విశాఖపట్నం(బీచ్‌రోడ్డు):సమాజ హితంగా కళను వినియోగించడం అభినందనీయమని సౌత్‌కోస్ట్ రైల్వే డి.ఆర్.ఎం లలిత్ బోహ్రా అన్నారు. శుక్రవారం ఉదయం ప్రపంచ ఆహార దినోత్సవాన్ని పురస్కరించుకుని బీచ్‌రోడ్డులోని వైఎంసిఏ వద్ద మిలెట్ చిత్రకారుడు మోకా విజయ్ కుమార్ తీర్చిదిద్దిన ఆర్ట్ ఎగ్జిబిషన్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం మిల్లెట్స్‌తో తయారు చేసిన చిత్రాలను ఎంతో ఆసక్తిగా తిలకించి, వాటి ప్రాధాన్యత, కధనాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన ఆహార వారసత్వాన్ని తెలుసుకోవడం, సంరక్షించుకోవడం ఎంతో ప్రధానమన్నారు. ప్రజలు ఆరోగ్య జీవనం అలవరచుకోవాలని, ఆహారంలో మిల్లెట్స్‌ను భాగంగా చేసుకోవాలన్నారు. ప్రజలో ఆరోగ్య అవగాహన పెంచే విధంగా రైల్వే ఉద్యోగి, చిత్రకారుడు మెకా విజయ్ కుమార్ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. ఇటువంటి కార్యక్రమాలు ప్రజల్లో అవగాహన పెంచడానికి ఉపకరిస్తాయన్నారు.చిత్రకారుడు మెకా విజయ్ కుమార్ మాట్లాడుతూ మానవ ఆహార ప్రయాణం గా 16 చిత్రాలను వివిధ మిల్లెట్స్ ఉపయోగించి తీర్చిదిద్దడం జరిగిందన్నారు. వీటిలో మానవ ఆహార కధను వివరించడం జరిగిందన్నారు.దాదాపు ఆరు నెలల పాటు వీటిని తీర్చిదిద్ది నేడు ప్రజలముందుకు తీసుకురావడం జరిగిందన్నారు. మూడు రోజుల పాటు ఈ ప్రదర్శన కొనసాగుతుందని, ప్రజలంతా దీనిని వీక్షించాలని కోరారు.ప్రకృతి-అడవి, చిరుధాన్యాలతో మన తొలి అనుబంధం నుండి వ్యవసాయం, సాంప్రదాయ ఆహార వ్యవస్థలు, ఆధునిక ప్యాకేజ్డ్ ఆహారాలు, ఫాస్ట్-ఫుడ్ సంస్కృతి, ఆరోగ్య సమస్యలు మరియు ఆహారాలకు ప్రాధాన్యత ఇవ్వడం వరకు ఆకర్షణీయమైన చిత్రాల రూపంలో తీర్చిదిద్దానన్నారు. మన ఆహారపు అలవాట్లు ఎలా మారాయి, ఏ సాంప్రదాయ ఆహారాలను విస్మరించడం, అనారోగ్యాలకు గురవడం, సుస్థిరమైన భవిష్యత్తు కోసం మన ఆహార వారసత్వం నుండి మనం ఏమి నేర్చుకోవచ్చో ప్రజలకు అర్థమయ్యేలా చేయడమే ఈ ప్రదర్శన ప్రధాన ఉద్దేశమన్నారు. 16 కళాకృతులు ఆహారం,వ్యవసాయం, సంస్కృతి, ఆరోగ్యం, జీవనశైలి, సుస్థిరతలను అనుసంధానిస్తూ చిత్రాలుగా తీర్చిదిద్దానన్నారు. తద్వారా ఈ కథ పిల్లలు, విద్యార్థులు, కుటుంబాలు, రైతులు మరియు సాధారణ ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా చేస్తుంది. మన ఆహార వారసత్వం, ఆరోగ్యకరమైన భవిష్యత్తును అందిస్తుందన్నారు. దీనిని గుర్తించి మనం మన ఆహారపు అలవాట్లను మార్పు చేసుకోవాలన్నారు.




0 Comments