కూటమి అభ్యర్థులకు ఓటు వేస్తే అభివృద్ధికి ఓటు వేసినట్లే – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్


విశాఖపట్నం : అక్టోబర్ 29, 2026 విశాఖపట్నం నగరంలోని 88వ వార్డు గొంతినవానిపాలెం, 98వ వార్డు శ్రీనగర్, 85వ వార్డు అక్కిరెడ్డిపాలెంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, నియోజకవర్గ ఇన్‌ఛార్జి కరణంరెడ్డి నరసింగరావు కూటమి నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంపిణీ చేస్తూ కూటమి అభ్యర్థులకు మద్దతు కోరారు.

88వ వార్డు కూటమి అభ్యర్థి సిరసపల్లి నూకరాజుకు, 98వ వార్డు అభ్యర్థి దేనంకొండ కృష్ణంరాజుకు, 85వ వార్డు అభ్యర్థి గొర్రపాటి సునీతకు కమలం గుర్తుపై, మేయర్ అభ్యర్థి డాక్టర్ ముక్కా శ్రావణికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని పీవీఎన్ మాధవ్ ప్రజలను కోరారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి అభ్యర్థులకు ఓటు వేయడం ద్వారా అభివృద్ధికి బాటలు వేయవచ్చన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయని, స్థానిక సంస్థల్లోనూ కూటమి ప్రజాప్రతినిధులు ఉంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నగరాభివృద్ధికి మరింత సమన్వయంతో పనిచేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

కేంద్రం, రాష్ట్రం, స్థానిక సంస్థల మధ్య సమన్వయమే అభివృద్ధికి కీలకం అని ఆయన అన్నారు. మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

 అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రజలకు చేరేలా కూటమి కృషి చేస్తుందని తెలిపారు.

ఈ ప్రచార కార్యక్రమంలో కూటమి నాయకులు డాక్టర్ గొర్లె సత్యనారాయణ, సంతోష్ నాయుడు, పావని, వరహాలరావు, జాగారపు శ్రీను, కిరణ్ శర్మ, బగ్గు ఈశ్వరరావు, ప్రసాద్, గోవింద్, నాయుడు, రమాదేవి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments