మాన‌సిక ఆరోగ్యానికి ప్రాధాన్య‌త ఇవ్వాలి - ప్రాధ‌మిక ద‌శ‌లో చికిత్స తీసుకోవ‌డం మంచిది - విద్యార్థుల‌కు మాన‌సిక ఆరోగ్యంపై అవ‌గాహ‌న‌

 


ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం, అక్టోబ‌ర్ 10 :జీవితంలో ఎదురయ్యే ఒత్తిళ్లను తట్టుకోగలగడం, మ‌న‌ సామర్థ్యాలను, పరిమితులను గుర్తించడ ఉత్పాదకతతో పనిచేయడం, వ్య‌క్తిగ‌త‌ అభివృద్ధికి, కుటుంబానికి, సమాజానికి త‌మ‌వంతు సహకారాన్ని అందించడమే మాన‌సిక ఆరోగ్యాన్ని క‌లిగి ఉండ‌ట‌మ‌ని ఆంధ్ర‌మెడిక‌ల్ క‌ళాశాల సైకియార్టీ విభాగం ప్రొఫెస‌ర్ డాక్ట‌ర్ జి.సురేష్ కుమార్ అన్నారు. మాన‌సిక ఆరోగ్య వారోత్స‌వాల‌లో భాగంగా విశాఖ జిల్లా సైకియార్టీసొసైటీ, ప్ర‌భుత్వ మాన‌సిక చికిత్సాల‌యం, ఏయూ సంయుక్తంగా నిర్వ‌హించిన విద్యార్థుల అవ‌గాహ‌న స‌దస్సులో ఆయ‌న కీల‌కోప‌న్యాసం అందించారు. యూత్ మెంట‌ల్ హెల్త్ ఇష్యూస్‌-మేనేజ్‌మెంట్ అనే అంశంపై ఈ స‌ద‌స్సును ఏయూ ఇంజ‌నీరింగ్ క‌ళాశాల గౌత‌మ బుద్ద ఆడిటోరియంలో నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా డాక్ట‌ర్ జి.సురేష్ కుమార్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఎనిమిది మందిలో ఒకరు మానసిక సమస్యలతో జీవిస్తున్నారని గ‌ణాంకాలు వెల్ల‌డిస్తున్నాయ‌న్నారు. ప్రజలకు, సమాజానికి అర్థమయ్యేలా అవగాహన పెంచడంపై దృష్టి పెట్టాలని, మానసిక ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు చేప‌ట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌ని సూచించారు.

అధ్యయనాల ప్రకారం మాన‌సిక ఆరోగ్యం దెబ్బ‌తిన‌డం వ‌ల‌న వ్య‌క్తి  జీవితకాలంలో 10 నుండి 20 సంవత్సరాల ఉత్పాదకత దెబ్బతింటుందని,  ఆందోళన (Anxiety), తీవ్ర నిరాశ (Depression) వంటి సమస్యల వల్ల అనేకమంది ఉత్పాదకతను కోల్పోతున్నారన్నారు.  చాలా మంది ఖాళీగా కూర్చుని, ఉద్యోగం లేక, కుటుంబానికి భారం అవుతున్నారన్నారు.  మన ఆరోగ్య బడ్జెట్‌లో కేవలం 2 శాతం మాత్రమే మానసిక ఆరోగ్యానికి కేటాయిస్తున్నారన్నారు.

మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసే దాదాపు 300 ప్రధాన మానసిక రుగ్మతలు ఉన్నాయని, అధికంగా కనిపించే 13 ముఖ్యమైన సమస్యలను వివ‌రించారు. ముఖ్యంగా డిజిటల్ అడిక్షన్ (డిజిటల్ వ్యసనం), మాదకద్రవ్యాల వినియోగం, శారీరక ఒత్తిడి, డిప్ర‌ష‌న్‌ వంటివి భారతదేశంలో ఎక్కువగా కనిపిస్తున్నాయన్నారు.

ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజ‌శేఖ‌ర్ మాట్లాడుతూ విద్యార్థులు ర్యాగింగ్‌కి, మ‌త్తు మ‌దార్ధాలు-వ్య‌స‌నాల‌కు దూరంగా ఉంటూ నిరంత‌రం మాన‌సిక ఆరోగ్యాన్ని మెరుగు ప‌ర‌చుకోవాల‌న్నారు. విద్యార్తులు త‌మ ఆస‌క్తికి అనుగుణంగా ఎద‌గాల‌న్నారు. విద్య‌లో ప్ర‌గ‌తి చూప‌డంతో పాటు మాన‌సిక ఆరోగ్య సంర‌క్ష‌ణ‌కు త‌గిన ప్రాధాన్య‌త ఇవ్వాల‌న్నారు. అభ్య‌స‌నాన్ని ఆస్వాదించాల‌ని సూచించారు. కాలాన్ని స‌ద్వినియోగం చేసుకుంటూ, మంచి అల‌వాట్లు క‌లిగి ఉండాల‌న్నారు. విద్యార్థుల మాన‌సిక ఆరోగ్యానికి ఉప‌క‌రించే విధంగా నిర్వ‌హిస్తున్న ప‌లు కార్య‌క్ర‌మాల‌ను, తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను వివ‌రించారు.

ఇంజ‌నీరింగ్ క‌ళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య కె.వెంక‌ట‌ సుబ్బ‌య్య మాట్లాడుతూ శారీరక‌, మాన‌సిక ఆరోగ్యం బాగుంటేనే స‌మ‌గ్ర ప్ర‌గ‌తి సాధ్య‌ప‌డుతుంద‌న్నారు. విద్యార్థులు త‌మ స‌మ‌స్య‌ల‌ను ఆచార్యుల‌తో పంచుకోవాల‌న్నారు. త‌మ స‌మ‌స్య‌ల‌ను కుటుంబ స‌భ్యులు, స్నేహితుల‌తో పంచుకోవ‌డం అల‌వాటు చేసుకోవాల‌ని సూచించారు.

ప్ర‌భుత్వ మాన‌సిక ఆసుప‌త్రి ఇంచార్జి సూప‌రిండెంట్ డాక్ట‌ర్ హ‌రి కృష్ణ మాట్లాడుతూ మాన‌సిక స‌మ‌స్య‌లను గుర్గించి ప్రారంభ ద‌శ‌లో చికిత్స‌కు రావాల‌న్నారు. వ్యాధి తీవ్ర‌త పెరిగితే నివార‌ణ‌కు అధిక స‌మ‌యం ప‌డుతుంద‌న్నారు. ప్ర‌భుత్వ మాన‌సిక ఆసుప‌త్రి ఉభ‌య తెలుగు రాష్ట్రాల‌తో పాటు, త‌మిళ‌నాడు, ఒరిస్సా, ఉత్త‌ర భార‌త దేశ వాసుల‌కు సైతం సేవ‌లు అందిస్తోంద‌న్నారు. ఆసుప‌త్రి విభాగాలు, సేవ‌లు త‌దిత‌ర వివ‌రాలు తెలియ‌జేశారు.

విశాఖ సైక్రియార్టిక్ సొసైటీ అద్య‌క్షురాలు డాక్ట‌ర్ బి.జె.పి మ‌ల్లిక మాట్లాడుతూ దేశ భ‌విష్య‌త్తు యువ‌త‌పైనే ఆధార‌ప‌డి ఉంద‌న్నారు. యువ‌త ఎదుర్కొనే ప‌లు స‌మ‌స్య‌లు, వాటిని అధిగ‌మించి ముందుకు సాగే విధానం త‌దిత‌ర అంశాల‌ను వివ‌రించారు.

విద్యార్థి వ్య‌వ‌హారాల డీన్ ఆచార్య ఎస్‌.హ‌ర‌నాథ్ మాట్లాడుతూ విద్య‌ను అందించ‌డంతో పాటు, విద్యార్థులు స‌మ‌గ్ర వికాసానికి దోహ‌ద‌ప‌డే విధంగా వ‌ర్సిటీ ప‌నిచేస్తోంద‌న్నారు. స్టూడెంట్ వెల్‌బీయింగ్ క‌మిటీలు ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేసామ‌న్నారు. విద్యార్థులు త‌మ స‌మ‌స్య‌ల‌ను స్వేచ్చ‌గా ఆచార్యుల‌తో పంచుకోవాల‌ని, త‌గిన ప‌రిష్క‌రాల‌ను చూపుతామ‌న్నారు.

కార్య‌క్ర‌మ‌లో ఆచార్య ఏ.ఆర్‌. నాగ హ‌నుమాన్‌, ఆచార్య ఏ.మేరీ సౌజ‌న్య‌, ఆచార్యులు, విద్యార్థులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments