మద్దిలపాలెం జంక్షన్‌లో రూ.30 లక్షలతో ఆధునిక ప్రజా శౌచాలయం • BOT విధానంలో లోటస్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో నిర్మాణం. • ప్రజలు, ప్రయాణికుల సౌకర్యార్థం ఆధునిక వసతులతో ఏర్పాటు. • నిత్య పరిశుభ్రతతో నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి. – జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్

 


విశాఖపట్నం, అక్టోబర్ 7:నిత్యం రద్దీగా ఉండే మద్దిలపాలెం జంక్షన్‌లో ప్రజలు, ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ప్రజా శౌచాలయాన్ని నిత్య పరిశుభ్రతతో నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ సూచించారు.

బుధవారం జీవీఎంసీ తూర్పు జోన్ పరిధిలోని మద్దిలపాలెం జంక్షన్ వద్ద జీవీఎంసీ ఆధ్వర్యంలో లోటస్ ఇంటర్నేషనల్ సంస్థ సుమారు రూ.30 లక్షల వ్యయంతో BOT (Build, Operate and Transfer) విధానంలో నూతనంగా నిర్మించిన ప్రజా శౌచాలయాన్ని జీవీఎంసీ అదనపు కమిషనర్ పల్లి నల్లన్నయ్య, తూర్పు జోన్ జోనల్ కమిషనర్ కె. శివప్రసాద్, లోటస్ ఇంటర్నేషనల్ సంస్థ వ్యవస్థాపకులు డా. సరాజ్ కుమార్‌తో కలిసి కమిషనర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ప్రజా శౌచాలయంలో ఏర్పాటు చేసిన యూరినల్స్, టాయిలెట్లు, స్నానపు గదులు తదితర సదుపాయాలను కమిషనర్ పరిశీలించారు. మద్దిలపాలెం జంక్షన్‌కు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో బస్సులు నిరంతరం రాకపోకలు సాగిస్తుండటంతో ప్రయాణికులు, ప్రజలకు ఈ ప్రజా శౌచాలయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.

ప్రజా శౌచాలయంలోని యూరినల్స్, టాయిలెట్లు, స్నానపు గదులను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ నిత్య పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని లోటస్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రతినిధులకు కమిషనర్ సూచించారు. వినియోగ రుసుముల వివరాలను ప్రజలకు స్పష్టంగా కనిపించేలా శౌచాలయం వద్ద ప్రదర్శించాలని, నిర్వహణలో ఎటువంటి లోపాలకు తావులేకుండా, ప్రజలకు అసౌకర్యం కలగకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.

ప్రజా శౌచాలయం నిర్వహణ, పారిశుధ్య పరిస్థితులను జీవీఎంసీ ప్రజారోగ్య విభాగం అధికారులు నిత్యం పర్యవేక్షించేలా చర్యలు చేపట్టాలని తూర్పు జోన్ జోనల్ కమిషనర్ కె. శివప్రసాద్‌ను కమిషనర్ ఆదేశించారు. సుమారు రూ.30 లక్షలతో ప్రజా శౌచాలయాన్ని నిర్మించి నిర్వహణ బాధ్యతలు చేపట్టిన లోటస్ ఇంటర్నేషనల్ సంస్థను అభినందించారు.

ఈ సందర్భంగా జీవీఎంసీ అదనపు కమిషనర్ పల్లి నల్లన్నయ్య మాట్లాడుతూ, నిత్యం రద్దీగా ఉండే మద్దిలపాలెం జంక్షన్‌లో ప్రజలు, ప్రయాణికుల సౌకర్యార్థం లోటస్ ఇంటర్నేషనల్ సంస్థ ఆధునిక ప్రజా శౌచాలయాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. నిరంతర పర్యవేక్షణతో నిత్య పరిశుభ్రత పాటిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సంస్థ ప్రతినిధులకు సూచించారు.

లోటస్ ఇంటర్నేషనల్ సంస్థ వ్యవస్థాపకులు డా. సరాజ్ కుమార్ మాట్లాడుతూ, నగర పారిశుధ్యాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో BOT విధానంలో సుమారు రూ.30 లక్షల వ్యయంతో ప్రజా శౌచాలయాన్ని నిర్మించినట్లు తెలిపారు. ఇది ప్రతిరోజూ ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ఇందులో మొత్తం ఎనిమిది క్యూబికల్స్ ఏర్పాటు చేశామని, దివ్యాంగుల సౌకర్యార్థం పురుషులు, మహిళల విభాగాల్లో ఒక్కొక్క ప్రత్యేక క్యూబికల్‌ను ఏర్పాటు చేసినట్లు వివరించారు.

ప్రజా శౌచాలయంలో యూరినల్స్ వినియోగానికి రూ.5, టాయిలెట్ వినియోగానికి రూ.10, స్నానానికి రూ.20 చొప్పున వినియోగ రుసుములు ఉంటాయని, ప్రజలకు పరిశుభ్రమైన, సౌకర్యవంతమైన సేవలు అందించేలా నిర్వహణ చేపడతామని డా. సరాజ్ కుమార్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో జీవీఎంసీ డిప్యూటీ సిటీ ప్లానర్ హరిదాసు, సహాయక వైద్యాధికారి బి. ప్రసాద్ రావు, లోటస్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రతినిధులు, జీవీఎంసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

పౌర సంబంధాల అధికారి జివిఎంసి

Post a Comment

0 Comments