విశాఖపట్నం, అక్టోబర్ 28: విశాఖపట్నం జిల్లాలో తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో సహాయక, పునరుద్ధరణ చర్యలను వేగవంతం చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ తెలిపారు. జిల్లావ్యాప్తంగా సుమారు 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని, ఈదురుగాలుల కారణంగా సుమారు వెయ్యి చెట్లు నేలకొరిగాయని వెల్లడించారు. నిరంతరం కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని, వచ్చిన ప్రతీ కంప్లైంటుకూ వెనువెంటనే స్పందిస్తూ తక్షణ చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.
దెబ్బతిన్న విద్యుత్ ఫీడర్లను పునరుద్ధరించామని, మిగిలిన సర్వీస్ కనెక్షన్లకు కూడా బుధవారం రాత్రికల్లా విద్యుత్ సరఫరా అందించేందుకు చర్యలు చేపట్టామని ప్రకటనలో తెలిపారు. ప్రధాన రహదారులపై చెట్లను తొలగించి రాకపోకలను పునరుద్ధరించామని, ప్రమాదకర చెట్లు, విద్యుత్ స్తంభాలను గుర్తించి తొలగిస్తున్నామన్నారు.
_57 సహాయక శిబిరాల్లో 600 కుటుంబాలకు ఆశ్రయం_
తుపాను ప్రభావిత తీరప్రాంత, కొండవాడ ప్రాంతాల నుంచి సుమారు 600 కుటుంబాలను 57 సహాయక శిబిరాలకు తరలించి అవసరమైన సదుపాయాలు కల్పించినట్లు వివరించారు. నగర, గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు చేపడుతున్నామని, డ్రెయిన్లను శుభ్రం చేసి చెత్తను తొలగిస్తున్నామన్నారు. రోడ్లు, ఫుట్‌పాత్‌లపై మిగిలిన చెట్లు, విరిగిన కొమ్మలను గురువారం ఉదయం లోపు తొలగించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రజారోగ్య పరిరక్షణకు జిల్లావ్యాప్తంగా వైద్య శిబిరాలు నిర్వహిస్తూ అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు చేపడుతున్నామని పేర్కొన్నారు.
*మరో 12-24 గంటలు భారీ వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి*
తుపాను తీరం దాటినప్పటికీ రాబోయే 12 నుంచి 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గురువారం అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినట్లు వెల్లడించారు. ప్రజల భద్రత దృష్ట్యా బుధవారం రాత్రి 9 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు అనవసర రాకపోకలను నియంత్రించనున్నట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలు బయటకు రావద్దని, అధికారుల సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. సహాయక, పునరుద్ధరణ చర్యలు నిరంతరాయంగా కొనసాగుతాయని పేర్కొన్నారు.

0 Comments