స్పెషల్ టెట్ పరీక్షల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి* *జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి*

 


విశాఖపట్నంఆంధ్రప్రదేశ్ స్పెషల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పరీక్షలను జిల్లాలో ప్రశాంతంగా, పారదర్శకంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పటిష్టంగా చేపట్టాలని జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం తన ఛాంబర్లో ఛాంబర్‌లో స్పెషల్ టెట్ నిర్వహణకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. 

అక్టోబర్ 11 నుంచి 15వ తేదీ వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానంలో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలో 6 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, మొత్తం 5,624 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారని వెల్లడించారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖను ఆదేశించారు. కేంద్రాల పరిసరాల్లో తగినంత మంది సిబ్బందిని నియమించి, బి.ఎన్.ఎస్. సెక్షన్ 163 అమలుతో పాటు శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.

అభ్యర్థులకు రవాణాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు, పరీక్ష అనంతరం తిరిగి వెళ్లేందుకు అవసరమైన మేరకు బస్సు సర్వీసులను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. పరీక్షలు జరిగే అన్ని రోజుల్లో పరీక్షా సమయాల్లో అంతరాయం లేని విద్యుత్ సరఫరా ఉండేలా ముందస్తు చర్యలు చేపట్టాలని విద్యుత్ శాఖ అధికారులకు చెప్పారు. మెడికల్ కిట్లను అందుబాటులో ఉంచాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. అభ్యర్థులకు తాగునీరు, పారిశుధ్య సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని జీవీఎంసీ అధికారులకు సూచించారు. అభ్యర్థులకు అవసరమైన సమాచారం, మార్గదర్శకత్వం అందించేందుకు జిల్లా స్థాయిలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు జేసీ తెలిపారు. 


సమావేశంలో డీఈఓ ప్రేమ కుమార్, ఆర్‌ఐఓ మురళీధర్, ఆర్టీసీ ఆర్‌.ఎం. అప్పలనాయుడు, వైద్య ఆరోగ్య , విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.


Post a Comment

0 Comments