్లిష్టమైన శస్త్రచికిత్సలను నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తోంది.

అనస్థీషియాలజిస్ట్ బాధ్యత శస్త్రచికిత్సకు ముందే ప్రారంభమవుతుంది. రోగి ఆరోగ్య పరిస్థితి, గత వైద్య చరిత్ర, అలర్జీలు, వాడుతున్న మందులను పరిశీలించి తగిన అనస్థీషియా విధానాన్ని నిర్ణయిస్తారు. శస్త్రచికిత్స సమయంలో గుండె స్పందన, రక్తపోటు, శ్వాస, రక్తంలో ఆక్సిజన్ స్థాయులను నిరంతరం పర్యవేక్షిస్తారు. శస్త్రచికిత్స అనంతరం నొప్పిని నియంత్రించడం, రోగి సురక్షితంగా కోలుకునేలా చూడటం కూడా వారి బాధ్యతల్లో భాగమే.

గుండె, మెదడు శస్త్రచికిత్సలు, అత్యవసర ప్రమాద చికిత్సలు, క్లిష్టమైన ప్రసవాల్లో అనస్థీషియాలజిస్టుల పాత్ర మరింత కీలకంగా ఉంటుంది. ఆధునిక పరికరాలు, మెరుగైన పర్యవేక్షణ విధానాలు, వైద్య నైపుణ్యం ద్వారా అనస్థీషియా సంబంధిత ప్రమాదాలను తగ్గించవచ్చు. అయితే రోగి ఆరోగ్య పరిస్థితిని బట్టి ప్రమాదాలు మారవచ్చు.

శస్త్రచికిత్సకు ముందు రోగులు తమ ఆరోగ్య సమస్యలు, అలర్జీలు, వాడుతున్న మందుల వివరాలను వైద్యులకు తెలియజేయాలి. అనస్థీషియాపై ఉన్న భయాలు, సందేహాలను వైద్యులతో చర్చించాలి.

ప్రపంచ అనస్థీషియా దినోత్సవం సందర్భంగా శస్త్రచికిత్సల విజయంతో పాటు రోగుల ప్రాణరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న అనస్థీషియాలజిస్టుల సేవలను గుర్తించడం, సురక్షితమైన వైద్య సంరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచడం అవసరం అని అయన తెలియజేసారు.

Post a Comment

0 Comments