విశాఖపట్నం కురుపాం మార్కెట్ ప్రాంతంలో కొలువైయున్న పురాతన కన్యకాపరమేశ్వరి ఆలయంలో శరన్నవరాత్రులు ఘనంగా జరుగుచున్నవి. ఆరవ రోజైన శుక్రవారం నాడు ఆలయంలో తెల్లవారుఝామున మూలవిరాట్ కు పాలు, పెరుగు, గంధం, పసుపు, కుంకుమ, సుగంధ ద్రవ్యములు మరియు వివిధ రకాల పండ్ల రసములతో కలిసి మొత్తం108 ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేకం నిర్వహించిన అనంతరం అమ్మవారిని వివిధ పరిమళభరితమైన పుష్పాలతో మరియు 108 సువర్ణ పుష్పాలతో సుందరంగా అలంకరించి భక్తులకు దర్శనం కలిగించారు. ఆలయ మండపంలో ఏర్పాటు చేసిన వాసవి కనకదుర్గాదేవికి ఉదయం భక్తులచే స్వయంగా కలశ కుంకుమ పూజలు జరిపించారు. అనంతరం దేవస్థాన ఆస్థాన మండపంలో 1000 మంది విద్యార్థులచే నాలుగు విడతలుగా సరస్వతి పూజలు దేవస్థానం ప్రధాన అర్చకులు ఆర్.బి.బి. కుమార్ శర్మ గారి నేతృత్వంలో జరిపించారు. పూజా సమయం లో పిల్లలకు సరస్వతీదేవి అనుగ్రహం ప్రాప్తించేందుకు సరస్వతీ శ్లోకం పిల్లలచే పఠింపజేశారు. ఈ సరస్వతీ పూజలలో ఎల్కేజీ నుండి పీజీ వరకు చదువుతున్న విద్యార్థులు పాల్గొనడం విశేషం. సామూహిక సరస్వతి పూజలలో పాల్గొన్న విద్యార్థులందరికీ పూజకు కావలసిన సామాగ్రి, ప్రసాదములు తీపి బూంది, రవ్వలడ్డు, అటుకులు మరియు విద్యార్థులకు అవసరమైన పుస్తకం, పెన్సిల్, స్కేలు, షార్పనెర్ వంటి వస్తువులు దాతల ఆర్ధిక సహాయంతో దేవస్థానం వారు సమకూర్చినట్లు ఉత్సవ కమిటీ చైర్మన్లు శ్రీయుతులు వై.వి.వి.విశ్వనాథ్, పి.ఎస్.ఆర్. కిషోర్, ఉసిరికల రామకృష్ణ తెలిపారు. దేవస్థాన మహిళా విభాగం సభ్యులు పాల్గొని విద్యార్ధులకు, తల్లిదండ్రులకు, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నారని తెలిపారు. దేవాలయానికి సంబంధించిన ముఖద్వారం, ధ్వజస్తంభం, నవగ్రహ మండపం పూర్తిగా కోల్పోయిన సందర్భంలో దేవాలయం పునర్నిర్మించవలసి ఉంటుందని, ఆ కారణంగా బాలాలయం క్రొత్తగా నిర్మించి యదావిధంగా అమ్మవారికి పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి.
ప్రత్యక్షంగా భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజాదికాలతో పాటు పరోక్ష పద్ధతిలో తమ గోత్రనామాలు ముందుగా నమోదు చేసుకున్న భక్తుల పేరిట పూజాదికాలు నిర్వహించినట్లు దేవాలయ అధ్యక్ష కార్యదర్శులు శ్రీయుతులు ఆరిశెట్టి దినకర్, పెనుగొండ కామరాజు, కోశాధికారి డి.వి.బాలాజి కుమార్ తెలిపారు.
అధిక సంఖ్యలో తరలి వచ్చిన భక్తులకు అసౌకర్యం కలుగకుండా దేవస్థాన సంఘ కోశాధికారి శ్రీ దోమ వెంకట బాలాజీ కుమార్ మరియు ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు.
*****



0 Comments