.
విశాఖపట్నం, అక్టోబర్ 24: జీవీఎంసీ రెండవ సాధారణ ఎన్నికల నేపథ్యంలో అగనంపూడి జోన్ పరిధిలో ఎన్నికల నిర్వహణకు చేపట్టిన ఏర్పాట్లను జీవీఎంసీ కమిషనర్, అదనపు ఎన్నికల అధికారి కేతన్ గార్గ్ శనివారం అదనపు కమిషనర్ పి. నల్లనయ్యతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా 102వ వార్డు పరిధిలోని పినమడక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం, స్ట్రాంగ్ రూమ్లు, 6, 7వ పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను సమీక్షించారు.ఎన్నికల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కమిషనర్ సూచించారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు, స్ట్రాంగ్ రూమ్లు, పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల సిబ్బందికి అవసరమైన సౌకర్యాలు కల్పించడంతో పాటు, ఓటర్లు సులభంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు.పోలింగ్ కేంద్రాల్లో విద్యుత్, పారిశుద్ధ్యం, తాగునీరు, రూట్ మ్యాప్లు, సూచిక బోర్డుల ఏర్పాటు వంటి అంశాలను పరిశీలించారు. ఎన్నికల సామగ్రి పంపిణీ సజావుగా జరిగేలా ముందస్తు ప్రణాళిక రూపొందించాలని, స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ఠ భద్రత కల్పించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంచాలని, ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యానికి తావులేకుండా ప్రతి అధికారి తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
ఈ పర్యటనలో జోనల్ కమిషనర్ మనీషా త్రిపాఠి, రిటర్నింగ్ అధికారులు నాగేశ్వరరావు, మురళీధర్, పర్యవేక్షక ఇంజనీర్ పల్లంరాజు, సహాయక వైద్యాధికారి డాక్టర్ కిరణ్ కుమార్, కార్యనిర్వాహక ఇంజనీర్ శేఖర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నారాయణ, టౌన్ ప్లానింగ్ అధికారి ప్రసాద్, ఏపీడీ దుర్గాప్రసాద్, ఇతర ఎన్నికల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
మీడియా సెంటర్ జీవీఎంసీ ఎన్నికలు–2026
విశాఖపట్నం





0 Comments