భక్తి ప్రపత్తులతో అత్యంత వైభవంగా సాగిన భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి అవతార ప్రకటన ర్యాలీ


విశాఖపట్నం :విశాఖ సందేశం వార్తా వాహిని:ప్రతి సంవత్సరం అక్టోబర్ 20వ తేదీన భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి అవతార ప్రకటన దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా సుమారు 150కి పైగా దేశాల్లో శ్రీ సత్య సాయి భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు.

1940 అక్టోబర్ 20న భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారు తాను సనాతన ధర్మ పరిరక్షణ కోసం అవతరించానని, తాను సత్యసాయి అని ప్రపంచానికి మొట్టమొదటిసారిగా ప్రకటించిన పవిత్ర దినాన్ని పురస్కరించుకుని విశాఖపట్నంలో అవతార ప్రకటన ర్యాలీని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

శ్రీ సత్య సాయి సేవా సంస్థల సిటీ సమితి ఆధ్వర్యంలో పెదవాల్తేరు శ్రీ కరకచెట్టు పోలమాంబ అమ్మవారి ఆలయం వద్ద నుంచి మంగళవారం సాయంత్రం అవతార ప్రకటన ర్యాలీ ప్రారంభమైంది. జిల్లా అధ్యక్షులు శ్రీ పి.ఆర్.ఎస్.ఎన్. నాయుడు ర్యాలీని ప్రారంభించారు.

ఈ ర్యాలీలో సిటీ సేవా సమితికి చెందిన వివిధ శ్రీ సత్య సాయి భజన మండళ్లకు చెందిన వందలాది మంది భక్తులు, శ్రీ సత్య సాయి విద్యా విహార్ స్కూల్ ప్రిన్సిపాల్, పలువురు పదాధికారులు, పాఠశాల సిబ్బంది, శ్రీ సత్య సాయి పురుష, మహిళా, యువత విభాగాల సభ్యులు, వేదం గ్రూప్ సభ్యులు, బాలవికాస్ విద్యార్థులు, బాలవికాస్ గురువులు, ప్రముఖులు పాల్గొన్నారు.

వేద పఠనం, విశ్వశాంతిని ఆకాంక్షిస్తూ సర్వమత భజనలు, చిన్నారుల వేషధారణలు ర్యాలీకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పోలమాంబ అమ్మవారి ఆలయం వద్ద ప్రారంభమైన ర్యాలీ విశాఖ ఐ హాస్పిటల్, ఉషోదయ జంక్షన్ మీదుగా ఎం.వి.పి. సెక్టార్–8లోని శ్రీ సత్య సాయి విద్యా విహార్ స్కూల్ ప్రాంగణంలోని శ్రీ సత్య సాయి ప్రేమ సదన్ మందిరం వరకు సాగింది.

మందిరానికి చేరుకున్న అనంతరం ప్రత్యేక భజనలు, హారతులు నిర్వహించారు. అనంతరం భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి చిత్రపటాన్ని జ్యోతులతో, పుష్పాలతో, పూర్ణకుంభ స్వాగతంతో, వేద పారాయణాల మధ్య అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రేమ సదన్ మందిరంలోకి తీసుకువచ్చారు. **శ్రీ బి. సాయికుమార్** భగవాన్ వారి చిత్రపటాన్ని ప్రేమ సదన్ మందిరంలోని ఆలయంలోకి ఘనంగా స్వాగతించారు.

అవతార ప్రకటన ర్యాలీ విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా కూడా వివిధ శ్రీ సత్య సాయి సమితులు, భజన మండళ్ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడింది. సమితి గాయకులు ఆలపించిన ప్రత్యేక భజనలు కార్యక్రమానికి మరింత ఆధ్యాత్మిక శోభను చేకూర్చాయి.

ఈ సందర్భంగా శ్రీ దుర్గామాతకు వివిధ హారతులు సమర్పించడంతో పాటు, జూలా ఉత్సవం భక్తులు  భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి అవతార సందేశాన్ని స్మరించుకుంటూ, ప్రేమ, సేవ, సత్యం, ధర్మం, శాంతి, అహింస అనే విలువలను జీవితంలో ఆచరించాలనే సంకల్పంతో అవతార ప్రకటన దినోత్సవ వేడుకలు భక్తులలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపాయి.

Post a Comment

0 Comments