సింహాచలం, సెప్టెంబర్ 21, 2026:ప్రపంచ ప్రసిద్ధ సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానంలో పవిత్రోత్సవాలు సోమవారం వైభవంగా, ఆధ్యాత్మిక శోభతో ప్రారంభమయ్యాయి. ఆలయ కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకట్రావు ఆధ్వర్యంలో దేవస్థానం సంప్రదాయాలు, ఆగమ శాస్త్ర పద్ధతులకు అనుగుణంగా ఉత్సవ కార్యక్రమాలను నిర్వహించారు.పవిత్రోత్సవాల తొలిరోజు అంకురార్పణ కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ స్థానాచార్యులు డాక్టర్ టి.పి. రాజగోపాల్, ప్రధానార్చకులు శ్రీనివాసాచార్యులు, సీతారామాచార్యులు, అర్చక స్వాములు, వేద పండితుల ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ పవిత్ర ప్రతిష్ఠ, ఆవాహన తదితర వైదిక కార్యక్రమాలు నిర్వహించారు.
పుట్టబంగారం సేకరణతో అంకురార్పణకు శ్రీకారం
పవిత్రోత్సవాల్లో భాగంగా ఆలయ ప్రధాన అర్చకులు **పవిత్ర మృత్తిక (పుట్టబంగారం)**ను వెండి పళ్లెంలో ఉంచి శిరస్సున ధరించారు. మంగళవాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షణ చేసి యాగశాలకు చేరుకున్నారు. అనంతరం మట్టి పాలికల్లో పవిత్ర మృత్తికను వేసి నవధాన్యాలను విత్తడంతో అంకురార్పణ ప్రక్రియను పూర్తి చేశారు.
ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. భక్తులు “శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామివారి కృపాకటాక్షం కలగాలి” అంటూ భక్తిశ్రద్ధలతో కార్యక్రమాల్లో పాల్గొన్నారు.ఈవో ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు
పవిత్రోత్సవాల సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకట్రావు ప్రత్యేక దృష్టి సారించారు. ఆయన ఆదేశాల మేరకు దేవస్థాన సిబ్బంది అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు. సహాయ కార్యనిర్వహణాధికారి పిల్లా శ్రీనివాసరావు, పర్యవేక్షణ అధికారి కరోతి సూర్యనారాయణ కార్యక్రమాల నిర్వహణను పర్యవేక్షించారు.
ఈ పవిత్ర కార్యక్రమంలో ఈవో జల్లేపల్లి వెంకట్రావు దంపతులు పాల్గొని స్వామివారిని సేవించి ఆశీస్సులు పొందారు.
ఆలయంలో నిత్యం నిర్వహించే పూజలు, కైంకర్యాలు, ఉత్సవాల సమయంలో తెలియక సంభవించే దోషాలను పరిహరించి, ఆలయ పవిత్రతను పునరుద్ధరించడమే పవిత్రోత్సవాల ప్రధాన ఉద్దేశమని ఆలయ స్థానాచార్యులు డాక్టర్ టి.పి. రాజగోపాల్ తెలిపారు. ఈ వైదిక కార్యక్రమాలు ఆలయ సంప్రదాయాలు, ఆగమ విధానాలకు ప్రతీకగా నిలుస్తాయని, దేవస్థానానికి, భక్తులకు శుభఫలితాలు చేకూరాలని ఆకాంక్షించారు.
పవిత్రోత్సవాలు ఈ నెల 25వ తేదీ వరకు కొనసాగనున్న నేపథ్యంలో భక్తులు భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని పవిత్రోత్సవాల ఆశీస్సులు పొందాలని దేవస్థానం అధికారులు కోరారు.ఈ పవిత్ర ఉత్సవాల లో భక్తులు దాతలు గంట్ల శ్రీనుబాబు, కేతిరెడ్డి సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు




0 Comments