శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం, సింహాచలం * ​సింహాచల దేవస్థానానికి దక్కిన ప్రతిష్టాత్మక గౌరవాలు: రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో అవార్డుల పంట * ​ముఖ్యమంత్రి చేతుల మీదుగా ‘స్వచ్ఛాంధ్ర’ అవార్డు అందుకున్న ఈవో జల్లేపల్లి వెంకటరావు * ​విశాఖ కలెక్టర్ చేతుల మీదుగా జిల్లా స్థాయి అవార్డు స్వీకరించిన ఏఈవో పిల్లా శ్రీనివాసరావు, డీఈ రామరాజు * ​స్వచ్ఛత, భక్తుల సేవలలో సరికొత్త రికార్డు.. ఆలయ సిబ్బంది, అర్చకుల హర్షాతిరేకాలు

 

సింహాచలం, అక్టోబర్ 2:ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం స్వచ్ఛత, పరిశుభ్రతలో సరికొత్త రికార్డు సృష్టించింది. మెరుగైన పాలన, పారిశుధ్య నిర్వహణ దిశగా ఆలయం సాధించిన ప్రగతికి గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే ‘స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర’ అవార్డును సింహాచల దేవస్థానం కైవసం చేసుకుంది. ఈ మేరకు దేవస్థాన కార్యనిర్వహణ అధికారి  శ్రీ జల్లేపల్లి వెంకటరావు శుక్రవారం గౌరవ ముఖ్యమంత్రివర్యుల చేతుల మీదుగా ఈ అవార్డును ఘనంగా అందుకున్నారు.

​అలాగే జిల్లా స్థాయిలోనూ సింహాచల దేవస్థానానికి విశేష గుర్తింపు లభించింది. పరిశుభ్రత, ఇంజనీరింగ్ పనుల సమన్వయంలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను విశాఖపట్నం జిల్లా కలెక్టర్ శ్రీ అభిషిక్త్ కిషోర్, IAS చేతుల మీదుగా దేవస్థాన సహాయ కార్యనిర్వహణ అధికారి శ్రీ పిల్లా శ్రీనివాసరావు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (డీఈఇంచార్జీ) శ్రీ రామరాజు జిల్లా స్థాయి ‘స్వచ్ఛాంధ్ర’ అవార్డును అందుకున్నారు.

గత ఏడాది ఫిబ్రవరి 8న సింహాచల దేవస్థాన ఈవోగా బాధ్యతలు చేపట్టిన జల్లేపల్లి వెంకటరావు, అనతికాలంలోనే తనదైన పరిపాలనా దక్షతతో ప్రత్యేక ముద్ర వేశారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే వచ్చిన స్వామివారి వార్షిక చందనోత్సవం, అశేష భక్తజనవాహిని నడుమ సాగిన గిరి ప్రదక్షిణ వంటి అత్యంత కీలకమైన, ప్రతిష్టాత్మక ఉత్సవాలను అత్యంత చాకచక్యంగా, విజయవంతంగా నిర్వహించారు. 

భక్తులకు కనీస అసౌకర్యం కలగకుండా తాగునీరు, అన్నప్రసాదం, క్యూలైన్ల నిర్వహణ, వైద్య సదుపాయాలను స్వయంగా పర్యవేక్షించి భక్తుల మన్ననలు పొందారు. ఆయన విశిష్ట సేవలను గుర్తించి, గత ఆగస్టు 15న జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఆయన విశిష్ట సేవా పురస్కారాన్ని కూడా అందుకున్నారు.

​గౌరవ ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర’ పిలుపును స్ఫూర్తిగా తీసుకున్న ఈవో, ఆలయ పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇంజనీరింగ్, శానిటరీ విభాగాల అధికారులను, సిబ్బందిని నిరంతరం సమన్వయపరుస్తూ ముందుకు నడిపించారు. నిరంతర పారిశుధ్య పర్యవేక్షణ, ఆధునిక పద్ధతిలో వ్యర్థాల నిర్వహణ, కొండపై ఆహ్లాదకరమైన, పరిశుభ్రమైన వాతావరణాన్ని తీర్చిదిద్దడంలో యాజమాన్యం, అధికారులు అంకితభావంతో కృషి చేశారు.

​ఒకేసారి రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈవో జల్లేపల్లి వెంకటరావు, జిల్లా స్థాయిలో కలెక్టర్ చేతుల మీదుగా ఏఈవో పిల్ల శ్రీనివాసరావు, డీఈ రామరాజు ఈ ప్రతిష్టాత్మక అవార్డులను స్వీకరించడంపై ఆలయ ఉద్యోగులు, , సిబ్బంది తీవ్ర హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. 

దేవస్థానానికి దక్కిన ఈ గౌరవం సమష్టి కృషి ఫలితమని పేర్కొంటూ అధికారులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Post a Comment

0 Comments