అమరావతి, సెప్టెంబర్ 22:* విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి భావితరాలను తీర్చిదిద్దే ఉపాధ్యాయులపై వైసీపీ శ్రేణులు దాడులకు పాల్పడటం అత్యంత దుర్మార్గమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మండిపడ్డారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై ఆరోపణలు చేస్తూ విజయవాడలోని శాప్ కార్యాలయం వద్ద వైసీపీ చేపట్టిన ఆందోళన సందర్భంగా చోటుచేసుకున్న ఉద్రిక్తతపై ఆయన తీవ్రంగా స్పందించారు.
ఉపాధ్యాయులు అంటే గౌరవం లేని గొడ్డలి పార్టీ నేతలు.. ఉద్యోగాలు సాధించిన టీచర్లను అవమానించడమే కాకుండా దాడులకు దిగడం వారి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని పల్లా ధ్వజమెత్తారు. క్రీడల్లో ప్రతిభ చాటి, పతకాలు సాధించి, కష్టపడి చదివి డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందిన వారిపై అనుమానాలు రేకెత్తించడం సరికాదన్నారు. తమ వద్ద ఉన్న ధ్రువపత్రాలు, పతకాలు నిజమైనవేనని స్పోర్ట్స్ కోటా ఉపాధ్యాయులు వెల్లడించిన నేపథ్యంలోనూ రాజకీయ రాద్ధాంతం చేయడం దేనికని ప్రశ్నించారు.
*గురువులను గౌరవించడం మన సంస్కారం*
ఉపాధ్యాయ వృత్తి సాధారణ ఉద్యోగం కాదని పల్లా అన్నారు. ఒక ఉపాధ్యాయుడి వెనుక ఎన్నో సంవత్సరాల కఠోర శ్రమ, చదువు, పోటీ, కుటుంబం ఆశలు ఉంటాయని పేర్కొన్నారు. విద్యార్థులకు పాఠాలు చెప్పడమే కాకుండా వారి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే మార్గదర్శకులుగా గురువులు నిలుస్తారని చెప్పారు. అలాంటి ఉపాధ్యాయులను రోడ్లపైకి లాగి అవమానించడం, దాడులకు పాల్పడటం వైసీపీ రాజకీయ సంస్కృతికి అద్దం పడుతోందని విమర్శించారు.
*డీఎస్సీపై బురదజల్లడమే జగన్ రెడ్డి లక్ష్యం*
డీఎస్సీ నియామకాలపై వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఇప్పటికే రాజకీయ రాద్ధాంతంగా మారాయని పల్లా అన్నారు. జగన్ రెడ్డికి విద్యారంగంపై, ఉపాధ్యాయులపై గౌరవం లేదని విమర్శించారు. కరోనా సమయంలో ఉపాధ్యాయులను మద్యం దుకాణాల వద్ద కాపలా పెట్టిన తీరు వారి పట్ల గత ప్రభుత్వానికి ఉన్న గౌరవాన్ని తెలియజేస్తుందని ఎద్దేవా చేశారు.
డీఎస్సీ ద్వారా 16 వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసి యువతకు ఉద్యోగ భరోసా కల్పించిన ఘనత చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వానిదని పల్లా తెలిపారు. డీఎస్సీపై ఆరోపణలు ఉంటే ఆధారాలతో సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని, రాజకీయ ముసుగులో ఉపాధ్యాయులను అవమానించడం తగదని హితవు పలికారు.
*చంద్రబాబు నాయకత్వంలో విద్యారంగానికి కొత్త దిశ*
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని పల్లా అన్నారు. మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో విద్యారంగంలో పలు సంస్కరణలు చేపడుతూ, రాజకీయ జోక్యానికి తావులేకుండా పాఠశాలలను అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు, ఉపాధ్యాయుల సంక్షేమం, యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
గురువులపై దాడి చేసిన వారిని చట్ట ప్రకారం గుర్తించి చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలను ఉపేక్షించరాదని పల్లా స్పష్టం చేశారు. ఉపాధ్యాయులను కించపరిచే రాజకీయాలు మానుకోవాలని జగన్ రెడ్డికి హితవు పలికారు. గొడ్డలి పార్టీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. కూటమి ప్రభుత్వం విద్య, ఉద్యోగ రంగాల్లో చేపడుతున్న సంస్కరణలను, యువతకు కల్పిస్తున్న అవకాశాలను అడ్డుకోలేదని పల్లా తేల్చిచెప్పారు.

0 Comments