విశాఖపట్నం, సెప్టెంబర్ 21:పిల్లల్లో నులిపురుగుల నిర్మూలన లక్ష్యంగా ఈ నెల 25వ తేదీన నిర్వహించనున్న డీ-వార్మింగ్ డే కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ జి.విద్యదరి అధికారులను ఆదేశించారు. పిల్లలకు అవసరమైన ఆల్బెండజోల్ మాత్రలను అందుబాటులో ఉంచి, అర్హులైన ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా పంపిణీ చేయాలని సూచించారు.
జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్న డీ-వార్మింగ్ డే కార్యాచరణపై దిశానిర్దేశం చేసేందుకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం జిల్లా జాయింట్ కలెక్టర్ గారు వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమ అమలుకు సంబంధించి పలు అంశాలపై అధికారులకు మార్గనిర్దేశం చేశారు.
జిల్లాలోని 5,74,496 మంది పిల్లలు వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లోని నమోదుకాగా,1 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలు, విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను ఉచితంగా అందించాలని జాయింట్ కలెక్టర్ సూచించారు. 1 నుంచి 2 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు అర మాత్రను నీటిలో కరిగించి ఇవ్వాలని, 2 నుంచి 3 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు పూర్తి మాత్రను నీటిలో కరిగించి ఇవ్వాలని సూచించారు. 3 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల వారికి పూర్తి మాత్రను చప్పరించేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
మధ్యాహ్న భోజనం చేసిన అరగంట తర్వాత ఆల్బెండజోల్ మాత్రలను అందించాలని, కార్యక్రమంలో ఎటువంటి లోపాలు లేకుండా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా అర్హులైన ప్రతి చిన్నారికి మాత్ర అందేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
మాత్ర వేసుకోవడం వల్ల ఎటువంటి దుష్పరిణామాలు ఉండవని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి పి . జగదీష్వర రావు గారు తెలిపారు. ఏ కారణం చేతనైనా 25.09.2026 న మాత్ర వేసుకోలేకపోయిన పిల్లలకు ,మాపప్ రౌండ్ తేది:05.10.2026 న నిర్వహించే కార్యక్రమంలో తప్పనిసరిగా ఆల్బెండజోల్ మాత్రను అందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశించారు.
విద్య, వైద్య, సంక్షేమ శాఖలతో పాటు ఇతర సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేసి డీ-వార్మింగ్ డే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ సూచించారు. అనంతరం నులిపురుగుల నిర్మూలన దినోత్సవానికి సంబంధించిన పోస్టర్‌ను జిల్లా జాయింట్ కలెక్టర్, ఇతర అధికారులు ఆవిష్కరించారు.
సమావేశంలో D.R.O . ఎం .వి.నాయుడు గారు,కేజీహెచ్ సూపరింటెండెంట్ డా. ఐ .వాణి, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి పి. జగదీశ్వరరావు, అదనపు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డా. ఆర్.రమేష్ ,D.C.H.S డా.నరేంద్ర సింగ్ ,ప్రోగ్రాం ఆఫీసర్ డా. బి.హారికతో పాటు వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
పి.జగదీశ్వర రావు
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారీ

0 Comments